తెలుగు

దాడికి దిగడం

మార్చి 9, 2025
తపస్సుకాలపు మొదటి ఆదివారం (సంవత్సరం C)
నేటి పఠనాలు

చిత్రం: పిక్రిల్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

పవిత్రాత్మతో నిండిన యేసు యొర్దాను నుండి తిరిగి వచ్చారు. పవిత్రాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించగా, అక్కడ నలభై రోజులపాటు అపవాదిచే శోధింపబడ్డారు. లూకా 4:1–2

ఎవరిపైనైనా దాడి జరిగినప్పుడు లేదా ముప్పు ఉందని అనిపించినప్పుడు, తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించడం సహజం. ఉదాహరణకు, సైనికులు అకస్మాత్తుగా శత్రువుల దాడికి గురైతే, వారు సాధారణంగా రక్షణాత్మక స్థితిని తీసుకుంటారు. అదేవిధంగా, ఇతరులు మనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నట్లు మనకు అనిపించినప్పుడు లేదా అపవాది మనలను శోధించినప్పుడు, మనం తరచూ మనలను మనం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే, ఆటలు, క్రీడలు, సైనిక కార్యకలాపాల రంగాల్లో, “మంచి దాడే ఉత్తమ రక్షణ” అనే నానుడి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ప్రత్యర్థి గెలవకుండా అడ్డుకోవడానికి ఉత్తమ మార్గం వెనుక ఉండి రక్షణాత్మక స్థితిని తీసుకోవడం కాదు, దాడికి దిగడమే.

యేసు అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు అనేక విధాలుగా ఇదే చేశారు. దుష్టుడు తనను నాశనం చేయాలని కోరుకుంటున్నాడని ఆయనకు తెలుసు. అందువల్ల, ప్రార్థించడానికి, ఉపవాసం ఉండటానికి యేసు 40 రోజులపాటు అరణ్యంలోకి వెళ్లినప్పుడు, ఒక విధంగా అపవాదిపై ముందుగా దాడికి దిగారు. అరణ్యంలో యేసు ఎదుర్కొన్న శోధనలు ప్రధానంగా ఆయన భరించి, ఎదిరించవలసిన కష్టాలు కావు. అంతకంటే ముఖ్యంగా, అవి దుష్టుడు చేసిన విఫల దాడులు. ఎందుకంటే యేసు అప్పటికే వాటికి విరుద్ధమైన సద్గుణాలను స్వీకరించారు.

ఏ శోధనలు, పాపాలతో మీరు ఎక్కువగా పోరాడుతున్నారు? ఏ విషయాల్లో మీరు ఓటమిని అనుభవిస్తున్నారు? మీ పోరాటాలను అధిగమించడానికి ఏ విధాలుగా రక్షణాత్మక స్థితిని తీసుకున్నారు? చాలా తరచుగా మనం శోధనలను తప్పుడు పద్ధతిలో ఎదుర్కొంటాం. వాటిని మనం ఎదిరించి, వాటి నుండి మనలను మనం రక్షించుకోవలసిన దుష్టుని దాడులుగా చూస్తాం. అది నిజమే అయినా, అది పూర్తి సత్యం కాదు. మనం ఎదుర్కొనే పోరాటాలను అధిగమించడానికి ఉత్తమ మార్గం, వాటికి విరుద్ధమైన సద్గుణాన్ని ఎంచుకోవడం ద్వారా వాటిని నేరుగా, దృఢంగా, దాడికి దిగే రీతిలో ఎదుర్కోవడమే అన్నది పూర్తి సత్యం.

అరణ్యంలో యేసు జయించిన మూడు శోధనలను పరిగణించండి: తిండిపోతుతనం, వ్యర్థ కీర్తికాంక్ష, దురాశ. ఆ 40 రోజులపాటు యేసు అరణ్యంలోకి వెళ్లడం ద్వారా, ఈ శోధనలు తన ముందుకు రాకముందే ఆయన వాటిని నాశనం చేశారు. ఆ 40 రోజులపాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటాన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవడం ద్వారా, తిండిపోతుతనం వైపు లాగే శోధనను యేసు నిష్ఫలం చేశారు. తన తండ్రితో ఏకాంతంగా ఉండటానికి అరణ్యపు ఒంటరితనంలోకి ప్రవేశించే వినయాన్ని ఎంచుకోవడం ద్వారా, వ్యర్థ కీర్తికాంక్షకు సంబంధించిన శోధన శక్తిని యేసు తొలగించారు. పేదరికంతో, నిరాడంబరతతో కూడిన జీవితాన్ని ఎంచుకోవడం ద్వారా, భూసంపదల శోధన తన ముందుకు రాకముందే దానిని జయించారు.

ఈ నలభై రోజుల తపస్సుకాల ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మనం, మీ జీవితంలో అధిగమించవలసిన పాపాలు, శోధనల గురించి ఈ రోజు ధ్యానించండి. కొన్ని పోరాటాల్లో మీరు నిరంతరం రక్షణాత్మక స్థితిలోనే ఉన్నట్లయితే, ముఖ్యంగా కొన్నిసార్లు ఆ పోరాటంలో ఓడిపోతున్నట్లయితే, మీ వ్యూహాన్ని మార్చుకోవలసిన సమయం వచ్చింది. ఈ తపస్సుకాలంలో, మీరు ఎక్కువగా ఏ పాపాల వైపు శోధింపబడుతున్నారో వాటికి విరుద్ధమైన సద్గుణాలను స్వీకరించండి. దాడికి దిగే రీతిలో ఆ సద్గుణాలను స్వీకరించండి. కోపంతో పోరాడుతుంటే దయను ఎంచుకోండి. తిండిపోతుతనంతో పోరాడుతుంటే ఉపవాసాన్ని ఎంచుకోండి. దురాశతో పోరాడుతుంటే ఉదారతను ఎంచుకోండి. మీ పోరాటం ఏదైనా సరే, మీకు అత్యంత అవసరమైన సద్గుణం వైపు తిరిగి, ఈ తపస్సుకాలంలో దానిపై దృష్టి కేంద్రీకరించండి. అప్పుడు శోధన ఎదురైనప్పుడు దుష్టుణ్ణి, అతని అబద్ధాలను తిరస్కరించడానికి మీరు కూడా చక్కగా సిద్ధపడి ఉంటారు.

శోధనలను ఎదుర్కొన్న నా ప్రభువా, నీవు ప్రతి సద్గుణాన్ని ఎంచుకుని, వాటిని పరిపూర్ణంగా ఆచరించడం ద్వారా నీ జీవితంలోని ప్రతి శోధనను ఎదిరించావు. ఇప్పుడు నాకు అత్యంత అవసరమైన సద్గుణాలను గుర్తించడానికి దయచేసి సహాయం చేయి. ఈ తపస్సుకాలంలో నా పూర్ణహృదయంతో వాటివైపు పరుగెత్తడానికి కావలసిన బలాన్ని నాకు ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

తపస్సుకాలపు మొదటి ఆదివారం కోసం ధ్యానం:
ఎడారిలో 40 రోజులు

తపస్సుకాలం కోసం వనరులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – రోముకు చెందిన పునీత ఫ్రాన్సెస్కా, సన్యాసిని
ఈ సంవత్సరం ఈ రోజు ఆదివారం కావడంతో ప్రార్థనాక్రమంలో స్మరణదినంగా జరుపుకోరు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు