సెప్టెంబర్ 9, 2020
సామాన్య కాలపు ఇరవై మూడవ వారంలో బుధవారం
నేటి పఠనాలు
పునీత పీటర్ క్లేవర్, యాజకుడు—అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జ్ఞాపకార్థ దినం

ఆంగ్లంలో వినండి
“పేదలైన మీరు ధన్యులు…
ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు…
ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు…
ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ధన్యులు…
ఆ రోజున సంతోషించి, ఆనందంతో గంతులు వేయండి!” (లూకా 6:20-23 చూడండి)
పై వాక్యాల్లో అచ్చుతప్పులు ఉన్నాయా? యేసు నిజంగా ఈ మాటలు అన్నారా?
మొదట్లో ధన్యవచనాలు ఎంతో అయోమయం కలిగించవచ్చు. వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నించినప్పుడు, అవి మనకు ఎంతో సవాలుగా అనిపించవచ్చు. పేదరికంలో, ఆకలితో ఉండటం ధన్యమైన స్థితి ఎలా అవుతుంది? ఏడుస్తూ, ఇతరుల ద్వేషానికి గురవుతున్నవారు ధన్యులు ఎలా అవుతారు? ఇవి కఠినమైన ప్రశ్నలే; అయితే వీటికి పరిపూర్ణమైన సమాధానాలు ఉన్నాయి.
వాస్తవం ఏమిటంటే, దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రతి ధన్యవచనాన్ని సంపూర్ణంగా స్వీకరించినప్పుడు, అది మహిమాన్వితమైన ఫలితానికి దారితీస్తుంది. పేదరికం, ఆకలి, దుఃఖం, హింసలు వాటికవే దీవెనలు కావు. అయితే అవి మనకు ఎదురైనప్పుడు, ఆ ప్రారంభ సవాలు తెచ్చే ఏ కష్టాన్నైనా ఎంతో మించిపోయే దీవెనను దేవుని నుంచి పొందే అవకాశాన్ని అవి కల్పిస్తాయి.
అన్నిటికంటే మిన్నగా పరలోక సంపదలను వెదకడానికి పేదరికం అవకాశం కల్పిస్తుంది. లోకం ఇవ్వగలిగే దానికంటే మిన్నగా మనల్ని పోషించే దేవుని ఆహారాన్ని వెదకడానికి ఆకలి ప్రేరేపిస్తుంది. మన సొంత పాపం వల్లగానీ ఇతరుల పాపాల వల్లగానీ కలిగే కన్నీరు, న్యాయాన్ని, పశ్చాత్తాపాన్ని, సత్యాన్ని, కరుణను వెదకడానికి మనకు సహాయపడుతుంది. క్రీస్తు నిమిత్తం ఎదురయ్యే హింసలు మన విశ్వాసంలో శుద్ధి పొందడానికి, సమృద్ధిగా దీవెనలు పొంది ఆనందంతో నిండిపోయే విధంగా దేవునిపై నమ్మకం ఉంచడానికి మనకు తోడ్పడతాయి.
మొదట్లో ధన్యవచనాలు మనకు అర్థం కాకపోవచ్చు. అవి మన మానవ హేతుబుద్ధికి విరుద్ధమైనవని కాదు. ధన్యవచనాలు మనకు వెంటనే అర్థమయ్యే విషయాలకు అతీతమైనవి; విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలలో పూర్తిగా నూతనమైన స్థాయిలో జీవించడానికి అవి మనకు తోడ్పడతాయి. దేవుని జ్ఞానం మన పరిమిత మానవ అవగాహనకు ఎంతో అతీతమైనదని అవి మనకు బోధిస్తాయి.
ఆధ్యాత్మిక జీవితంలోని ఈ అత్యంత లోతైన బోధనలను దేవుడు వెల్లడిస్తున్నప్పుడు, ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. కనీసం, దేవుని జ్ఞానం మీ జ్ఞానంకంటే ఎంతో ఉన్నతమైనదనే సత్యాన్ని గురించి ధ్యానించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలోని ఏదైనా బాధాకరమైన, కష్టమైన విషయం అర్థం కాక మీరు సతమతమవుతుంటే, మీరు ఆయన జ్ఞానాన్ని వెదికితే చాలు, దేవుని దగ్గర సమాధానం ఉందని తెలుసుకోండి.
ప్రభువా, జీవితంలోని ఎన్నో సవాళ్లలో, కష్టాల్లో దీవెనలను కనుగొనడానికి నాకు సహాయం చేయుము. నా సిలువలను చెడుగా చూడకుండా, వాటిని రూపాంతరం చేయడంలో నీ హస్తం పనిచేస్తున్నదని చూడటానికి, అన్ని విషయాల్లో నీ కృప మరింత సమృద్ధిగా కుమ్మరింపబడటాన్ని అనుభవించడానికి నాకు సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
నేటి పునీతులు – పునీత పీటర్ క్లేవర్, యాజకుడు
చిత్రం: ధన్యవచనాలను బోధిస్తున్న క్రీస్తు




