సోమవారం, సెప్టెంబరు 15, 2025
డాడెరోట్, పబ్లిక్ డొమైన్, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
యేసు సిలువ దగ్గర ఆయన తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనా మరియ నిలబడి ఉన్నారు. యోహాను 19:25
దేవుని కుమారుని తల్లి అయిన మన ధన్యమాత తన కుమారుణ్ణి పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించింది. ఆమె ప్రతి సుగుణానికీ పరిపూర్ణంగా సజీవ రూపమిచ్చింది. తన కుమారునిపట్ల ఆమెకున్న ప్రేమ మన ఊహకందనిది. ఆమె అద్భుతరీతిలో ఆయనను గర్భాన ధరించింది, తన గర్భంలో మోసింది, ఆయనకు జన్మనిచ్చింది, పాలిచ్చింది, పెంచింది, ఆయన జీవితమంతా ఆయనను ప్రేమించింది. యేసుపట్ల ఆమెకున్న ప్రేమలోని లోతును, సౌందర్యాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. సాధారణంగా, తల్లిప్రేమ శక్తిమంతమైనది, చలించనిది, లోతైనది, వాత్సల్యంతో నిండినది. మరియమాత నిర్మల హృదయాన్ని, ఆమె హృదయంలో సజీవంగా ఉన్న ప్రేమలోని అద్భుతమైన లోతును ఊహించుకోవడానికి ప్రయత్నించండి.
పైన పేర్కొన్న సువార్త వచనంలో వర్ణించిన దృశ్యాన్ని కూడా ఊహించుకోండి. ప్రేమమయియైన ఈ తల్లి సిలువ చెంత నిలబడి, సిలువ వేయబడిన తన కుమారుని వైపు చూస్తూ, మాతృసహజమైన ప్రతి సుగుణాన్నీ ప్రసరింపజేస్తూనే ఉంది. తన కుమారునిపట్ల ఆమెకున్న ప్రేమలోని లోతును గ్రహించడం కష్టం కాబట్టి, యేసుపై జరుగుతున్న క్రూరత్వాన్ని చూస్తూ ఆమె అనుభవించిన దుఃఖం, అంతరంగ వేదనల లోతును ఊహించుకోవడం కూడా ఎంతో కష్టం. ఆ తీవ్రమైన వేదనా సమయంలో ఆమె చేయగలిగిందల్లా ఆయన చెంత, ఆయనతో పాటు నిలబడటమే. ఆ క్షణంలో ఆయనపట్ల ఆమె చూపిన నిష్ఠ ద్వారా ఆమె ప్రేమ వ్యక్తమైంది.
ఆమె నిర్మల హృదయంలో ప్రేమ, దుఃఖం, కనికరం, బాధ అన్నీ ఒక్కటిగా ఏకమయ్యాయని తెలుసుకోవడం ఎంతో అందమైన విషయం. సుందరమైన ఆమె హృదయంలో మానవ భావోద్వేగాలన్నీ ఉన్నాయి. దేవుని కృప వాటికి బలమిచ్చి, తన దగ్గరున్న అత్యంత గొప్ప బహుమానమైన తన మాతృత్వాన్ని తన కుమారునికి సమర్పించేందుకు ఆమెకు తోడ్పడింది. ఆమె తన జీవితమంతా నిజమైన తల్లిగా జీవించింది. తన కుమారుడు సిలువపై వేలాడుతున్న ఈ క్షణంలో, ఆమె మాతృత్వం పరిపూర్ణమైన మానవ వ్యక్తీకరణలో పరాకాష్ఠకు చేరుకుంది.
మనమందరం ఇతరుల ప్రేమను పొందాలని తపిస్తాం. ప్రేమను ఇవ్వడం, పొందడం—మనం ఇవ్వగలిగే, పొందగలిగే బహుమానాలన్నిటిలో అత్యంత గొప్పది. మనం సృష్టించబడింది ప్రేమ కోసమే; జీవితంలో మనకు పరిపూర్ణ సంతృప్తిని ఇచ్చేది ప్రేమే. మరియమాత సిలువ చెంత నిలబడి ఉన్నప్పుడు, ఆమె మానవ హృదయం ఇంతవరకు ఎరుగనంత గొప్ప పరిపూర్ణ సంతృప్తిని అనుభవించిందని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. తన మాతృప్రేమను పరిపూర్ణంగా వ్యక్తపరచడం వల్ల ఆమె హృదయం ఆ పరిపూర్ణ సంతృప్తిని పొందింది.
ఈ రోజు దేవమాత స్వరూపాన్ని తేరిపార చూడండి. ముఖ్యంగా, తన మానవ హృదయంలో ఆమె అనుభవించి ఉండే వాటన్నిటినీ ధ్యానించండి. వేదాంతులు ఈ ధ్యానాంశంపై ఎన్నో సంపుటాలు రాయగలిగినా, ఆమె ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం ప్రార్థనాపూర్వక ధ్యానమే. ఈ రోజు తన హృదయాన్ని మీకు వెల్లడించమని మన ధన్యమాతను అడగండి. పరిపూర్ణ మాతృప్రేమకు ప్రతిరూపమైన ఈ పవిత్ర స్వరూపం ఎదుట మౌనంగా భక్తిపూర్వక ధ్యానంలో కూర్చోవడానికి కొంత సమయం కేటాయించండి. అలా చేస్తున్నప్పుడు రెండు విషయాలు తెలుసుకోండి. మొదటిది, మరియమాతకు మీపట్ల కూడా ఇంతే గాఢమైన ప్రేమ ఉందని తెలుసుకోండి. దానిని సందేహించకండి. మీరు పాపంలో ఉన్నప్పటికీ, ఆమె మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆమె హృదయం కనికరంతో జ్వలిస్తుంది. రెండవది, మన ధన్యమాత ప్రేమ మీ హృదయాన్ని కూడా నింపి, ఇతరుల జీవితాల్లోకి పొంగిపొరలాలని తెలుసుకోండి. ఆమె కనికరం, శ్రద్ధ, నిష్ఠ, కరుణ మన హృదయాల ద్వారా ప్రవహించడానికి మనమందరం అనుమతించాలి. మన ధన్యమాత హృదయంతో మీరు ఎవరిని ప్రేమించాలి? దేవమాత హృదయంలోని ప్రేమను పొందడానికి, ఆ ప్రేమను ఇతరులకు ఇవ్వడానికి కృషి చేయండి. దానిని మీలో స్వీకరించి, ఆ తరువాత అది బయటకు ప్రవహించనివ్వండి. ఈ ప్రేమకు ప్రతిరూపమైన పవిత్ర స్వరూపం కంటే అందమైనది, విస్మయాన్ని కలిగించేది ఈ లోకంలో నిజంగా మరేదీ లేదు.
నా నిష్కళంక, వ్యాకుల మాతా, మాతృప్రేమ పరిపూర్ణతతో నీవు నీ కుమారుని సిలువ పాదాల వద్ద నిలిచావు. ప్రతి పవిత్ర సద్గుణంతో మిళితమైన దుఃఖంతో నీ హృదయం నిండిపోయింది. ఈ ప్రేమను నేను మరింత సంపూర్ణంగా అర్థం చేసుకొని, నీ ప్రేమకు నా హృదయాన్ని కూడా తెరవగలిగేలా నా కొరకు ప్రార్థించు. అలా నా హృదయాన్ని తెరుస్తూ, నా జీవితంలో బాధలు అనుభవిస్తూ, సున్నితమైన కనికరం, కరుణ ఎంతో అవసరమైనవారి పట్ల నీ హృదయంలో ఉన్న ప్రేమకు నేను ఒక సాధనంగా మారాలని ప్రార్థిస్తున్నాను. మరియమ్మ వ్యాకుల హృదయమా, మా కొరకు ప్రార్థించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
వ్యాకుల మాతకు నవదిన ప్రార్థన
సాంప్రదాయంగా సెప్టెంబరు 7–15 తేదీలలో ప్రార్థిస్తారు
మరింత పఠనం – వ్యాకుల మాత
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు




