మార్చి 4, 2020
తపస్సుకాలపు మొదటి వారంలోని బుధవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
“తీర్పు సమయంలో నినెవె ప్రజలు ఈ తరంవారితో పాటు లేచి, వారిని దోషులుగా నిర్ధారిస్తారు. ఎందుకంటే యోనా బోధన విని వారు పశ్చాత్తాపపడ్డారు. ఇదిగో, యోనాకంటే గొప్పది ఇక్కడ ఉంది.” లూకా 11:32
ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడానికి యేసు ఎంత ఆసక్తికరమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు! సరళంగా చెప్పాలంటే, యోనా బోధించినప్పుడు నినెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. అయితే, యేసు కాలంలోని ప్రజలు అలా చేయలేదు. దాని ఫలితంగా, లోకాంతంలో యేసు మాట వినని వారిని దోషులుగా నిర్ధారించే బాధ్యత నినెవె ప్రజలకు ఇవ్వబడుతుంది.
దీనినుంచి మనం ముందుగా గ్రహించవలసినది ఏమిటంటే, తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడటానికి నిరాకరించేవారికి శిక్ష తప్పదన్నది వాస్తవం, గంభీరమైన విషయం. తన బోధనను వినని ప్రజలకు కలిగే నిత్యశిక్షను గురించి యేసు మాట్లాడుతున్నారు. యేసు చేసిన ఈ ఎంతో కఠినమైన బోధనను బట్టి, పశ్చాత్తాపపడటానికి మనలో సుముఖత ఉందో లేదో నిజాయితీగా పరిశీలించుకోవాలి.
రెండవదిగా, ప్రవచన సందేశాన్ని పొందే విషయంలో యోనా కాలపు ప్రజలకంటే యేసు మందలించిన ప్రజలు ఎంతో ఎక్కువగా దీవించబడ్డారని గుర్తించడం ముఖ్యం. యోనా మొదట్లో దేవుని నుంచీ, తనకు అప్పగించిన కార్యం నుంచీ పారిపోయిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఆయన నినెవెకు వెళ్లాలని కోరుకోలేదు; తన ఇష్టానికి విరుద్ధంగా తిమింగలం కడుపులో అక్కడికి తీసుకురాబడిన తరువాత మాత్రమే వెళ్లాడు. ఆ తరువాత యోనా పూర్ణహృదయంతో, ఉత్సాహంగా బోధించి ఉంటాడని ఊహించడం కష్టమే. అయినప్పటికీ, ఆయన బోధన ఫలించింది.
లోక రక్షకుడు స్వయంగా పలికిన మాటలను వినే భాగ్యం యేసు కాలపు ప్రజలకు లభించింది. కానీ మనకూ ఆ భాగ్యం ఉంది! మనకు సువార్తలు, కతోలిక సభ బోధనలు, గొప్ప పునీతుల సాక్ష్యం, పరిశుద్ధ పాపుగారి కాపరి మార్గదర్శకత్వం, దివ్యసంస్కారాలు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మన ఈ సాంకేతిక యుగంలో సువార్తా సందేశాన్ని పొందడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ, క్రీస్తు సందేశాన్ని మనం సులభంగా పెడచెవిన పెట్టవచ్చు.
యేసు మాటలకు మీరు మనస్ఫూర్తిగా ఎలా స్పందిస్తున్నారో ఈ రోజు ధ్యానించండి. ఆయన మనతో శక్తివంతమైన రీతుల్లో మాట్లాడుతున్నారు; అయినప్పటికీ మనం తరచూ వినడం లేదు. ఇలా వినకపోవడం వల్ల మన పాపాలనుంచి సంపూర్ణంగా పశ్చాత్తాపంతో మరలలేకపోతున్నాం. మీ పరిస్థితి ఇదే అయితే, మొండిగా ఉండేవారికి ఎదురుకానున్న కఠినమైన శిక్షాతీర్పు మాటలను గురించి కూడా ధ్యానించండి. ఈ అవగాహన మనలో పవిత్రమైన భయాన్ని నింపి, మన ప్రభువు బోధనను వినేలా మనల్ని ప్రేరేపించాలి.
ప్రభువా, నీవు నాతో లెక్కలేనన్ని విధాలుగా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నీ పవిత్ర గ్రంథాల ద్వారా, నీ కతోలిక సభ ద్వారా, నా ప్రార్థనా జీవితంలో నీవు బోధిస్తున్నావు. నీ స్వరాన్ని ఆలకించి, నీవు చెప్పేవన్నీ సంపూర్ణ విధేయతతో, సమర్పణతో అంగీకరించడానికి నాకు సహాయం చేయుము. నా ప్రియ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నా పాపం గురించి పశ్చాత్తాపపడుతున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సిలువ పాదాల చెంత 40 రోజులు – ఏడవ ధ్యానం – ప్రభువుకు వినమ్రంగా సేవచేసే వ్యక్తి
తపస్సుకాలం కోసం మూడు గొప్ప పుస్తకాలు
ఆన్లైన్లో ఉచితంగా చదవవచ్చు. ఈ-పుస్తక రూపంలోనూ & కాగితపు అట్టతో ముద్రిత రూపంలోనూ లభిస్తాయి.
తపస్సుకాల, పాస్కా ధ్యానాలు
దైనందిన కతోలిక ధ్యానాలు ధారావాహిక
సిలువ పాదాల చెంత 40 రోజులు
మన ధన్యమాత హృదయం నుండి ప్రేమపూర్వక దృష్టి
దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు
పవిత్ర ఫౌస్టీనాతో 365 రోజులు
తపస్సుకాలం కోసం మరిన్ని పుస్తకాలను చూడండి





