తెలుగు

పాపాన్ని నివారించడం

జూన్ 10, 2022
సామాన్య కాలపు పదవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“నీ కుడికన్ను నిన్ను పాపానికి నడిపిస్తే, దానిని పెరికి పారవేయి. నీ దేహమంతా గెహెన్నాలో పడవేయబడటం కంటే నీ అవయవాలలో ఒకదానిని కోల్పోవడం నీకు మేలు. నీ కుడిచేయి నిన్ను పాపానికి నడిపిస్తే, దానిని నరికి పారవేయి.” మత్తయి 5:29-30a

యేసు నిజంగా ఇదే ఉద్దేశిస్తున్నారా? అక్షరాలా?

దిగ్భ్రాంతి కలిగించే ఈ మాటలు అక్షరాలా పాటించవలసిన ఆజ్ఞ కావని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. ఎంతో ఉత్సాహంతో పాపాన్ని నివారించమనీ, మనలను పాపానికి నడిపించే వాటన్నిటినీ దూరం పెట్టమనీ ఆజ్ఞాపించే ప్రతీకాత్మక వాక్యమిది. మన ఆలోచనలు, కోరికలు నెలకొని ఉండే మన ఆత్మకు కన్నును ఒక కిటికీగా అర్థం చేసుకోవచ్చు. చేతిని మన క్రియలకు ప్రతీకగా చూడవచ్చు. కాబట్టి, మనలను పాపానికి నడిపించే ప్రతి ఆలోచనను, అనురక్తిని, కోరికను, క్రియను మనం తొలగించాలి.

ఈ వాక్యభాగాన్ని అర్థం చేసుకోవడానికి అసలైన కీలకం ఏమిటంటే, యేసు ఉపయోగించే శక్తిమంతమైన మాటలు మనలను ప్రభావితం చేయడానికి అనుమతించడమే. మన జీవితాలలో పాపానికి నడిపించే వాటిని ఎంతో ఉత్సాహంతో ఎదుర్కోవాలనే పిలుపు మనకు ఉందని తెలియజేయడానికి, దిగ్భ్రాంతి కలిగించే విధంగా మాట్లాడటానికి ఆయన వెనుకాడరు. “దానిని పెరికి పారవేయి…దానిని నరికి పారవేయి” అని ఆయన అంటారు. మరో మాటలో చెప్పాలంటే, మీ పాపాన్ని, మిమ్మల్ని పాపానికి నడిపించే వాటన్నిటినీ దృఢనిశ్చయంతో పూర్తిగా తొలగించండి. కన్ను, చేయి వాటంతట అవే పాపభరితమైనవి కావు; ఈ ప్రతీకాత్మక భాషలో వాటిని పాపానికి నడిపించే వాటిగా పేర్కొంటున్నారు. కాబట్టి, కొన్ని ఆలోచనలు లేదా కొన్ని క్రియలు మిమ్మల్ని పాపానికి నడిపిస్తే, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి తొలగించవలసినవి అవే.

మన ఆలోచనల విషయానికి వస్తే, కొన్నిసార్లు మనం ఏదో ఒకదాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉండిపోవచ్చు. ఫలితంగా, ఈ ఆలోచనలు మనలను పాపానికి నడిపించవచ్చు. చెడు ఫలాన్ని కలిగించే ఆ తొలి ఆలోచననే “పెరికి పారవేయడం” కీలకం.

మన క్రియల విషయానికి వస్తే, కొన్నిసార్లు మనలను శోధించి పాపానికి నడిపించే పరిస్థితుల్లోకి మనమే వెళ్లవచ్చు. పాపానికి దారితీసే ఈ సందర్భాలను మన జీవితాల నుండి తొలగించాలి.

మన ప్రభువు పలికిన ఈ సూటియైన, శక్తిమంతమైన మాటల గురించి ఈ రోజు ధ్యానించండి. ఆయన మాటల బలం మీలో మార్పుకు, ప్రతి పాపాన్ని నివారించడానికి ప్రేరణగా ఉండనివ్వండి.

నా నుంచి ఎంతో కోరే ప్రభువా, నా పాపానికి పశ్చాత్తాపపడుతున్నాను; నీ కరుణను, క్షమాపణను వేడుకుంటున్నాను.  నన్ను పాపానికి నడిపించే వాటన్నిటినీ విడనాడటానికి, ప్రతిరోజూ నా ఆలోచనలన్నిటినీ, పనులన్నిటినీ నీకు సమర్పించడానికి దయచేసి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ఉన్న ప్రధాన చిత్రం: జేమ్స్ టిస్సో చిత్రించిన ‘సముద్రతీరాన కూర్చొని బోధిస్తున్న యేసు’, వికీమీడియా కామన్స్ ద్వారా