డిసెంబర్ 5, 2020
ఆగమనకాలపు మొదటి వారంలోని శనివారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
“పంట సమృద్ధిగా ఉంది, కానీ పనివారు కొద్దిమందే; కాబట్టి తన పంటకోతకు పనివారిని పంపమని పంట యజమానిని వేడుకోండి.” మత్తయి 9:37–38
దేవుడు మీ నుంచి ఏమి కోరుతున్నారు? మీ ప్రేషితకార్యం ఏమిటి? భక్తితత్పరులైన కొందరు క్రైస్తవులు ప్రజాదరణ పొందిన సువార్త ప్రచారకులు కావాలని కలలు కనవచ్చు. అందరి ప్రశంసలు పొందే వీరోచిత ప్రేమకార్యాలు చేయాలని మరికొందరు కలలు కనవచ్చు. ఇంకొందరు కుటుంబానికి, స్నేహితులకు సన్నిహితంగా ఉంటూ, ఎంతో నిశ్శబ్దమైన, ఎవరి కంటా పడని విశ్వాస జీవితం గడపాలని కోరుకోవచ్చు. కానీ దేవుడు మీ నుంచే ఏమి కోరుతున్నారు?
పై వచనంలో యేసు తన శిష్యులను “తన పంటకోతకు పనివారి” కోసం ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నారు. మన ప్రభువు చెప్పే ఆ “పనివారిలో” మీరు కూడా ఉన్నారని నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ఈ ప్రేషితకార్యం యాజకులు, సమర్పితులు, పూర్తికాలం సువార్త ప్రచారం చేసే లౌకిక విశ్వాసులు వంటి ఇతరుల కోసమేనని అనుకోవడం సులభం. తాము అందించగలిగింది అంతగా ఏమీ లేదని చాలామంది తేల్చుకోవడం సులభం. కానీ అది సత్యానికి పూర్తిగా విరుద్ధం.
దేవుడు మీ ద్వారా అసాధారణమైన మహిమగల కార్యాలు చేయాలని కోరుతున్నారు. అవును, “అసాధారణమైన మహిమగల కార్యాలు!” అంటే, యూట్యూబ్లో ఎంతో ప్రజాదరణ పొందే తదుపరి సువార్త ప్రచారకులుగా మీరు మారతారని గానీ, పునీత మదర్ తెరేసాలా అందరి దృష్టిని ఆకర్షిస్తారని గానీ కాదు. అయితే దేవుడు మీ నుంచి కోరే పని కూడా గతంలో జీవించిన లేదా నేడు జీవించి ఉన్న గొప్ప పునీతుల పనులంత వాస్తవమైనది, అంతే ముఖ్యమైనది.
జీవిత పవిత్రతను ప్రార్థనలోనే కాకుండా ఆచరణలో కూడా కనుగొంటాం. మీరు ప్రతిరోజూ ప్రార్థిస్తూ క్రీస్తుకు మరింత దగ్గరయ్యేకొద్దీ, నేటి సువార్తలో చెప్పినట్లుగా, “రోగులను స్వస్థపరచండి, మృతులను లేపండి, కుష్ఠురోగులను శుద్ధి చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి” (మత్తయి 10:8) అని ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయితే మీ స్వంత పిలుపులో మీకే ప్రత్యేకమైన విధంగా దీనిని చేయమని ఆయన మిమ్మల్ని పిలుస్తారు. మీ రోజువారీ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి ప్రతిరోజూ మీకు ఎదురయ్యేవారిలో రోగులు, మృతులు, కుష్ఠురోగులు, దయ్యం పట్టినవారు ఎవరు? ఏదో ఒక మేరకు అలాంటివారు మీ చుట్టూ ఉండే అవకాశమే ఎక్కువ. ఉదాహరణకు, “కుష్ఠురోగులు” అనబడేవారిని తీసుకోండి. వీరు సమాజం “వెలివేసినవారు.” మన లోకం కఠినంగా, క్రూరంగా ఉండవచ్చు; కొందరు దారితప్పినట్లు, ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. మీకు తెలిసినవారిలో ఈ వర్గంలోకి వచ్చేవారు ఎవరు? కొంత ప్రోత్సాహం, అవగాహన, కనికరం అవసరమైనవారు ఎవరు? దేవుడు మరెవరికీ ఇవ్వని రోజువారీ కర్తవ్యాన్ని మీకు ఇచ్చారు. అందుచేత మీ ప్రేమ అవసరమైనవారు కొందరు ఉన్నారు. వారిని వెదకండి, వారికి చేయూతనివ్వండి, వారితో క్రీస్తును పంచుకోండి, వారికి తోడుగా ఉండండి.
మరొకరికి క్రీస్తుగా ఉండేందుకు మీకు ఇవ్వబడిన ఈ అసాధారణమైన మహిమగల పిలుపును గురించి ఈ రోజు ధ్యానించండి. ఈ ప్రేమ కర్తవ్యాన్ని స్వీకరించండి. క్రీస్తు కోసం పనిచేయడానికి మీకు పిలుపు వచ్చిందని గుర్తించండి. మీ జీవితంలో ఈ ప్రేషితకార్యాన్ని ఏ విధంగా జీవించవలసి వచ్చినా, దానిని సంపూర్ణంగా, మహిమకరంగా నెరవేర్చడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి.
నా ప్రియ ప్రభువా, నీ దివ్య ప్రేషితకార్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను. నా జీవితానికి నిన్ను, నీ పవిత్ర చిత్తాన్ని ఎంచుకుంటున్నాను. ప్రియ ప్రభువా, నీ ప్రేమ, కరుణ అత్యంత అవసరమైనవారి వద్దకు నన్ను పంపు. నాకు అప్పగించబడినవారు తమ జీవితాల్లో నీ మహిమగల రక్షణదాయక కృపను అనుభవించేలా, ఆ ప్రేమను, కరుణను వారికి ఎలా అందించగలనో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మరియమ్మ జన్మపాపరహిత గర్భధారణకు నవదిన ప్రార్థన
నవంబర్ 29-డిసెంబర్ 7
పైన చూపిన చిత్రం: అపొస్తలుల దివ్యసత్ప్రసాద స్వీకారం — సృష్టికర్త: అపొస్తలుల దివ్యసత్ప్రసాద స్వీకారం
ఆగమనకాలం మరియు క్రిస్మస్ ధ్యానాలు
పేపర్బ్యాక్ & ఈ-పుస్తకం
Amazon.com – గూగుల్ ప్లే – ఐట్యూన్స్ – బార్న్స్ అండ్ నోబుల్





