తెలుగు

యేసూ, జాలి చూపు!

ఆదివారం, అక్టోబరు 28, 2018

సాధారణ కాలపు ముప్పయ్యవ ఆదివారం, సంవత్సరం B

నేటి పఠనాలు

అపొస్తలులైన పునీత సీమోను, పునీత యూదా – పండుగ

ఆంగ్లంలో వినండి

ఆయన నజరేతు యేసు అని వినగానే, [బర్తిమయి] “యేసూ, దావీదు కుమారుడా, నాపై కనికరం చూపు” అని బిగ్గరగా కేకలు వేయసాగాడు.  మార్కు 10:47

అంధుడైన బర్తిమయి పలికిన ఈ మాటలు కొన్ని కారణాలవల్ల మనకు పరిపూర్ణమైన ప్రార్థనను అందిస్తున్నాయి.

మొదటిగా, ఈ ప్రార్థన బర్తిమయిలోని ప్రగాఢమైన వినయాన్ని వెల్లడిస్తుంది.   ఈ ప్రార్థన చేయడం ద్వారా, తనకు అవసరమైనది యేసు నుంచే లభిస్తుందని, తనకు తాను సహాయం చేసుకోలేనని తనకు తెలుసని బర్తిమయి వ్యక్తం చేస్తున్నాడు.  తాను బలహీనుడినని, యేసు మాత్రం పరిపూర్ణమైన బలమని బర్తిమయికి తెలుసు.  అందుకే, తనకు కావలసినదంతా యేసు నుంచే లభిస్తుందని గుర్తించి, తన అవసరంలో వినయంతో ఆయన వైపు తిరిగాడు.

రెండవదిగా, ఇది “కనికరం” కోసం మొరపెట్టే ప్రార్థన.  ఇతరుల బాధను చూసి కలిగే దుఃఖం, జాలితో కూడిన భావమే కనికరం.  కనికరం అంటే కరుణ; అది చూపవలసిన అవసరం లేకున్నా ఒకరు మరొకరికి అందించే ప్రేమరూపం.  ఈ ప్రార్థనలో బర్తిమయి, అటువంటి వరానికి తాను అనర్హుడైనప్పటికీ, తనపై దయ, కరుణ చూపమని సర్వశక్తిమంతుడైన ప్రభువును వేడుకుంటున్నాడు.  మన ప్రభువు సహాయం పొందడానికి తాను అర్హుడు కాదని బర్తిమయికి తెలుసనే విషయాన్ని ఈ ప్రార్థన వెల్లడిస్తుంది. అయినా యేసు తనకు సహాయం చేస్తాడనే ఆశతో అతడు మొరపెట్టుకున్నాడు.  నిజంగానే, ఆయన సహాయం చేస్తాడు.

మూడవదిగా, ఈ ప్రార్థన ఒక స్పష్టమైన, గాఢమైన ఆర్తిని వెల్లడిస్తుంది.  ఇది కేవలం దేవుని సహాయం కోరే విన్నపం కాదు; సహాయం కోసం చేసే ఆర్తనాదం.  ఇది ఒక వేడుకోలు, ఒక విధమైన యాచన.  తన బలహీనతలు బయటపడతాయనే సంకోచం గానీ, ఇతరులు వాటిని చూస్తారని లేదా ఏమనుకుంటారో అనే చింత గానీ లేకుండా తన ఆత్మను దేవుని ఎదుట విప్పి ఉంచడం.  ఇది ఆ అంధుని ప్రార్థనలోని గాఢతను చూపిస్తుంది.

బర్తిమయి చేసిన చిన్న ప్రార్థనలోని ఈ మూడు పాఠాలను నేడు ధ్యానించండి. మనం వినమ్రంగా ఉండాలి, కరుణ కోసం వేడుకోవాలి; గాఢమైన తపనతో, ఆర్తితో అలా చేయాలి. ఈ విధంగా ప్రార్థించడం దేవుని కృపను, కరుణను స్వీకరించడానికి మనలను తప్పక సంసిద్ధులను చేస్తుంది.

ప్రభువైన యేసూ, దావీదు కుమారుడా, నాపై కనికరం చూపు.  నీ కరుణ, కనికరం కోసం నా హృదయమంతటితో వినయంగా నిన్ను వేడుకుంటున్నాను.  నాకు అర్హత లేకున్నా, నీ కృపను కోరుతున్నాను; నీ మంచితనంపై నమ్మకం ఉంచుతున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని>>>

నేటి పునీతులు – అపొస్తలులైన పునీత సీమోను, పునీత యూదా