తెలుగు

కొంచెం చాలు

January 28, 2022
సామాన్య కాలం మూడవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

పునీత తోమస్ అక్వినాస్, యాజకుడు మరియు సభ పండితుడు—స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? లేదా దానిని వివరించడానికి ఏ ఉపమానాన్ని ఉపయోగించగలం? అది ఆవగింజ వంటిది. దానిని నేలలో విత్తినప్పుడు అది భూమిపై ఉన్న విత్తనాలన్నిటిలోకెల్లా చిన్నది. కానీ విత్తిన తరువాత అది మొలకెత్తి మొక్కలన్నిటికంటే పెద్దదవుతుంది…” మార్కు 4:30-32

దీని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అతి చిన్న విత్తనంలో ఎంతో సామర్థ్యం ఉంది. మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఎదగడానికి, ఆహారానికి వనరుగా, ఆకాశ పక్షులకు నివాసంగా మారడానికి కావలసిన సామర్థ్యం ఆ చిన్న విత్తనంలోనే ఉంది.

మొక్కలన్నీ విత్తనం నుంచే మొదలవుతాయని మనకు తెలుసు కాబట్టి, యేసు ఉపయోగించే ఈ పోలిక మనల్ని ఆకట్టుకోవలసినంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయితే భౌతిక ప్రపంచంలోని ఈ అద్భుతం గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆ చిన్న విత్తనంలో అంతటి సామర్థ్యం ఎలా ఇమిడి ఉందో ఆలోచించడానికి ప్రయత్నించండి.

తన రాజ్య నిర్మాణం కోసం యేసు మనలో ప్రతి ఒక్కరినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారనే సత్యాన్ని ఈ వాస్తవం వెల్లడిస్తుంది. మనం పెద్దగా ఏమీ చేయలేమని, ఇతరులకు ఉన్నంత ప్రతిభ మనకు లేదని, మనం పెద్దగా మార్పు తీసుకురాలేమని మనకు అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. నిజమేమిటంటే, మనలో ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంత సామర్థ్యం నిండి ఉంది; దానిని ఫలింపజేయాలని దేవుడు కోరుకుంటున్నారు. మన జీవితాల ద్వారా లోకానికి మహిమాన్వితమైన దీవెనలను అందించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం చేయవలసిందల్లా ఆయనను కార్యసాధన చేయనివ్వడమే.

ఒక విత్తనంలా, విశ్వాసం ద్వారా, ఆయన దివ్యచిత్తానికి మనలను మనం సమర్పించుకోవడం ద్వారా, ఆయన కరుణ అనే సారవంతమైన నేలలో మనం నాటబడటానికి అంగీకరించాలి.  దైనందిన ప్రార్థన అనే నీటిని మనం స్వీకరించాలి; దేవుని కుమారుని కిరణాలు మనపై ప్రసరించనివ్వాలి. తద్వారా ఆయన మనలో కోరుకునేవన్నీ, లోకపు పునాది వేయబడినప్పటి నుండి మనలో నాటినవన్నీ మన నుండి ఫలించేలా చేయగలడు.  

దేవుడు మీ ఆత్మలో ఉంచిన అపారమైన సామర్థ్యం గురించి ఈ రోజు ధ్యానించండి. మీ ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాలనీ, సమృద్ధిగా విస్తరింపజేయాలనీ ఉద్దేశించి ఆయన మిమ్మల్ని సృష్టించారు. దీనిని విశ్వసించి, మీ జీవితంలో దేవుడు చేయాలని కోరుకునేదాన్ని ఆయనను చేయనివ్వడమే మీ బాధ్యత.

అనంతమైన సామర్థ్యముగల ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నా జీవితంలో నీవు చేసిన వాటన్నిటికీ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  నీవు ఇంకా నా నుండి కోరుకునే వాటన్నిటికీ ముందుగానే నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  నీవు వచ్చి నీ కృపతో నన్ను పోషించి, నా జీవితం నుండి సమృద్ధిగా మంచి ఫలాలను పుట్టించేలా, ప్రతిరోజూ నన్ను నేను నీకు సమర్పించుకోవాలని ప్రార్థిస్తున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత తోమస్ అక్వినాస్, గురువు మరియు సభ పండితుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: ఆవగింజ ఉపమానం, ఫ్లికర్ ద్వారా


ప్రత్యేకంగా పరిచయం చేస్తున్న పుస్తకం:

సామాన్య కాలానికి దైనందిన ధ్యానాలు:
వారాలు 1-17

సామాన్య కాలానికి దైనందిన ధ్యానాలు: 1–17 వారాలు అనే ఈ పుస్తకం దైనందిన కతోలిక ధ్యానాల గ్రంథమాల నుంచి వెలువడిన దైనందిన భక్తి గ్రంథం. ఇది ఆచరణాత్మకంగా, విశ్వాసానికి నిబద్ధంగా, నిత్యజీవితానికి అన్వయించుకునే రీతిలో ఆనాటి సువార్తపై ధ్యానాలను అందిస్తుంది. ఈ పుస్తకాన్ని ఏటా ఉపయోగించుకోగలిగేలా ఈ-పుస్తక మరియు కాగితపు అట్టతో ముద్రించిన సంచికలు రూపొందించబడ్డాయి. ఈ ధ్యానాలకు ప్రత్యేకంగా 2022 సామాన్య కాలపు తేదీలు ఇవ్వలేదు; బదులుగా, ఈ సంవత్సరంతోపాటు రాబోయే ఆరాధనా సంవత్సరాల్లోని అన్ని పఠన ఎంపికలనూ ఇవి పొందుపరుస్తాయి. అందువల్ల ఈ భక్తి గ్రంథాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించుకోవచ్చు.