జనవరి 19, 2022
సామాన్య కాలం రెండవ వారపు బుధవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
యేసుపై నేరం మోపడానికి, ఆయన విశ్రాంతి దినాన అతనిని స్వస్థపరుస్తారేమోనని వారు ఆయనను నిశితంగా గమనించారు. మార్కు 3:2
యేసు గురించి తమ ఆలోచనలను అసూయ కమ్ముకోవడానికి పరిసయ్యులు ఎంతో సమయం పట్టనివ్వలేదు. అందరి దృష్టీ తమపైనే ఉండాలని పరిసయ్యులు కోరుకున్నారు. ధర్మశాస్త్రానికి ప్రామాణిక బోధకులుగా అందరూ తమను గౌరవించి ఆదరించాలని వారు ఆశించారు. అందుకే యేసు వచ్చి, అధికారంతో బోధించడం చూసి అనేకులు ఆశ్చర్యపోయినప్పుడు, పరిసయ్యులు వెంటనే ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు.
వారి ప్రవర్తనలో మనకు కనిపించే విచారకరమైన వాస్తవం ఏమిటంటే, తమలోని దుర్బుద్ధిని తామే చూడలేనివారిగా వారు కనిపిస్తున్నారు. వారిని నింపిన అసూయవల్ల, తాము నిజంగా ఎంత అహేతుకంగా ప్రవర్తిస్తున్నారో వారు గ్రహించలేకపోతున్నారు. ఇది నేర్చుకోవలసిన ముఖ్యమైన, ఎంతో కష్టమైన పాఠం.
పాపం మనలను అయోమయానికి గురిచేస్తుంది; ముఖ్యంగా గర్వం, అసూయ, కోపం వంటి ఆధ్యాత్మిక పాపాలు అలా చేస్తాయి. అందువల్ల, ఈ పాపాలలో ఏదైనా ఒకటి ఎవరినైనా పూర్తిగా ఆవరించినప్పుడు, తమ ఆలోచన ఎంత అహేతుకంగా మారుతుందో కూడా వారు గ్రహించకపోయే అవకాశమే ఎక్కువ. పరిసయ్యుల ఉదాహరణను తీసుకోండి.
విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరచాలని నిర్ణయించుకునే పరిస్థితి యేసుకు ఎదురవుతుంది. ఇది ఒక కారుణ్య కార్యం. ఆ వ్యక్తిని అతని బాధ నుండి విముక్తుణ్ణి చేయడానికి, అతనిపై ప్రేమతో ఇది జరుగుతుంది. ఇది అద్భుతమైన మహత్కార్యమైనప్పటికీ, కలతచెందిన పరిసయ్యుల మనస్సులు ఈ కారుణ్య కార్యాన్ని పాపకార్యంగా వక్రీకరించే మార్గం కోసమే వెదుకుతాయి. ఎంత భయంకరమైన దృశ్యం!
మొదట్లో ఇది ధ్యానించడానికి అంత స్ఫూర్తిదాయకమైన ఆలోచనగా అనిపించకపోయినా, దీనిపై ధ్యానించడం అవసరం. ఎందుకు? ఎందుకంటే మనమందరం ఏదో ఒక స్థాయిలో ఇటువంటి పాపాలతో పోరాడుతున్నాము. అసూయ, కోపం మనలోకి చొరబడి, ఇతరులతో మనం మెలిగే తీరును వక్రీకరించకుండా ఉండేందుకు మనమందరం పోరాడుతున్నాము. అయినప్పటికీ, పరిసయ్యులు చేసినట్లే మనం కూడా చాలా తరచుగా మన చర్యలను సమర్థించుకుంటాము.
అత్యంత దురదృష్టకరమైన ఈ దృశ్యాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. అయితే, పరిసయ్యుల చెడు మాదిరి మీ హృదయంలో కూడా అలాంటి ధోరణులు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి మీకు సహాయపడుతుందనే ఆశతో ధ్యానించండి. వారు పోరాడుతున్న ఈ ధోరణులను గుర్తించడం, పాపం ఫలితంగా కలిగే అహేతుకమైన ఆలోచనలో పడిపోకుండా మిమ్మల్ని విముక్తులను చేయడానికి తోడ్పడాలి.
అత్యంత కరుణామయుడవైన నా ప్రభువైన యేసూ, దయచేసి నా పాపాలన్నిటినీ క్షమించు. నేను పశ్చాత్తాపపడుతున్నాను. నా ఆలోచనలను, చేతలను మసకబార్చే వాటన్నిటినీ గుర్తించగలిగేలా చేయమని ప్రార్థిస్తున్నాను. నాకు విముక్తిని ప్రసాదించు. నేను ఏ స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండాలని పిలువబడ్డానో, ఆ ప్రేమతో నిన్ను, ఇతరులను ప్రేమించేందుకు నాకు సహాయం చేయు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జీవం కోసం 9 రోజులు నవదిన ప్రార్థన
జనవరి 19–27
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
జీవం కోసం 9 రోజులు నవదిన ప్రార్థన
జనవరి 19–27
జీవం కోసం 9 రోజులు అనేది మానవ జీవ పరిరక్షణ కోసం చేసే నవదిన ప్రార్థన. ప్రతి రోజు ప్రార్థనా ఉద్దేశంతోపాటు ఒక చిన్న ధ్యానం, జీవ సంస్కృతిని నిర్మించేందుకు తోడ్పడే సూచిత కార్యాచరణలు ఉంటాయి.
- మొదటి రోజు: జనవరి 19
- రెండవ రోజు: జనవరి 20
- మూడవ రోజు: జనవరి 21
- నాలుగవ రోజు: జనవరి 22
- ఐదవ రోజు: జనవరి 23
- ఆరవ రోజు: జనవరి 24
- ఏడవ రోజు: జనవరి 25
- ఎనిమిదవ రోజు: జనవరి 26
- తొమ్మిదవ రోజు: జనవరి 27




