ఏప్రిల్ 23, 2025
పాస్కా అష్టదినోత్సవంలోని బుధవారం
నేటి పఠనాలు
అబ్రహాం బ్లూమార్ట్, సార్వజనీన వినియోగ పరిధిలో, వికీమీడియా కామన్స్ ద్వారా
ఆంగ్లంలో వినండి
ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, రొట్టెను తీసుకొని, ఆశీర్వదించి, విరిచి, వారికి ఇచ్చారు. అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి; వారు ఆయనను గుర్తించారు. కానీ ఆయన వారి కనులముందు నుండి అదృశ్యమయ్యారు. అప్పుడు వారు ఒకరితో ఒకరు, “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ, లేఖనాలను మనకు వివరించినప్పుడు మన హృదయాలు మనలో జ్వలించలేదా?” అని చెప్పుకున్నారు. లూకా 24:30–31
యేసు శిష్యులలో ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మావుకు ఏడు మైళ్ళ దూరం నడిచి వెళుతూ, గడచిన వారంలో జరిగిన సంఘటనలను గురించి చర్చించుకుంటున్నారు. ఇశ్రాయేలును విమోచించబోయేది యేసేనని వారు అంతకుముందు ఆశించారు—కానీ ఆ తరువాత ఆయన చంపబడ్డారు. మూడు రోజుల తరువాత, ఆయన పునరుత్థానాన్ని గురించి వార్తలు వ్యాపించాయి; అవి వారిని మరింత అయోమయంలో పడవేశాయి. వారు ప్రయాణిస్తుండగా యేసు ఆ ఇద్దరు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. అయితే మొదట వారు ఆయనను గుర్తించలేదు. ఆయన ఎవరో వారి కళ్ళకు మరుగై ఉంది. యేసు వారి మాటలు విని, వారికి అవగాహన లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అందువల్ల మోషే, ప్రవక్తల బోధలను, మెస్సీయ బాధలు అనుభవించి, మరణించి, మూడవ రోజున లేవవలసిన అవసరాన్ని వారికి వివరించారు. యేసు మాట్లాడుతుండగా, శిష్యులకు అర్థం కావడం మొదలైంది; వారి హృదయాలు వారిలో జ్వలించాయి. చివరికి, పవిత్ర దివ్యసత్ప్రసాదమనే వరంలో, రొట్టెను విరిచే సమయంలో, తమతో ఉన్నది యేసేనని చూడటానికి వారి కళ్ళు తెరుచుకున్నాయి.
యేసు తన పునరుత్థాన సాన్నిధ్యాన్ని ఈ శిష్యులకు ఎందుకు మరుగుపరిచారు? వారిలో విశ్వాసం కొరవడినందువల్లే ఆయన అలా చేసినట్లు కనిపిస్తుంది. వారు, “…ఇశ్రాయేలును విమోచించబోయేది ఆయనేనని మేము ఆశించాము” అన్నారు. కానీ సిలువ మరణాన్ని వారు తట్టుకోలేకపోయారు. విమోచకుడు యేసు అనుభవించినట్లుగా ఎందుకు బాధలు అనుభవించవలసి వచ్చిందో వారు గ్రహించలేకపోయారు. అందువల్ల వారు సందేహించడం మొదలుపెట్టారు.
విశ్వాస విషయాలలో అయోమయానికి గురై, సందేహాలతో సతమతమయ్యే ఈ శిష్యులవలె మనమూ తరచుగా ఉంటాము. అందువల్ల, ఎమ్మావు దారిలో నడుస్తున్న ఈ శిష్యులలో మనల్ని మనం చూసుకోవాలి. తన రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడటం ద్వారా యేసు ఈ శిష్యులకు అద్భుతమైన కారుణ్య వరాన్ని అందించారు. తనను గురించి లేఖనాలలో బోధించినదంతా ఆయన వారికి వివరించారు. యేసు బోధనను వింటూ ఈ శిష్యులు క్రమంగా విశ్వసించసాగారు.
యేసు మరణ పునరుత్థానాలకు ఉన్న పరివర్తన శక్తిని గురించి మనకు బోధించడానికి మనమూ ఆయనను అనుమతించాలి. ఆయన పవిత్ర వాక్యాన్ని వింటున్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించి, మన హృదయాలు మనలో జ్వలించనివ్వాలి. ఈ విధంగా మాత్రమే పాస్కా రహస్యపు పరివర్తన శక్తిని మరింత సంపూర్ణంగా గ్రహించి, అంగీకరించడానికి అవసరమైన విశ్వాస స్థాయికి మనం చేరుకుంటాము.
ఈ శిష్యులను గురించి, అర్థం చేసుకోవడానికి, విశ్వసించడానికి, తమ కళ్ళు తెరుచుకోవడానికి వారు దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. మీకూ ఇదే కృప అవసరమని తెలుసుకోండి. మీరు మరింత సంపూర్ణంగా విశ్వసించేలా, మన ప్రభువు వాక్యంలో మునిగిపోయి, ఆయన స్వరాన్ని ఆలకిస్తూ, ఆయనతో సమయం గడపాలి. మీరూ విశ్వసించేలా యేసు మరణ పునరుత్థానాల సందేశాన్ని మీ అంతరంగంలో జ్వలించనివ్వండి.
పునరుత్థానుడవైన నా ప్రభువా, విశ్వాసం, అవగాహన కొరవడిన ఈ శిష్యులకు నీవు ప్రత్యక్షమై, నీ పవిత్ర బోధన అనే వరాన్ని వారికి ప్రసాదించావు. ప్రియ ప్రభువా, నీ గురించి, నీ మరణం, పునరుత్థానం, నూతన జీవమనే మహిమాన్విత వరం గురించి నేను అర్థం చేసుకొని తెలుసుకోవలసినదంతా నాకు బోధించు. నీ వాక్యం నా అంతరంగంలో జ్వలించి, నా జీవిత పరివర్తనకు నన్ను నడిపించుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఆరవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధమయ్యేందుకు నవదిన ప్రార్థన
పాస్కా కాలం కొరకు పవిత్ర గ్రంథ ధ్యానాలు
నేటి పునీతులు – పునీత జార్జి, వేదసాక్షి
(పాస్కా అష్టదినోత్సవంలో వస్తున్నందున ఈ సంవత్సరం ఈ పండుగను జరుపుకోరు)




