తెలుగు

నిజమైన నీతి

ఆదివారం, అక్టోబర్ 27, 2019

సామాన్య కాలపు ముప్పయ్యవ ఆదివారం, సంవత్సరం C

నేటి పఠనాలు

నేటి పునీతులందరూ

ఆంగ్లంలో వినండి

తాము నీతిమంతులమని నమ్ముతూ, మిగిలిన వారందరినీ తృణీకరించేవారికి యేసు ఈ ఉపమానం చెప్పాడు.   లూకా 18:9

ఈ పవిత్ర గ్రంథ వాక్యం పరిసయ్యుడు, సుంకరి గురించిన ఉపమానానికి పరిచయం.  ఈ ఉపమానం సాధారణంగా కనిపించే రెండు వైఖరుల మధ్య గొప్ప వ్యత్యాసాన్ని చూపిస్తుంది.  మొదటిగా, పరిసయ్యుని వైఖరి అతనికి తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉందని, ప్రజలలో తనకున్న పేరు ప్రతిష్ఠలను గొప్పగా భావిస్తున్నాడని, తన పాపాన్ని గుర్తించడం లేదని వెల్లడిస్తుంది.  రెండవదిగా, సుంకరి వైఖరి అతను తన పాపాన్ని లోతుగా గుర్తిస్తున్నాడని, దాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడని, తనకు దేవుని కరుణ అవసరమని తెలుసుకున్నాడని వెల్లడిస్తుంది.  ఎంతో భిన్నమైన ఈ రెండు వైఖరుల ఫలితంగా, సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు; పరిసయ్యుడు అలా వెళ్ళలేదు.

నీతిమంతునిగా తీర్చబడటం అంటే ఏమిటి?  సుంకరి అంతఃకరణం నిర్మలమై, అతను సత్యంలో స్థిరపడ్డాడని దాని అర్థం.  తనకు కరుణ అవసరమని అతను తెలుసుకున్నాడు, దాని కోసం వేడుకున్నాడు, దానిని పొందాడు.  అతను తనను తాను మోసం చేసుకోలేదు; ఇతరులతోగానీ, దేవునితో గానీ అబద్ధమాడలేదు.  తాను ఎవరో అతనికి తెలుసు; ఈ సత్యమే దేవుడు అతనిని ఉన్నతపరచడానికి వీలు కల్పించింది.  అతని పాపాలు క్షమించబడటం ద్వారా, అతని జీవితంలో దేవుని కరుణ ప్రసాదించబడటం ద్వారా సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు.

అందరికీ కనిపించేలా తనను తాను గొప్ప చేసుకున్నందుకు, పరిసయ్యుడు కొంతవరకు తన గురించి సంతృప్తి చెంది ఉండవచ్చు.  అతనికి తన సొంత నీతిపై గట్టి నమ్మకం ఉంది; కానీ నిజానికి అతను నీతిమంతుడు కాదు.  అతను కేవలం తన దృష్టిలో తానే నీతిమంతుడు.  అతను ఒక అబద్ధాన్ని జీవిస్తున్నాడు; బహుశా ఆ అబద్ధాన్ని తానే నమ్మి ఉండవచ్చు, ఇతరులను కూడా దానిని నమ్మించి ఉండవచ్చు.  కానీ వాస్తవం మారలేదు: పరిసయ్యుడు నీతిమంతుడు కాదు, అతను నిజంగా నీతిమంతునిగా తీర్చబడనూ లేదు.

ఈ వాక్యభాగం నుండి మనం గ్రహించవలసినది ఏమిటంటే, సత్యంలో జీవించడం ఎంత ముఖ్యమో లోతుగా తెలుసుకోవడం.  తమ గురించి తప్పుడు రూపాన్ని చిత్రించుకునేవారు తమను తాము మోసం చేసుకోవచ్చు, ఇతరులను కూడా మోసం చేయవచ్చు.  కానీ వారు దేవుణ్ణి ఎన్నటికీ మోసం చేయలేరు; తమ ఆత్మలో నిజమైన శాంతిని ఎన్నటికీ పొందలేరు.  మనలో ప్రతి ఒక్కరం మన పాపం, బలహీనత అనే సత్యాన్ని వినయంతో గుర్తించాలి; అలా గుర్తించి, వాటికి ఏకైక పరిహారమైన దేవుని కరుణ కోసం వేడుకోవాలి.

ఈ రోజు ఈ సుంకరి ప్రార్థనను ధ్యానించండి: “ఓ దేవా, పాపినైన నాపై కరుణ చూపించు” (లూకా 18:13).  దానిని మీ ప్రార్థనగా చేసుకోండి.  మీ పాపాన్ని ఒప్పుకోండి.  మీకు దేవుని కరుణ అవసరమని అంగీకరించండి; దేవుని నీతిలో ఆ కరుణ మిమ్మల్ని ఉన్నతపరచడానికి అనుమతించండి.

ప్రభువైన యేసుక్రీస్తూ, నేను పాపిని కనుక దయచేసి నాపై కరుణ చూపించు.  నా పాపాన్ని, నా బలహీనతను నేను అంగీకరిస్తున్నాను; నీ అపారమైన కరుణ కోసం వేడుకుంటున్నాను.  దయచేసి నీ కరుణను కుమ్మరించి, నీవు ప్రసాదించాలనుకునే వాటన్నిటినీ స్వీకరించడానికి నా హృదయాన్ని తెరవడంలో నాకు సహాయపడు.  ప్రియమైన ప్రభువా, వినయంతో సత్యంలో జీవించడానికి నాకు సహాయపడు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు