ఏప్రిల్ 29, 2020
పాస్కా మూడవ వారంలోని బుధవారం
నేటి పఠనాలు
సియెనా పునీత కతరీనా, కన్యక మరియు సభ పండితురాలు—స్మరణ

ఆంగ్లంలో వినండి
“నా దగ్గరకు వచ్చే ఎవరినీ నేను తిరస్కరించను.” యోహాను 6:37
ఈ చిన్న వాక్యం మన ప్రభువు దైవకారుణ్యం గురించి ఎంతో చెబుతుంది. పునీత ఫౌస్తీనా దైవకారుణ్య దినచర్యలో ఈ వాక్యం తరచూ పునరావృతమవుతుంది. ఎంతోమంది వినవలసిన మాట ఇది.
ఈ మాట వినడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే, చాలా తరచుగా మనం తిరస్కార భారాన్ని మోస్తూ ఉండవచ్చు. తమకు తెలియకుండానే, తమ జీవితంలో ఎదురైన తిరస్కారం వల్ల, మళ్లీ గాయపడతామనే భయంతో అనుబంధాలలో మనసు విప్పడానికి భయపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక అనుబంధంలో ఒక్కసారి గాయపడితే, ఆ తరువాత మీరు జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఈ గాయం కుటుంబ సభ్యుల వల్లనో, జీవిత భాగస్వామి వల్లనో, స్నేహితుల వల్లనో రావచ్చు. మనం ప్రేమతో చేరువ కావడానికి ప్రయత్నించిన ఎవరి నుంచైనా, ప్రతిగా గాయం, తిరస్కారం మాత్రమే ఎదురైనప్పుడు కూడా ఇది కలగవచ్చు. అది ఎంతో బాధ కలిగిస్తుంది.
యేసు మాటలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. ఎందుకంటే, యేసు నమ్మదగినవాడని అవి మనకు మళ్లీ భరోసా ఇస్తాయి. మనం ఆయన దగ్గరకు రావచ్చు, ఆయనకు మన హృదయాలను తెరవవచ్చు, మన బలహీనతలతో సహా పూర్తిగా మనల్ని ఆయనకు అప్పగించుకోవచ్చు. ఆయన మనతో అత్యంత మృదుత్వంతో, గౌరవంతో, దయతో, శ్రద్ధతో వ్యవహరిస్తాడన్నది నిజం. మనం మనపట్ల చూపే శ్రద్ధకంటే ఎక్కువ శ్రద్ధను యేసు మనపట్ల చూపుతాడు!
ఈ రోజు యేసు పలికిన ఈ మాటలను ధ్యానించండి. వాటిని మళ్లీ మళ్లీ పలకండి. “నా దగ్గరకు వచ్చే ఎవరినీ నేను తిరస్కరించను.” మీరు తన దగ్గరకు రావాలని, మీ హృదయాన్ని పూర్తిగా తనకు తెరవాలని ఆయన కోరుకుంటున్నాడని తెలుసుకోండి. అలా చేయడం ద్వారా మీపట్ల తన ప్రేమను వెల్లడించడానికి మీరు ఆయనకు అవకాశం ఇస్తారు. సాధ్యమని మీరు ఎప్పుడూ ఊహించిన దానికంటే మిన్నగా ఆయనపై నమ్మకం ఉంచగలుగుతారు.
ప్రభువా, నా బాధలలోనూ, నాకు ఎదురైన తిరస్కారంలోనూ నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. నీవు దివ్య వైద్యుడవని, నా ఆత్మకు ఓదార్పు కలిగిస్తావని నాకు తెలుసు. నీపై నమ్మకం ఉంచడానికి, నీ ప్రేమను స్వీకరించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
దైవకారుణ్య జపమాలను ప్రార్థించండి
నేటి పునీతులు – సియెనా పునీత కతరీనా, కన్యక మరియు సభ పండితురాలు




