తెలుగు

బూడిద బుధవారం – ప్రార్థించండి, ఉపవాసం చేయండి, దానం చేయండి

ఫిబ్రవరి 26, 2020
బూడిద బుధవారం

నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

“రహస్యంగా జరిగేవాటిని చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలమిస్తారు.”  మత్తయి 6:4b

తపస్సుకాలం ప్రారంభమవుతోంది. ప్రార్థించడానికి, ఉపవాసం చేయడానికి, ప్రేమలో ఎదగడానికి 40 రోజులు. కాస్త వెనక్కి తగ్గి మన జీవితాలను పునఃపరిశీలించుకోవడానికి, మన పాపాలనుండి వైదొలగడానికి, దేవుడు మనకు అనుగ్రహించాలని ఎంతో కోరుకునే సద్గుణాలలో ఎదగడానికి ప్రతి సంవత్సరం మనకు ఈ సమయం అవసరం. తపస్సుకాలంలోని 40 రోజులు యేసు ఎడారిలో గడిపిన 40 రోజులకు అనుకరణగా ఉండాలి. నిజానికి, యేసు ఎడారిలో గడిపిన కాలాన్ని “అనుకరించడానికి” మాత్రమే కాదు, ఈ కాలాన్ని ఆయనతో, ఆయనలో, ఆయన ద్వారా జీవించడానికి మనం పిలువబడుతున్నాం.

మరింత లోతైన పవిత్రతను పొందడానికి యేసు స్వయంగా ఎడారిలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలతో గడపవలసిన అవసరం లేదు. ఆయనే పవిత్రతా స్వరూపుడు! ఆయన దేవుని పవిత్రుడు. ఆయన పరిపూర్ణతా స్వరూపుడు. ఆయన అతి పరిశుద్ధ త్రిత్వంలోని రెండవ వ్యక్తి. ఆయన దేవుడు. అయితే, ఆ 40 రోజుల బాధను భరిస్తూ తన మానవ స్వభావంలో ఆయన వెల్లడించిన పరివర్తన కలిగించే గుణాలను మనం స్వీకరించడానికీ, తనతో కలిసివుండమని మనలను ఆహ్వానించడానికీ యేసు ఉపవాస ప్రార్థనల కోసం ఎడారిలోకి వెళ్ళారు. మన ప్రభువుతో కలిసి ఎడారిలో మీ 40 రోజులు గడపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ఎడారిలో ఉన్నప్పుడు యేసు తన మానవ స్వభావంలోని ప్రతి పరిపూర్ణతను వెల్లడించారు. పరలోకంలోని తండ్రి తప్ప మరెవరూ దీనిని చూడకపోయినా, ఆయన ఎడారిలో గడిపిన కాలం మానవజాతికి సమృద్ధిగా ఫలించింది. అది మనలో ప్రతి ఒక్కరికీ సమృద్ధిగా ఫలించింది.  

మనం ప్రవేశించడానికి పిలువబడుతున్న “ఎడారి” మన చుట్టూ ఉన్నవారి కంటికి కనిపించదు, కానీ పరలోకంలోని తండ్రికి కనిపిస్తుంది. సద్గుణాలలో మన ఎదుగుదల వ్యర్థమైన కీర్తి కోసం గానీ, స్వార్థపూరిత గుర్తింపు కోసం గానీ, లోక ప్రశంసలు పొందడం కోసం గానీ జరగదు కాబట్టి అది “రహస్యమైనది.” మనం ప్రవేశించవలసిన ఈ 40 రోజుల ఎడారి మనలను మరింత లోతైన ప్రార్థనవైపు, దేవునికి సంబంధించినది కాని ప్రతిదానిపట్ల అనాసక్తతవైపు నడిపిస్తూ మనలను పరివర్తన చెందిస్తుంది; ప్రతిరోజూ మనకు ఎదురయ్యేవారిపట్ల ప్రేమతో మనలను నింపుతుంది.

ఈ 40 రోజులలో మనం ప్రార్థించాలి. సరిగ్గా చెప్పాలంటే, ప్రార్థన అంటే మన అంతరంగంలో దేవునితో సంభాషించడం. మనం దివ్యబలిపూజకు హాజరవడం లేదా ప్రార్థనలను బిగ్గరగా పలకడం కంటే ఎక్కువే చేస్తాం. ప్రార్థన అన్నిటికంటే ముందుగా దేవునితో రహస్యంగా, అంతరంగంలో జరిగే సంభాషణ. మనం మాట్లాడతాం; అయితే అంతకంటే ముఖ్యంగా, శ్రద్ధగా ఆలకిస్తాం, వింటాం, అర్థం చేసుకుంటాం, ప్రతిస్పందిస్తాం. ఈ నాలుగు లక్షణాలన్నీ లేకపోతే, ప్రార్థన ప్రార్థనే కాదు. అది “సంభాషణ” కాదు. అది కేవలం మనతో మనం మాట్లాడుకోవడమే.

ఈ 40 రోజులలో మనం ఉపవాసం చేయాలి. ముఖ్యంగా నేటి కాలంలో మన పంచేంద్రియాలు కార్యకలాపాలతో, శబ్దాలతో ముంచెత్తబడుతున్నాయి. టీవీ, రేడియో, కంప్యూటర్లు మొదలైనవి తరచూ మన కళ్ళను, చెవులను మైమరపింపజేస్తున్నాయి. రుచికరమైన వంటకాలు, మిఠాయిలు, మనసుకు ఊరటనిచ్చే ఆహారాలతో మన రసనేంద్రియం నిరంతరం తృప్తిపరచబడుతోంది; తరచూ ఇది మితిమీరుతోంది. దేవునితో ఐక్యమైన జీవితంలోని మరింత లోతైన ఆనందాలవైపు మళ్ళాలంటే, లోకానందాల నిరంతర తాకిడి నుండి మన పంచేంద్రియాలకు విరామం అవసరం.

ఈ 40 రోజులలో మనం దానం చేయాలి. లోభం మనలను ఎంతగా పట్టిపీడిస్తోందో మనకు తెలియకుండానే అది తరచూ మనపై పట్టు సాధిస్తుంది. మనకు ఇదీ అదీ కావాలనిపిస్తుంది. మరిన్ని భౌతిక వస్తువులను వినియోగిస్తూనే ఉంటాం. లోకంలో తృప్తిని వెతుకుతాం కాబట్టే అలా చేస్తాం. దేవుని నుండి మన దృష్టిని మరల్చే ప్రతిదానిపట్ల మనం అనాసక్తతను పెంచుకోవాలి; ఈ అనాసక్తతను సాధించడానికి ఉత్తమ మార్గాలలో ఉదారత ఒకటి.  

ప్రార్థన, ఉపవాసం, దానం అనే ఈ మూడు సరళమైన మాటల గురించి ఈ రోజు ధ్యానించండి. ఈ తపస్సుకాలంలో దేవునికి మాత్రమే తెలిసేలా రహస్యంగా ఈ లక్షణాలను ఆచరణలో జీవించడానికి ప్రయత్నించండి. మీరు అలా చేస్తే, ప్రస్తుతం సాధ్యమని మీరు భావించగలిగిన దానికంటే గొప్ప అద్భుతాలను ప్రభువు మీ జీవితంలో చేయడం ప్రారంభిస్తారు. తరచూ మనలను బంధించే స్వార్థం నుండి ఆయన మిమ్మల్ని విముక్తులను చేస్తారు; పూర్తిగా కొత్త స్థాయిలో ఆయనను, ఇతరులను ప్రేమించే సామర్థ్యాన్ని మీకు ఇస్తారు.

ప్రభువా, ఈ తపస్సుకాలంలో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ 40 రోజుల ఎడారిలోకి ప్రవేశించడానికి నేను స్వచ్ఛందంగా నిర్ణయించుకుంటున్నాను; మునుపెన్నడూ చేయనంతగా ప్రార్థించడానికి, ఉపవాసం చేయడానికి, నన్ను నేను అర్పించుకోవడానికి నిర్ణయించుకుంటున్నాను. ఈ తపస్సుకాలం నీవు నా అంతరంగాన్ని పరివర్తన చెందించే సమయం కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన ప్రభువా, నిన్ను, ఇతరులను నా పూర్ణహృదయంతో ప్రేమించకుండా నన్ను అడ్డుకునే ప్రతిదాని నుండి నాకు విముక్తి కలిగించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సిలువ పాదాల వద్ద 40 రోజులు:
మన ధన్యమాత హృదయం నుంచి ఒక ప్రేమపూర్వక చూపు

తపస్సుకాలం కోసం వనరులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు


తపస్సుకాలం కోసం మూడు గొప్ప పుస్తకాలు
ఆన్‌లైన్‌లో ఉచితంగా చదవవచ్చు. ఈ-పుస్తక రూపంలోనూ & కాగితపు అట్టతో ముద్రిత రూపంలోనూ లభిస్తాయి.

తపస్సుకాల, పాస్కా ధ్యానాలు
దైనందిన కతోలిక ధ్యానాలు ధారావాహిక

సిలువ పాదాల చెంత 40 రోజులు
మన ధన్యమాత హృదయం నుండి ప్రేమపూర్వక దృష్టి

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు
పవిత్ర ఫౌస్టీనాతో 365 రోజులు

తపస్సుకాలం కోసం మరిన్ని పుస్తకాలను చూడండి