ఫిబ్రవరి 6, 2024
పునీత పౌలు మికి, సహచర వేదసాక్షుల స్మరణ
నేటి పఠనాలు
సామాన్య కాలం ఐదవ వారంలోని మంగళవారం పఠనాలు

ఆంగ్లంలో వినండి
యెరూషలేము నుండి వచ్చిన కొందరు ధర్మశాస్త్ర పండితులతో పాటు పరిసయ్యులు యేసు చుట్టూ చేరినప్పుడు, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అంటే కడుక్కోని చేతులతో, భోజనం చేయడం గమనించారు. మార్కు 7:6–8
యేసుకు అనతికాలంలోనే వచ్చిన కీర్తి ఈ మతనాయకులలో అసూయాద్వేషాలను రేకెత్తించిందని, వారు ఆయనలో తప్పు వెదకాలని కోరుకున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల వారు యేసును, ఆయన శిష్యులను నిశితంగా గమనించి, యేసు శిష్యులు పెద్దల సంప్రదాయాలను పాటించడం లేదని గుర్తించారు. కాబట్టి నాయకులు ఈ విషయం గురించి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. యేసు తన సమాధానంలో వారిని తీవ్రంగా విమర్శించారు. ఆయన యెషయా ప్రవక్త మాటలను ఉటంకించారు: “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు, కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి; మానవ నియమాలను సిద్ధాంతాలుగా బోధిస్తూ, వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు.”
వారి హృదయాలలో నిజమైన ఆరాధన కొరవడినందున యేసు వారిని తీవ్రంగా విమర్శించారు. భోజనానికి ముందు ఆచారబద్ధంగా చేతులను జాగ్రత్తగా కడుక్కోవడం వంటి పెద్దల వివిధ సంప్రదాయాలు తప్పనిసరిగా చెడ్డవేమీ కావు. అయితే గాఢమైన విశ్వాసం, దేవునిపట్ల ప్రేమ వాటికి ప్రేరణ కాకపోతే ఆ సంప్రదాయాలు అర్థరహితమవుతాయి. మానవ సంప్రదాయాలను బాహ్యంగా పాటించడం నిజంగా దైవారాధన కాదు; వారు నిజమైన దైవారాధన చేయాలన్నదే యేసు కోరిక. వారి హృదయాలు దేవునిపట్ల ప్రేమతో, నిజమైన దైవారాధనతో జ్వలించాలని ఆయన కోరుకున్నారు.
మన ప్రభువు మనలో ప్రతి ఒక్కరి నుండి కోరుకునేది ఆరాధన. పవిత్రమైన, హృదయపూర్వకమైన, నిష్కపటమైన ఆరాధన. మనం గాఢమైన అంతరంగ భక్తితో దేవుణ్ణి ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం ప్రార్థించాలని, ఆయన మాట వినాలని, మన ఆత్మ శక్తులన్నిటితో ఆయన పవిత్ర చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నారు. మనం నిజమైన ఆరాధనలో నిమగ్నమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది.
కతోలికులమైన మన ప్రార్థనా జీవితం, ఆరాధనా జీవితం పవిత్ర ఆరాధనా విధిపై ఆధారపడి ఉన్నాయి. ఆరాధనా విధిలో మన విశ్వాసాన్ని ప్రతిబింబించే, దేవుని కృపను అందించే సాధనాలుగా మారే అనేక సంప్రదాయాలు, ఆచరణలు ఉన్నాయి. ఆరాధనా విధి స్వయంగా, యేసు విమర్శించిన కేవలమైన “పెద్దల సంప్రదాయానికి” ఎంతో భిన్నమైనదే అయినప్పటికీ, మన సభలోని వివిధ ఆరాధనా విధులు బాహ్య క్రియల నుండి అంతరంగ ఆరాధనకు మనలను నడిపించాలని గుర్తుచేసుకోవడం ప్రయోజనకరం. యాంత్రికంగా క్రియలను చేయడం మాత్రమే నిరర్థకం. దివ్యసంస్కారాల బాహ్య వేడుకలో పాల్గొంటున్నప్పుడు, దేవుడు మనపై, మన అంతరంగంలో కార్యం చేయడానికి మనం అనుమతించాలి.
మిమ్మల్ని ఆరాధనలోకి ఆకర్షించాలని మన ప్రభువు హృదయంలో జ్వలిస్తున్న కోరిక గురించి ఈ రోజు ధ్యానించండి. మీరు దివ్యబలిపూజకు హాజరయ్యే ప్రతిసారీ ఈ ఆరాధనలోకి ఆకర్షితులవడానికి ఎంతవరకు మిమ్మల్ని మీరు అనుమతిస్తున్నారో ధ్యానించండి. మీ భాగస్వామ్యం కేవలం బాహ్యమైనదిగా కాకుండా, మొట్టమొదటిగా, అన్నిటికంటే ముఖ్యంగా అంతరంగమైనదిగా ఉండేలా ప్రయత్నించండి. అలా చేయడం వల్ల ధర్మశాస్త్ర పండితులను, పరిసయ్యులను మన ప్రభువు మందలించినట్లే మిమ్మల్ని కూడా మందలించవలసిన పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు.
నా దివ్య ప్రభువా, సమస్త ఆరాధనకు, పూజకు, స్తుతికి నీవు, నీవు మాత్రమే అర్హుడవు. నా హృదయపు లోతుల నుండి నేను నీకు అర్పించే ఆరాధనకు నీవు, నీవు మాత్రమే అర్హుడవు. నీ పవిత్ర నామానికి చెందవలసిన మహిమను నీకు అర్పించేందుకు, మా బాహ్య ఆరాధనా క్రియలను ఎల్లప్పుడూ అంతరంగంలోనూ ఆచరించేలా నాకూ నీ సభ అంతటికీ సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
తపస్సుకాలం కోసం రెండు దైనందిన భక్తి ధ్యాన గ్రంథాలు:
ఎడారిలో 40 రోజులు
&
సిలువ పాదాల చెంత 40 రోజులు
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
నేటి పునీతులు – పునీత పౌలు మికి మరియు సహచరులు, వేదసాక్షులు
పైన ప్రదర్శించిన చిత్రం: జేమ్స్ టిస్సోట్ చిత్రించిన పరిసయ్యుని ఇంట భోజనం



