తెలుగు

అచంచల నిష్ఠ

మంగళవారం, జూలై 22, 2025

పునీత మగ్దలేనా మరియ పండుగ

నేటి పఠనాలు

ఫోండాజియోనే కారిప్లో, CC BY-SA 3.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

మరియ సమాధి వెలుపల నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూనే సమాధిలోకి వంగి చూసింది. యేసు దేహం ఉంచబడిన చోట తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు, ఒకరు తలవైపు మరొకరు పాదాలవైపు కూర్చొని ఉండటం ఆమె చూసింది. యోహాను 20:11–12

యేసు తన పరిచర్య ప్రారంభంలో మగ్దలా మరియ నుండి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టారు. దాని ఫలితంగా, ఆమె అసాధారణమైన నిష్ఠతో యేసును అనుసరించే శిష్యురాలైంది. యేసు, ఆయన శిష్యులు ప్రయాణిస్తున్నప్పుడు, తన సొంత వనరులతో వారి అవసరాలు తీర్చిన అనుచరులలో ఆమె కూడా ఒకరై ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె ఆయన బోధలను విన్నది, ఆయన అద్భుతాలను చూసింది, ఆయనకు శిక్ష విధించినప్పుడు అక్కడే ఉంది, యేసు తల్లితో కలిసి సిలువ పాదాల చెంత నిలిచింది, ఆయన దేహాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేయడంలో సహాయపడింది. ఆయన పునరుత్థానం తరువాత యేసు మొట్టమొదట ప్రత్యక్షమైన వ్యక్తిగా పవిత్ర గ్రంథంలో పేర్కొనబడినది ఆమెనే.

సమాధిలో ఉంచబడిన యేసు మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడాన్ని పూర్తి చేయడానికి ఆదివారం తెల్లవారుజామున మరియ సమాధి వద్దకు వెళ్ళిన సంఘటనను నేటి దివ్యబలిపూజలోని సువార్త వివరిస్తుంది. అయితే, ఆమెను ఎంతో ఆశ్చర్యపరుస్తూ సమాధి ఖాళీగా ఉంది. అందువల్ల ఆమె అపొస్తలులకు తెలియజేయడానికి పరుగెత్తింది. ఈ విధంగా మరియ మగ్దలేనా ఆయన అనుచరులలో పునరుత్థానానికి సాక్ష్యమిచ్చిన మొదటి వ్యక్తి అయింది. అపొస్తలులకు తెలియజేసిన తరువాత ఆమె పేతురు, యోహానులతో కలిసి సమాధి వద్దకు తిరిగి వచ్చింది. పేతురు, యోహాను వెళ్ళిపోయిన తరువాత కూడా, పైన పేర్కొన్న సువార్త భాగంలో చెప్పినట్లుగా, ఆమె సమాధి వెలుపల ఏడుస్తూ ఉండిపోయింది.

మరియ కన్నీళ్ళు సుందరమైనవి. అవి తన ప్రభువుపట్ల ఆమెకున్న ప్రగాఢ భక్తికి వ్యక్తీకరణ. ఆయన పునరుత్థానుడయ్యారని ఆమెకు ఇంకా అర్థం కాలేదు. అయినా యేసుపట్ల ఆమె నిష్ఠ ఆమె ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తుంది. యేసు ఆమె గౌరవాన్ని పునరుద్ధరించారు. ఆమెను పీడించిన ఏడు దయ్యాల నుండి ఆమెకు విముక్తి కలిగించారు. ఆమె గతంలో పాప జీవితాన్ని గడిపిన స్త్రీ అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె లోక రక్షకునికే పూర్తిగా అంకితమైంది.

మగ్దలా మరియ సాక్ష్యం మనందరికీ ప్రేరణ కలిగించాలి. ఏడు దయ్యాలు పట్టినవారు కొద్దిమందే అయినప్పటికీ, మనమందరం ఏదో ఒక విధంగా పీడింపబడుతున్నాము. మనమందరం పాపం చేస్తాము. మనమందరం బలహీనులమే. మనందరి గతంలోనూ మనం విచారించే విషయాలు ఉన్నాయి. మరింత మెరుగ్గా జీవించడానికి మనందరికీ ఆహ్వానం ఉంది. మరియ విషయంలో ఆ “మెరుగైన” జీవితం, అత్యంత నిష్ఠతో యేసుకు అంకితమైన జీవితంగా మారింది. సిలువ పాదాల చెంత తనను అధికారులు చూసినా ఆమె పట్టించుకోలేదు. దాని కారణంగా వారు తనను హింసించినా ఆమెకు లెక్కలేదు. ఆమె నిష్ఠతో నిలిచింది. యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు సైనికులు తనను వేధించినా ఆమె పట్టించుకోలేదు—ఆయనకు తాను అర్పించగల ఆ చివరి ప్రేమకార్యం గురించే ఆమె ఆలోచించింది. పునరుత్థానుడైన యేసును చూసి ఆయన తోటమాలి అని అనుకున్నప్పుడు కూడా, విరిగిన హృదయంతో కన్నీళ్ళు కారుస్తున్న తనను ఆయన చూస్తున్నారని ఆమె పట్టించుకోలేదు—ఆమె కోరుకున్నదల్లా తన ప్రభువు దేహాన్ని చూడటమే.

ఆమె అచంచల నిష్ఠకు ప్రతిఫలంగా యేసు ఆమెకు ఊహకందని వరాన్ని ఇచ్చారు. మృతులలో నుండి పునరుత్థానుడైన తరువాత ఆయన ఆమెకు ప్రత్యక్షమై, అపొస్తలులకు అపొస్తలురాలిగా ఆమెను పంపారు. యేసు పునరుత్థానుడయ్యారని, పరలోకంలోని తన తండ్రి వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని అపొస్తలులకు తెలియజేయడానికి ఆయన ఆమెను వారి వద్దకు పంపారు.

ఈ స్త్రీ పవిత్ర ఆత్మను గురించి ఈరోజు ధ్యానించండి. ఆమె పశ్చాత్తాపంతో తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న పాపాత్మురాలు. ఆమె సమస్తాన్ని యేసుకు అంకితం చేసింది; ప్రతిగా అంతకంటే ఎక్కువే పొందింది. పరలోకంలో మరియ మగ్దలేనా ఎల్లప్పుడూ యేసును అంటిపెట్టుకొని, ఆయన తిరుహృదయాన్ని ఆరాధిస్తుంది. మన పాప జీవితం నుండి వైదొలిగి, మన ప్రభువుపట్ల అచంచల నిష్ఠతో జీవించడం ద్వారా ఆమెను అనుకరించడానికి మనమందరం కృషి చేద్దాం.

పునరుత్థానుడైన నా ప్రభువా, నీ పునరుత్థానం తరువాత నీవు మొదట మగ్దలాకు చెందిన మరియకు కనిపించావు. ఇప్పుడు పరలోకంలో నీ మహిమాన్విత జీవితంలో పాలుపంచుకోవడానికి ఆమెను ఆహ్వానిస్తున్నావు. సమస్త పాపాలనుండి వైదొలగి, నీ పట్ల గాఢమైన భక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఆమె నుండి నేర్చుకోవడానికి నాకు సహాయం చేయి. ప్రియ ప్రభువా, నేను కూడా ఒకరోజు నీ పునరుత్థాన మహిమలో పాలుపంచుకునేలా, నీ పట్ల నా నిష్ఠ సంపూర్ణంగా, అచంచలంగా ఉండునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నేటి పునీతురాలు –  పునీత మగ్దలేనా మరియ

మగ్దలేనా మరియ ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడే వ్యాసం – న్యూ అడ్వెంట్

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు