తెలుగు

మన ధన్యమాత

మంగళవారం, జూలై 24, 2018

సామాన్య కాలం పదహారవ వారంలోని మంగళవారం

నేటి పఠనాలు

పునీత షర్బెల్ మఖ్లూఫ్, యాజకుడు, ఏకాంతవాసి – ఐచ్ఛిక స్మరణ

“నా తల్లి ఎవరు? నా సోదరులు ఎవరు?” అని ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. ఎందుకంటే నా పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని అన్నారు.  మత్తయి 12:48-50

ఈ వచనభాగం ధన్య కన్య మరియమ్మ గురించి మాట్లాడటానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఈ వచనభాగాన్ని చదివే కొందరు, యేసు ఏదో ఒక విధంగా తన తల్లికి దూరమవుతున్నాడని పొరబడతారు. ఆయన మాటలు తన జీవితంలో ఆమెకున్న ప్రత్యేక పాత్రను విస్మరిస్తున్నాయని వారు భావిస్తున్నట్లుంది. ఇది సత్యానికి పూర్తిగా విరుద్ధం.

నిజానికి, ఆయన మాటలు అన్నిటికంటే ఎక్కువగా ఆమె మాతృత్వాన్నే ధృవీకరిస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే, ఒక వ్యక్తి తన కుటుంబంలో నిజమైన సభ్యులుగా ఎలా అవుతారో ఆయన చెబుతున్నాడు. “పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు” అది జరుగుతుంది.

ఆ మాట గురించి ఆలోచించండి. పరలోక తండ్రి చిత్తాన్ని ఆమెకంటే బాగా ఎవరు నెరవేర్చారు? అన్ని విషయాల్లో ధన్య కన్య మరియమ్మకంటే ఎక్కువ విధేయత చూపినవారు ఎవరు? ఎవరూ లేరు. ఆమె తన జీవితమంతటా సంపూర్ణ విధేయతతో నడుచుకుంది. అందువల్ల, యేసు కుటుంబంలో భాగంగా ఉండటానికి అవసరమైన అర్హతను ఆమె సంపూర్ణంగా నెరవేరుస్తుంది.

ఈ వచనభాగం నుండి మనం గ్రహించవలసిన ఒక విషయం ఏమిటంటే, మన ధన్యమాతకు యేసుతో ఉన్న బంధం రెండు స్థాయుల్లో వ్యక్తమైంది. మొదటిది, ఆమెకు వరంగా లభించిన శారీరక మాతృత్వం. ఇది అపారమైన కృపావరం; దీనిని బట్టి ఆమె గొప్ప గౌరవానికి అర్హురాలు. అయితే ఆమె ధన్యతకు ప్రధాన కారణం ఆమె శారీరక మాతృత్వం కాదు. ప్రధాన కారణం ఆమె ఆధ్యాత్మిక మాతృత్వమే. పైన పేర్కొన్న ఈ వచనభాగంలో ఈ ఆధ్యాత్మిక మాతృత్వం కనిపిస్తుంది. అన్ని విషయాల్లో దేవునికి ఆమె సంపూర్ణంగా పలికిన “అవును”కు ఇది ఫలితం. అన్ని తరాలవారు ఆమెను గౌరవించి, “ధన్యురాలు” అని పిలవడానికి ఇదే ప్రధాన కారణం.

మన ధన్యమాత మీ జీవితంలో వహించే పాత్ర గురించి ఈ రోజు ధ్యానించండి.  మీరు ఆమెను గౌరవించాలని, ఆమెను అనుసరించాలని, ఆమెను మీ కుటుంబంలో భాగంగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు.  మీరు యేసు కుటుంబ సభ్యులు కాబట్టి, ఆమెను మీ ఆధ్యాత్మిక తల్లిగా స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నారు.  మీ జీవితంలో తండ్రి చిత్తానికి విధేయులుగా ఉండటానికి మీరు కృషి చేస్తే, ఆయన జీవితపు ఆశీర్వాదాలలో మీరు కూడా పాలుపంచుకుంటారు.  ఆయన తల్లిని మీ తల్లిగా కూడా పొందడం ఆ గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి.

ప్రభువా, అన్ని విషయాల్లో నీకూ నీ చిత్తానికీ విధేయంగా ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నా జీవితం కోసం తండ్రి ఉద్దేశించిన పరిపూర్ణ ప్రణాళికను స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఆ చిత్తాన్ని అనుసరిస్తూ, నీ దివ్యజీవితంలో పాలుపొంది, నీ కుటుంబంలో సంపూర్ణ సభ్యత్వం పొందేందుకు నాకు సహాయం చేయుము. ఆ కుటుంబంలో నీ తల్లిని నా సొంత తల్లిగా స్వీకరించడానికి నాకు సహాయం చేయుము. ప్రియమైన తల్లీ, నా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని>>>

నేటి పునీతుడు – పునీత షర్బెల్ మఖ్లూఫ్