తెలుగు

కొత్త ద్రాక్షారసం కొత్త తోలు తిత్తులలోకి

సెప్టెంబరు 2, 2022
సామాన్య కాలపు ఇరవై రెండవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“ఎవరూ కొత్త ద్రాక్షారసాన్ని పాత తోలు తిత్తులలో పోయరు. అలా పోస్తే, కొత్త ద్రాక్షారసం ఆ తిత్తులను పగులగొడుతుంది; ద్రాక్షారసం ఒలికిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. కాబట్టి కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తోలు తిత్తులలోనే పోయాలి.”  లూకా 5:37

ఈ కొత్త ద్రాక్షారసం ఏమిటి?  పాత తోలు తిత్తులు ఏమిటి? మనకు సమృద్ధిగా అనుగ్రహించబడిన నూతన కృపాజీవితమే కొత్త ద్రాక్షారసం; మన పాత పతన స్వభావాలు, పాత ధర్మశాస్త్రం పాత తోలు తిత్తులు.  మన జీవితాలలో యేసు కృపను, కరుణను పొందాలని మనం కోరుకుంటే, మన పాత స్వరూపాలను నూతన సృష్టులుగా మార్చడానికి ఆయనను అనుమతించి, కృపకు సంబంధించిన నూతన ధర్మశాస్త్రాన్ని స్వీకరించాలని యేసు మనకు చెబుతున్నారు.  

మీరు నూతన సృష్టిగా మారారా?  మీలోని నూతన స్వరూపం తిరిగి జీవంతో లేచేలా మీ పూర్వ స్వరూపం మరణించడానికి అనుమతించారా?  కృప అనే కొత్త ద్రాక్షారసం మీ జీవితంలో పోయబడేలా క్రీస్తులో నూతన సృష్టిగా మారడం అంటే ఏమిటి?

క్రీస్తులో నూతన సృష్టిగా మారడం అంటే మనం పూర్తిగా కొత్త స్థాయిలో జీవిస్తూ, మన పూర్వపు మార్గాలను ఇక అంటిపెట్టుకొని ఉండకపోవడం.  మనంతట మనం ఎన్నటికీ చేయలేనంత గొప్ప కార్యాలను దేవుడు మన జీవితాలలో శక్తివంతంగా చేస్తారని దాని అర్థం.  దేవుడు మనలో కుమ్మరించబడటానికి అనువైన కొత్త “తోలు తిత్తి”గా మనం మారామని దాని అర్థం.  ఈ కొత్త “ద్రాక్షారసం” మన జీవితాలను తన ఆధీనంలోకి తీసుకొని, వాటిని ఆవహించే పవిత్రాత్మే అని దాని అర్థం.

ఆచరణాత్మకంగా చెప్పాలంటే, మనం క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడితే, దివ్యసంస్కారాల కృపను, దైనందిన ప్రార్థన, ఆరాధన ద్వారా మనకు లభించేవాటన్నిటినీ స్వీకరించడానికి తగిన విధంగా సిద్ధమవుతాం.  అయితే ఆ కొత్త తోలు తిత్తులుగా మారడమే మొదటి లక్ష్యంగా ఉండాలి.  మరి మనం దీన్ని ఎలా సాధించాలి?

జ్ఞానస్నానం ద్వారా, ఆ తరువాత పాపాన్ని విడిచిపెట్టి సువార్తను స్వీకరించాలని ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవడం ద్వారా మనం దీన్ని సాధిస్తాం.  అయితే పాపాన్ని విడిచిపెట్టి సువార్తను స్వీకరించాలనే దేవుని ఈ సాధారణ ఆజ్ఞను ఎంతో దృఢసంకల్పంతో ప్రతిరోజూ ఆచరించాలి.  అన్ని విషయాలలో క్రీస్తు వైపు తిరగడానికి మనం ప్రతిరోజూ ఆచరణాత్మకమైన, ఉద్దేశపూర్వకమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, పవిత్రాత్మ అకస్మాత్తుగా, శక్తివంతంగా, తక్షణమే కృప అనే కొత్త ద్రాక్షారసాన్ని మన జీవితాలలో కుమ్మరిస్తారని మనం తెలుసుకుంటాం.  మనలను నింపే నూతన శాంతిని, ఆనందాన్ని కనుగొంటాం; మన స్వంత సామర్థ్యానికి మించిన బలం మనకు లభిస్తుంది.  

మీరు నిజంగా క్రీస్తులో నూతన సృష్టిగా మారారా లేదా అనేదాని గురించి ఈ రోజు ధ్యానించండి.  మీ పూర్వపు మార్గాన్ని విడిచిపెట్టి, మిమ్మల్ని బంధించిన సంకెళ్లను తెంచుకున్నారా?  నూతనమైన సువార్తను సంపూర్ణంగా స్వీకరించారా? మీ జీవితంలో పవిత్రాత్మను కుమ్మరించడానికి ప్రతిరోజూ దేవుణ్ణి అనుమతిస్తున్నారా?  

ప్రభువా, దయచేసి నన్ను నూతన సృష్టిగా మార్చు.  నన్ను రూపాంతరం చేసి, పూర్తిగా నవీకరించు.  నీలో నా నూతన జీవితం, నీవు సమృద్ధిగా కుమ్మరించే కృపను, కరుణను నిరంతరం సంపూర్ణంగా స్వీకరించేదిగా ఉండుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కతోలిక విశ్వాసాన్ని తెలుసుకోండి!

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైనున్న ప్రధాన చిత్రం: పిక్సాబే నుండి హాన్స్ రోహ్‌మాన్ అందించిన చిత్రం