తెలుగు

దురాశ యొక్క వాస్తవికత

అక్టోబరు 23, 2023
సామాన్య కాలంలో ఇరవై తొమ్మిదవ వారపు సోమవారం
నేటి పఠనాలు

కపిస్ట్రానోకు చెందిన పునీత యోహాను, గురువు—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

జనసమూహంలో ఒకరు యేసుతో, “బోధకుడా, వారసత్వ ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సోదరునికి చెప్పండి” అని అన్నారు. ఆయన ఆ వ్యక్తితో, “మిత్రమా, మీ మధ్య న్యాయాధిపతిగా, మధ్యవర్తిగా నన్ను ఎవరు నియమించారు?” అని జవాబిచ్చారు. తరువాత ఆయన జనసమూహంతో, “అన్ని విధాలైన దురాశకు దూరంగా ఉండేలా జాగ్రత్తపడండి. ఎందుకంటే, ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నా, ఆ వ్యక్తి జీవితం ఆస్తిపాస్తులపై ఆధారపడి ఉండదు” అని చెప్పారు. లూకా 12:13–15

యేసు మాటలలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భూమిపై జీవించిన వారందరిలో, ఒక అన్యాయం విషయంలో “న్యాయాధిపతిగా, మధ్యవర్తిగా” ఉండటానికి యేసుకన్నా అర్హులు మరెవరూ లేరు. అయినా ఆయన జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకలా? ఆ వ్యక్తి చేసిన వినతి న్యాయమైనదిగానే కనిపిస్తుంది. కానీ యేసు జోక్యం చేసుకునే బదులు దురాశను గురించిన ఒక ఉపమానం చెబుతున్నారు.

భౌతిక ఆస్తిపాస్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉండవచ్చు. అది వాస్తవం. అయినా, ఆస్తిపాస్తులపట్ల, డబ్బుపట్ల తమకున్న మమకారాన్ని అంగీకరించడం చాలామందికి ఎంతో కష్టంగా ఉంటుంది. తాము కష్టపడి పనిచేశామని, తమకున్నదంతా సంపాదించుకున్నామని, కాబట్టి కొంతవరకు తమ కోరికలు తీర్చుకోవడంలో తప్పులేదని వారు సమర్థించుకుంటారు. ఎంతో ఆస్తి ఉన్న కొందరు మంచి మనసుగలవారు తమకున్న దానిలో కొద్దిభాగాన్ని దాతృత్వ కార్యాలకు ఇచ్చి తమ మనస్సాక్షిని సమాధానపరచుకుంటారు. మిగిలినదంతా తమకోసం ఉంచుకోవచ్చని నిర్ణయించుకుంటారు. కానీ దీనిని గురించి యేసు ఏమనుకుంటున్నారు?

భౌతిక ఆస్తిపాస్తులు వాటంతట అవే మంచివీ కావు, చెడ్డవీ కావు. సమస్య దురాశ అనే పాపంలో ఉంది. దురాశ అనేది దేవునికన్నా, ఆయన పవిత్ర చిత్తంకన్నా ఈ లోకంలోని గతించిపోయే వస్తువులపట్ల ఎక్కువ మమకారం కలిగించే అంతరంగ వైఖరి. ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ, అంతరంగంలో దానిపై మమకారం లేకుండా ఉండటం సాధ్యమే కావచ్చు. అయితే అది చాలా కష్టం. కానీ ఆస్తిపాస్తులు కలిగి ఉండటమే అసలు సమస్య కాదు. వాటిని ఆశించడమే నిజమైన సమస్య. అందువల్ల, చాలా తక్కువ ఆస్తి ఉన్నవారు కూడా తమకు లేనివాటిపై మమకారం పెంచుకొని, మరింత సంపాదించుకుంటే తృప్తి కలుగుతుందని నమ్మడం ద్వారా అదే ఉచ్చులో పడవచ్చు.

ఈ సందర్భంలో “న్యాయాధిపతిగా, మధ్యవర్తిగా” వ్యవహరించడానికి యేసు నిరాకరించారు. ఎందుకంటే, ఆ వినతి చేసిన వ్యక్తి దురాశతో పోరాడుతున్నట్లు ఆయనకు స్పష్టంగా తెలుసు. వారసత్వ ఆస్తి సరిగ్గా పంచబడటం కన్నా, ఆ వ్యక్తి అంతరంగంలోని మమకారాల గురించే యేసు ఎంతో ఎక్కువగా శ్రద్ధ వహించారు. నిత్యత్వ దృష్టిలో భూలోక న్యాయానికి ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ. దీనిని అర్థం చేసుకొని అంగీకరించడం చాలామందికి కష్టంగా ఉండవచ్చు. న్యాయం అంటే ప్రతి ఒక్కరికీ న్యాయమైన వాటా దక్కాలి కదా? తనకు న్యాయం జరగాలనే కోరికకు దురాశ వంటి ఏదైనా పాపం ఆధారమైతే, అలా కాదు. అలాంటి సందర్భంలో, న్యాయంగా రావలసిన వాటాను పొందడం కన్నా మోసం వల్ల వారసత్వ ఆస్తిలో వాటాను కోల్పోవడమే ఆ వ్యక్తి ఆత్మకు ఎంతో మేలు. నిజానికి, ఒక వ్యక్తి దురాశతో పోరాడుతుంటే, మోసం వల్ల సొంత ఆస్తిపాస్తులను కోల్పోవడం ఆ వ్యక్తి ఆత్మకు అత్యంత మేలుచేసే విషయాలలో ఒకటి కావచ్చు. భౌతిక సంపదలకన్నా ఆధ్యాత్మిక సంపదలు అనంతంగా గొప్పవని గ్రహించినప్పుడే ఇది అర్థమవుతుంది.

ఈ రోజు మీ అంతరంగ కోరికలను గురించి ధ్యానించండి. వాటిని నిజాయితీగా పరిశీలించండి. జీవితంలో మీరు అన్నిటికన్నా ఎక్కువగా కోరుకునేది ఏమిటి? ధనవంతులు కావాలని కలలు కంటున్నారా? అలా అయితే, ఆ కోరిక మీ ఆలోచనలలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తోందా? మీకు వారసత్వంగా చాలా పెద్ద ఆస్తి రావలసి ఉండగా, మోసం వల్ల అది మీకు దక్కలేదనే పరిస్థితిని ఊహించుకొని ఆలోచించండి. మీరెలా స్పందిస్తారు? మీకు జరిగిన మోసం గురించి చింతించడం కన్నా, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఆత్మ గురించి ఎక్కువ శ్రద్ధ చూపడమే సరైన స్పందన. భౌతిక ఆస్తిపాస్తులపై మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వ్యక్తికి, అటువంటి వారసత్వ ఆస్తిని కోల్పోయినా, పొందినా పెద్దగా పట్టింపు ఉండదు. నిజంగా అది ముఖ్యమే అనిపించదు. దీనిని అంగీకరించడం కష్టంగా ఉంటే, మీ ఆత్మకు ఈ లోక విషయాలపట్ల అతిగా మమకారం ఉందనడానికి ఇది ఒక సూచన అని తెలుసుకోండి. అన్ని విధాలైన దురాశ నుండి విముక్తి కోసం ప్రార్థించండి. దేవుని నిజమైన సంపదలను పొందడానికి అదే ఏకైక మార్గం.

అత్యంత ఉదారుడవైన ప్రభువా, నీవు అపారంగా కరుణను కురిపిస్తున్నావు. జీవితంలో నాకు కావలసినదంతా నీ కృప, నీ ప్రేమ మాత్రమే. నిన్ను, నీ కరుణను పొందడం ద్వారా, జీవితంలో పరిపూర్ణ తృప్తికి ఏకైక మూలాన్ని నేను పొందుతున్నాను. దయచేసి భూలోక దురాశ నుండి నాకు విముక్తిని ప్రసాదించు. ఈ లోక విషయాలను నీవు చూసే విధంగా చూడటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పునీత యూదాకు నవదిన ప్రార్థన
ఆశలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని సమస్యల్లో
సంవత్సరంలో ఎప్పుడైనా, ముఖ్యంగా అక్టోబర్ 19–27 తేదీల్లో ప్రార్థించవచ్చు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – కపిస్ట్రానోకు చెందిన పునీత యోహాను, గురువు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: జనసమూహానికి ఆహారం పెట్టడం చిత్రకర్త: jorisvo