ఏప్రిల్ 11, 2020

ఈ రోజు గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. రక్షకుడు మరణించారు. ఆయన సమాధిలో విశ్రమిస్తున్నారు. అనేక హృదయాలు అదుపు చేయలేని దుఃఖంతోనూ అయోమయంతోనూ నిండిపోయాయి. ఆయన నిజంగానే వెళ్లిపోయారా? వారి ఆశలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయా? యేసును ప్రేమించి, ఆయనను అనుసరించిన ఎంతోమంది మనసులను, హృదయాలను ఇవి, ఇలాంటి మరెన్నో నిరాశాపూరిత ఆలోచనలు నింపివేశాయి.
యేసు ఇంకా బోధిస్తూనే ఉన్నారనే వాస్తవాన్ని ఈ రోజున మనం గౌరవపూర్వకంగా స్మరించుకుంటాము. తన రక్షణ వరాన్ని అందించడానికి ఆయన మృతుల లోకానికి, తనకంటే ముందుగా మరణించిన పవిత్ర ఆత్మలందరి వద్దకు దిగివెళ్లారు. మోషేకు, అబ్రాహాముకు, ప్రవక్తలకు, ఇంకా ఎంతోమందికి ఆయన తన కారుణ్యాన్ని, విమోచనాన్ని వరంగా అందించారు. వారికి ఇది ఎంతో ఆనందకరమైన రోజు. కానీ తమ మెస్సీయ సిలువపై మరణించడం చూసినవారికి ఇది ఎంతో దుఃఖాన్ని, అయోమయాన్ని కలిగించిన రోజు.
పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ విషయాన్ని ధ్యానించడం ప్రయోజనకరం. యేసు తన విమోచన కార్యాన్ని, మునుపెన్నడూ ఎరుగనంత గొప్ప ప్రేమకార్యాన్ని నెరవేరుస్తుండగా, ఎంతోమంది పూర్తిగా అయోమయంలోనూ నిరాశలోనూ ఉన్నారు. దేవుని మార్గాలు మన మార్గాలకంటే ఎంత ఉన్నతమైనవో ఇది చూపిస్తుంది. గొప్ప నష్టంగా కనిపించినది నిజానికి మునుపెన్నడూ ఎరుగనంత మహిమాన్వితమైన విజయంగా మారింది.
మన జీవితాల్లోనూ ఇలాగే జరుగుతుంది. అత్యంత ఘోరమైన విషాదాలుగా కనిపించేవి కూడా ఎల్లప్పుడూ కనిపించినట్లే ఉండవని పవిత్ర శనివారం మనకు గుర్తుచేయాలి. పుత్రుడైన దేవుడు సమాధిలో ఉన్నప్పుడు నిశ్చయంగా గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన తన విమోచన కార్యాన్ని నెరవేరుస్తున్నారు. జీవితాలను మార్చుతూ, కృపను, కారుణ్యాన్ని కుమ్మరిస్తున్నారు.
పవిత్ర శనివారం సందేశం స్పష్టమైనది. అది నిరీక్షణ సందేశం. అది లోకరీతిలోని నిరీక్షణ కాదు; దైవిక నిరీక్షణను తెలిపే సందేశం. దేవుని పరిపూర్ణ ప్రణాళికపై నిరీక్షణ, నమ్మకం ఉంచడం. దేవునికి ఎల్లప్పుడూ మరింత గొప్ప ఉద్దేశం ఉంటుందనే వాస్తవంపై నిరీక్షణ ఉంచడం. దేవుడు బాధను, ఈ సందర్భంలో మరణాన్ని కూడా, రక్షణకు శక్తిమంతమైన సాధనంగా ఉపయోగిస్తారనే వాస్తవంపై నిరీక్షణ ఉంచడం.
ఈ రోజు నిశ్శబ్దంగా కొంత సమయం గడపండి. పవిత్ర శనివారం యథార్థంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి. పాస్కా పండుగ త్వరలోనే రానున్నదని తెలుసుకొని, మీలో దైవిక నిరీక్షణ పెరగనివ్వండి.
ప్రభువా, నీ శ్రమలను, మరణాన్ని వరంగా ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీ పునరుత్థానం కోసం మేము ఎదురుచూస్తున్న ఈ నిశ్శబ్ద దినానికి కృతజ్ఞతలు. నా జీవితంలో కూడా నీ విజయం కోసం నేను ఎదురుచూసేలా అనుగ్రహించు. ప్రియ ప్రభువా, నేను నిరాశతో పోరాడుతున్నప్పుడు, ఈ రోజును గుర్తుచేసుకునేలా నాకు సహాయం చేయి. అంతా నష్టంగానే కనిపించిన రోజు ఇది. నీవు అన్ని విషయాల్లోనూ నమ్మదగినవాడవని, నీపై నమ్మకం ఉంచేవారికి పునరుత్థానం ఎల్లప్పుడూ నిశ్చయమని గుర్తుంచుకుంటూ, నా పోరాటాలను పవిత్ర శనివారం వెలుగులో చూడటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
రెండవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడే నవదిన ప్రార్థన
పవిత్ర శనివారం కోసం ప్రార్థనా ధ్యానం
జపమాల – దుఃఖ రహస్యాలు (పవిత్ర గ్రంథ వచనాలతో)
పునీత స్తనిస్లాస్, పీఠాధిపతి, వేదసాక్షి
ఈ సంవత్సరం ఈ రోజు పవిత్ర శనివారం కావడంతో ప్రార్థనాక్రమ జ్ఞాపకోత్సవంగా జరుపుకోరు

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్తీనాతో 365 రోజులు




