తెలుగు

క్షమించడం మన ప్రార్థనను పోషిస్తుంది

శుక్రవారం, జూన్ 1, 2018

సామాన్య కాలంలోని ఎనిమిదవ వారపు శుక్రవారం

నేటి పఠనాలు

పునీత జస్టిన్ వేదసాక్షి – జ్ఞాపకార్థ దినం

“మీరు నిలబడి ప్రార్థించేటప్పుడు, ఎవరి మీదనైనా మీకు విరోధభావం ఉంటే వారిని క్షమించండి. అప్పుడు పరలోకంలోని మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమిస్తారు.”  మార్కు 11:25

ప్రార్థన విషయంలో చాలామంది కష్టపడుతుంటారు.  క్రీస్తుపై లోతైన విశ్వాసం కలిగినప్పుడు, ఆయనకు మరింత దగ్గరవ్వాలని, ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలని మనం కోరుకుంటాం.  అయితే తరచూ ఇది కష్టంగా అనిపించవచ్చు. మొదట్లో ఉన్న మంచి సంకల్పాలు సన్నగిల్లడం ప్రారంభమైనప్పుడు చాలామంది ప్రార్థనను విడిచిపెట్టవచ్చు.

ప్రార్థన గురించి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. అయినప్పటికీ, పైన ఉన్న లేఖన వాక్యం సుస్థిరమైన ప్రార్థనా జీవితానికి ఎదురయ్యే అతి పెద్ద అడ్డంకులలో ఒకదాన్ని స్పష్టంగా చూపిస్తుంది.  యేసు చెప్పే ఆ అడ్డంకి క్షమించకపోవడమే. 

ప్రార్థనలో మనం క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఆయన మాట వినాలంటే ముందుగా మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి.  మరొకరి పట్ల విరోధభావాన్ని మనసులో ఉంచుకొని ఆయన వద్దకు వస్తే, ముందుగా ఆ అడ్డంకిని తొలగించుకోవాలి.  నిజానికి, ఆ విరోధభావాన్ని పట్టుకొని ప్రార్థించడానికి ప్రయత్నిస్తే, మన ప్రార్థన అంతగా ఫలవంతం కాకపోవడమే ఎక్కువగా సంభవిస్తుంది.

పైన పేర్కొన్న లేఖన భాగానికి సరిగ్గా ముందు, యేసు దేవాలయాన్ని శుద్ధి చేసిన సంఘటన ఉంది.  వ్యాపారులు తమ దురాశతో దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నందున ఆయన వారి బల్లలను తలకిందులు చేసి, వారిని బయటకు వెళ్లగొట్టారు.  ఈ సంఘటనను మన సొంత ఆత్మలకు సంబంధించిన సంఘటనగా కూడా మనం చూడాలి.  మన ఆత్మలు దేవుని ఆలయాలు. మన ఆత్మలో పాపం ఉండటం యేసుకు ఇష్టం లేదు.  నిజానికి, ఎంతో తపనతో, గొప్ప ఉత్సాహంతో దానిని వేళ్లతో సహా తొలగించాలని ఆయన కోరుకుంటున్నారు.  ఆయన అలా చేయడానికి అనుమతించడం, మన ఆత్మలను పాపం నుండి, ముఖ్యంగా క్షమించకపోవడం అనే పాపం నుండి శుద్ధి చేయడానికి ఆయనను అనుమతించడం మన లక్ష్యం కావాలి.  అలా చేస్తే మన ఆత్మలు ప్రార్థనకు, ఆరాధనకు నిలయాలుగా మారగలవు.

ప్రార్థనలో ఎదగాలని మీరు కోరుకుంటున్నారా అని ఈ రోజు ధ్యానించండి.  కోరుకుంటుంటే, మీ హృదయాన్ని సమస్త పాపం నుండి శుద్ధి చేసుకోవడంతో ప్రారంభించండి.  ఇందుకు పాపసంకీర్తనం ఉత్తమమైన మార్గం.  మీలో కోపం లేదా క్షమించకపోవడం అనే పాపం ఏదైనా ఉందేమో పరిశీలించడంతో ప్రారంభించండి.  క్షమించాలని నిర్ణయించుకొని, కోపాన్ని విడిచిపెట్టడం ద్వారా, ఈ దుర్గుణాన్ని మీ ఆత్మ నుండి వెళ్లగొట్టడానికి యేసును మీరు అనుమతిస్తున్నారు.  ఫలితంగా, మీ హృదయాన్ని తన నివాసంగా చేసుకోమని క్రీస్తును ఆహ్వానించడానికి మీరు మరింత సిద్ధంగా ఉంటారు.  అలా జరిగినప్పుడు, మీ ప్రార్థనా జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

ప్రభూ, దయచేసి నన్ను క్షమించు.  నా పాపాన్ని నేను గుర్తిస్తున్నాను, దాని గురించి పశ్చాత్తాపపడుతున్నాను.  నాకు వ్యతిరేకంగా పాపం చేసినవారిని కూడా నేను క్షమిస్తున్నాను.  నాలో ఉన్న ఏ కోపాన్నైనా విడిచిపెట్టి, దాని స్థానంలో నీ ప్రేమను స్వీకరించడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని>>>

నేటి పునీతులు – పునీత జస్టిన్ వేదసాక్షి