ఆగస్టు 8, 2021
సామాన్య కాలపు పందొమ్మిదవ ఆదివారం (సంవత్సరం B)
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
యూదులు యేసును గురించి సణుగుకున్నారు…యేసు వారికి జవాబిస్తూ, “మీలో మీరు సణుగుకోవడం మానుకోండి” అని అన్నారు. యోహాను 6:41&43
యేసు గురించి పుకార్లు పుట్టించారు, ఆయనను ఎగతాళి చేశారు, కించపరిచారు, ఇంకా ఎన్నో చేశారు. ఆయన గురించి వారు “సణుగుకున్నారు.” ప్రజలు అలా చేయడం ఎంత అవివేకం!
పై వాక్యభాగంలో యేసు తన అత్యంత మహిమాన్వితమైన, గంభీరమైన బోధలలో ఒకదాన్ని అందిస్తున్నారు. జీవాహారంగా తన శరీరరక్తాలను ఇచ్చే వరమైన అతి పరిశుద్ధ దివ్యసత్ప్రసాదాన్ని గురించి ఆయన తన బోధను కొనసాగిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు: “పరలోకం నుండి దిగివచ్చిన సజీవ ఆహారాన్ని నేనే; ఈ ఆహారాన్ని భుజించేవారు నిరంతరం జీవిస్తారు; లోకానికి జీవం కలిగేందుకు నేను ఇచ్చే ఆహారం నా శరీరమే.” ఈ బోధను విన్నప్పుడు వారు ఆయన గురించి సణుగుకున్నారు.
ఆ కాలంలో అనేకమంది అలా చేయడం ఎంత అవివేకమో కదా! అయితే విచారకరంగా, ఇదే విషయం నేటికీ రకరకాల రూపాల్లో జరుగుతోంది. ప్రతి ఆదివారం (వీలైతే ప్రతిరోజూ) మెస్సయ్య, రాజాధిరాజు, లోక రక్షకుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, మహిమాన్వితుడైన దేవుని శరీరరక్తాలను, ఆత్మను, దైవత్వాన్ని స్వీకరించే అవకాశం మనకు లభిస్తోంది! అయినా మనలో ఎంతోమంది ఏం చేస్తున్నారు? మనం ఆసక్తి లేకుండా, పరధ్యానంతో దివ్యబలిపూజకు వస్తున్నాం. దివ్యబలిపూజలో మనం చేస్తున్నదాని కంటే, ఆ రోజున తరువాత చేయబోయే పనుల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాం.
ఇది సరిదిద్దుకోవలసిన విచారకరమైన వాస్తవం. “దివ్యబలిపూజ అనే వరాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, ప్రేమతో తక్షణమే ప్రాణాలు విడుస్తాం” అని పునీత జాన్ వియాన్నీ అన్నారు. దివ్యబలిపూజను మీరు అర్థం చేసుకుంటున్నారా?
దివ్యసత్ప్రసాదాన్ని గురించిన యేసు బోధపై సణుగుకోవడం అంటే తప్పనిసరిగా బయటికి మాటల్లో చెప్పడమే కానక్కరలేదు. ఈ మహిమాన్వితమైన వరాన్ని అర్థం చేసుకోకుండా, అంగీకరించకుండా, దానిలో భాగం పంచుకోకుండా ఉన్నప్పుడు మనం అంతరంగంలో యేసు గురించి “సణుగుకుంటున్నాం.” ఈ వరంపై సంపూర్ణ నిశ్చయం లేకపోవడం, దానిని మనస్ఫూర్తిగా స్వీకరించకపోవడం కూడా సణుగుకోవడమే. బహుశా మనం బయటికి మాటలతో సణుగుకోకపోవచ్చు. కానీ ఈ అమూల్యమైన వరం పట్ల ఆసక్తి లేకపోవడం ద్వారా మనం అంతరంగంలో సణుగుకుంటున్నామని గుర్తించవచ్చు.
మీ హృదయం పరిశుద్ధ దివ్యసత్ప్రసాదంలో పూర్తిగా లీనమై ఉందో లేదో ఈరోజు ధ్యానించండి. దివ్యబలిపూజకు వెళ్లాలని తలచినప్పుడు, మీ హృదయం ఆనందంతో, గాఢమైన ఆధ్యాత్మిక ఆకాంక్షతో ఉప్పొంగుతుందా? లేక దానిని మీరు నెరవేర్చవలసిన బాధ్యతగా చూస్తున్నారా? నెరవేర్చవలసిన బాధ్యతగానే ఎక్కువగా భావిస్తుంటే, మీరు గుర్తించిన దానికంటే ఎక్కువగా మీ అంతరంగంలో “సణుగుకోవడం” ఉండవచ్చు.
ప్రభువా, దివ్యబలిపూజలో నిన్ను చూడటానికి నాకు సహాయం చేయుము. అతి పరిశుద్ధ దివ్యసత్ప్రసాదంలో నీ కోసం తపించడానికి నాకు సహాయం చేయుము. నాకు తగిన విశ్వాసమూ భక్తీ ఎన్నడూ లోపించకుండునుగాక. ఈ పవిత్ర వరంలో సన్నిహితుడవైన నీ పట్ల గాఢమైన ప్రేమతో నేను ఎల్లప్పుడూ నిండి ఉండునుగాక! యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
నేటి పునీతులు – పునీత డొమినిక్, యాజకుడు
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున దీనిని ప్రార్థనాక్రమంలో స్మరణదినంగా జరుపుకోరు




