తెలుగు

సయోధ్యకు ధైర్యం

ఆగస్టు 12, 2020
సామాన్య కాలపు పంతొమ్మిదవ వారంలో బుధవారం
నేటి పఠనాలు

పవిత్ర జేన్ ఫ్రాన్సెస్ డి షాంతాల్, సన్యాసిని—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి

“నీ సోదరుడు నీకు విరోధంగా పాపం చేస్తే, వెళ్లి, నీవూ అతడూ మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి. అతడు నీ మాట వింటే, నీవు నీ సోదరుణ్ణి తిరిగి పొందినట్లే. అతడు వినకపోతే, ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యం ద్వారా ప్రతి విషయం నిర్ధారించబడేలా, నీతోపాటు మరొకరిని లేదా ఇద్దరిని తీసుకొని వెళ్లు. అతడు వారి మాట వినడానికి నిరాకరిస్తే, సభకు తెలియజేయి. సభ మాటను కూడా వినడానికి అతడు నిరాకరిస్తే, అతణ్ణి అన్యజనునిలా లేదా సుంకరిలా పరిగణించు.”  మత్తయి 18:15-17

సమస్యలను పరిష్కరించడానికి యేసు మనకు ఇచ్చిన స్పష్టమైన పద్ధతి ఇక్కడ ఉంది.  ముందుగా, సమస్యల పరిష్కారానికి యేసు ఒక ప్రాథమిక పద్ధతిని అందిస్తున్నారనే వాస్తవమే, జీవితంలో మనం పరిష్కరించవలసిన సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తుంది.  దీనికి మనం ఆశ్చర్యపోకూడదు, దిగ్భ్రాంతి చెందకూడదు.  జీవితం ఇలాగే ఉంటుంది.  

ఎవరైనా మనకు విరోధంగా పాపం చేసినప్పుడు లేదా బహిరంగంగా పాపమయమైన జీవితం గడుపుతున్నప్పుడు, మనం తరచూ వారికి తీర్పు తీర్చి, వారిని ఖండిస్తాం.  దాని ఫలితంగా, వారిక ఇక ఆశ లేదని సులభంగా కొట్టిపారేస్తాం.  మనం ఇలా చేస్తే, అది మనలో కరుణ, వినయం లోపించాయనడానికి సంకేతం.  కరుణ, వినయం మనం క్షమాపణను, సయోధ్యను కోరుకునేలా చేస్తాయి.  ఇతరుల పాపాలను వారిని ఖండించడానికి కారణాలుగా కాక, మరింతగా ప్రేమించడానికి అవకాశాలుగా చూడటానికి కరుణ, వినయం మనకు తోడ్పడతాయి.

పాపం చేసినవారితో, ముఖ్యంగా మీకు విరోధంగా పాపం చేసినవారితో, మీరు ఎలా వ్యవహరిస్తారు?  మీకు విరోధంగా ఎవరైనా పాపం చేస్తే, ఆ పాపిని తిరిగి పొందడానికి మీరు ఎంతో కృషి చేయాలని యేసు స్పష్టం చేస్తున్నారు.  వారిని ప్రేమించడంలో మీరు ఎంతో శక్తిని వెచ్చించాలి; సయోధ్య కుదుర్చుకోవడానికి, వారిని తిరిగి సత్యం వైపు తీసుకురావడానికి సాధ్యమైనదంతా చేయాలి.  

ముందుగా మీరు వారితో ఏకాంతంగా మాట్లాడాలి.  ఆ తరువాత, నమ్మదగిన ఇతరులను ఆ సంభాషణలో భాగస్వాములను చేయాలి.  అంతిమ లక్ష్యం సత్యమే; ఆ సత్యం మీ సంబంధాన్ని పునరుద్ధరించేలా మీకు సాధ్యమైనదంతా చేయడమే.  అన్నివిధాలా ప్రయత్నించిన తరువాత కూడా వారు సత్యం వైపు తిరిగి రాకపోతేనే, మీరు మీ పాదాల ధూళిని దులిపివేసి, వారిని పాపిగా పరిగణించాలి.  అయితే ఇది కూడా ప్రేమతో చేసే కార్యమే; ఎందుకంటే, వారి పాపపు పర్యవసానాలను వారు గుర్తించడానికి సహాయపడే మార్గం ఇది.

మీరు ఎవరితో సయోధ్య కుదుర్చుకోవలసి ఉందో నేడు ధ్యానించండి.  బహుశా మొదటి అడుగుగా అవసరమైన ఆ వ్యక్తిగత సంభాషణను కూడా మీరు ఇంకా జరిపి ఉండకపోవచ్చు.  బహుశా దానిని ప్రారంభించడానికి మీరు భయపడుతుండవచ్చు; లేదా వారిక ఇక ఆశ లేదని ఇప్పటికే కొట్టిపారేసి ఉండవచ్చు.  మిమ్మల్ని బాధపెట్టినవారిని యేసు కోరుకునే విధంగా మీరు సమీపించగలిగేలా, కృప, కరుణ, ప్రేమ, వినయం కోసం ప్రార్థించండి.

ప్రభువా, కరుణ చూపకుండా, సయోధ్యను వెదకకుండా నన్ను అడ్డుకునే అహంకారమేదైనా నాలో ఉంటే, దానిని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి.  నాకు విరోధంగా చేసిన పాపం చిన్నదైనా, పెద్దదైనా, సయోధ్య కుదుర్చుకోవడానికి నాకు సహాయం చేయి.  శాంతి పునరుద్ధరించబడేలా నీ హృదయపు కనికరం నా హృదయాన్ని నింపునుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పవిత్ర జేన్ ఫ్రాన్సెస్ డి షాంతాల్, సన్యాసిని

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

చిత్రం: జేమ్స్ టిస్సో చిత్రించిన ‘సముద్రతీరాన ప్రజలకు బోధిస్తున్న యేసు’