ఫిబ్రవరి 9, 2020
సామాన్య కాలపు ఐదవ ఆదివారం, ఎ సంవత్సరం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: “మీరు భూమికి ఉప్పు. అయితే ఉప్పు తన రుచిని కోల్పోతే, దానికి దేనితో రుచి తెప్పించగలం? దానిని బయట పారవేసి, కాళ్లతో తొక్కడం తప్ప అది మరి దేనికీ పనికిరాదు.” మత్తయి 5:13
రుచిని కోల్పోయే “ఉప్పు”గా మారకండి! అలాంటి ఉప్పుకు చివరికి జరిగేది ఏమిటంటే, దానిని బయట పారవేసి కాళ్లతో తొక్కుతారు. మరి మనం మన రుచిని ఎలా కోల్పోతాం?
ముందుగా, ఉప్పు ప్రయోజనం ఏమిటో చూద్దాం. అది ఆహారానికి రుచిని చేకూర్చే అద్భుతమైన పదార్థం. ఉప్పు ఒక్కటే తింటే అంత రుచిగా ఉండదు. కానీ రకరకాల ఆహార పదార్థాలకు కలిపినప్పుడు, అది వాటిలో కలిసిపోయి ఎంతో రుచిని చేకూరుస్తుంది.
మనం “భూమికి ఉప్పు”గా ఉండటానికి పిలువబడ్డాం. ఉప్పులాగే, మనం కేవలం ప్రముఖులుగా వెలుగొందుతూ అందరి దృష్టిని ఆకర్షించడానికే సృష్టించబడలేదు. మనకోసం మాత్రమే మనం సృష్టించబడలేదు. దానికి బదులుగా, మన ప్రపంచంలో పాలుపంచుకొని, దానికి మేలు చేకూర్చుతూ, దేవుని రాజ్యపు “రుచి”తో నిండిన కృపాకారుణ్యాల ప్రపంచంగా దానిని మార్చడానికి తోడ్పడటం మన క్రైస్తవ కర్తవ్యం. ముఖ్యంగా, సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. ఒక్కొక్కరి జీవితాన్ని స్పృశించి, వారి జీవితాన్ని మెరుగుపరచి, క్రీస్తుకు మరింత దగ్గర కావడానికి వారికి సహాయపడేలా కృషి చేయడం ద్వారా ఇది జరుగుతుంది. మన ప్రపంచంలోకి, మనం కలుసుకునేవారి జీవితాల్లోకి మనం తీసుకువచ్చే దేవుని ప్రేమను, ఆహారంలో కలిసి దాని రుచిని పెంచే ఉప్పుతో పోల్చవచ్చు.
ఇప్పుడు మన మొదటి ప్రశ్నకు తిరిగి వద్దాం. మనం మన రుచిని ఎలా కోల్పోతాం? మరో మాటలో చెప్పాలంటే, “భూమికి ఉప్పు”గా ఉండటంలో మనం ఎలా విఫలమవుతాం? మన ప్రపంచంలో పాలుపంచుకుంటూ, రకరకాల వ్యక్తులను కలుసుకున్నా, వారి జీవితాలను నిజంగా మెరుగుపరచడంలో విఫలమైనప్పుడు ఇలా జరుగుతుంది. ఇతరుల జీవితాల్లో మన ఉనికి వారికి మేలు చేసే ప్రభావాన్ని కొద్దిగా మాత్రమే చూపినా, అసలేమీ చూపకపోయినా, మన క్రియలు బయట పారవేసి “కాళ్లతో తొక్కడానికి” మాత్రమే పనికివచ్చే రుచిలేని ఉప్పులా ఉంటాయి. ఇతరుల జీవితాలపై మంచి ప్రభావం చూపించాల్సిన కర్తవ్యం మనకు ఉందని ఇది తెలియజేస్తుంది. మనం తరచూ కలుసుకునేవారి మంచితనాన్ని, విశ్వాసాన్ని పెంపొందించాల్సిన కర్తవ్యం మనకు ఉంది. ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో విఫలమైతే, ఆ సంబంధాల అసలు ఉద్దేశాన్ని మనం కోల్పోతున్నాం; భూమికి ఉప్పుగా ఉండటంలో విఫలమవుతున్నాం.
క్రీస్తు మీకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మీకు అప్పగించబడిన పిలుపును గురించి ధ్యానించండి. ఇతరుల జీవితాల్లో మీ ఉనికి ఫలితంగా వారు విశ్వాసంలోనూ ప్రేమలోనూ ఎదిగినప్పుడు, మీరు క్రీస్తు ఇచ్చిన ఈ అత్యంత ప్రాథమిక ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. మన ప్రపంచం దేవుని రాజ్యపు రుచితో నిండి మరింత మెరుగైనదిగా మారేలా, భూమికి ఉప్పుగా ఉండటానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి.
ప్రభువా, నీ సేవ కోసం, నీ మహిమ కోసం నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. మన ప్రపంచాన్ని పవిత్రమైన స్థలంగా, నీ మంచితనం నివసించే స్థలంగా మార్చడానికి నన్ను ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను. నీ చేతిలో సాధనంగా ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను; నీకు ఇష్టమైన ఏ విధంగానైనా నన్ను ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.





