తెలుగు

దేవుని అగ్ని ద్వారా శుద్ధీకరణ

డిసెంబరు 12, 2021
ఆగమనకాల మూడవ ఆదివారం (సంవత్సరం సి)
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యోహాను వారందరికీ ఇలా సమాధానమిచ్చాడు: ”నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. ఆయన చెప్పుల వారలను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ఇస్తాడు. తన కల్లాన్ని శుభ్రం చేసి, గోధుమలను తన గాదెలో పోగుచేయడానికి తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. అయితే పొట్టును ఆయన ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు.” లూకా 3:16–17

ఈ ఆదివారం కూడా మనకు పునీత స్నాపక యోహాను మహిమాన్వితమైన సాక్ష్యం అందించబడుతోంది. యోహాను తన ఈ ప్రసంగంలో, యేసు వచ్చి “పవిత్రాత్మతోను అగ్నితోను” జ్ఞానస్నానం ఇస్తాడని చెబుతున్నాడు. “అగ్నితో” జ్ఞానస్నానం పొందడం అనే దృశ్యరూపం ధ్యానించదగినది. ముఖ్యంగా, మన ఆత్మలు పొందాలని యేసు కోరుకునే లోతైన శుద్ధిని అది మనకు వెల్లడిస్తుంది.

శుద్ధి చెందడం అంటే ఏమిటి? ఒక విషయం ఏమిటంటే, మన ఆత్మ శుద్ధి చెందడం బాధను కలిగిస్తుంది. అయితే ఆ బాధలో ఒక విధమైన మాధుర్యం ఉంటుంది. పాపం నుండి మరలి దేవునికి మరింత దగ్గర కావడానికి గొప్ప త్యాగం, సమర్పణ అవసరం. మనలో శక్తిమంతమైన కార్యాలు చేయడానికి దేవుణ్ణి అనుమతించడం కూడా అవసరం. దేవుడు చేయాలనుకునే అత్యంత శక్తిమంతమైన కార్యం మనలను శుద్ధి చేయడమే.

మనం మరణించిన తరువాత ఉత్తరింపుస్థలం ఉందనే వాస్తవాన్ని మన కతోలిక విశ్వాసం మనకు వెల్లడిస్తుంది. ఉత్తరింపుస్థలం ఎంతో ఆధ్యాత్మిక బాధ కలిగే స్థలమని చెబుతారు. అయితే ఇక్కడ కూడా ఆ బాధలో ఒక విధమైన మాధుర్యం ఉంటుంది. మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నప్పటికీ మనం పట్టుకొని ఉన్నవన్నీ మన నుండి తొలగించబడతాయి కాబట్టి అది బాధాకరం. మనం ఎలాంటివారమో, దేనిని ప్రేమిస్తున్నామో అనే విషయాల్లో సంపూర్ణ పరివర్తనకు లోనవుతాము కాబట్టి అది బాధాకరం. దేవుణ్ణి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం నేర్చుకుంటాము. దేవునిపట్ల మన ప్రేమ ఆలింగనంలో, మనుష్యులందరినీ ప్రేమించడం మొదలుపెడతాము.

ఇది మధురమైనది కూడా. ఎందుకంటే మనం శుద్ధి చెందుతున్న కొద్దీ దేవునికి అపరిమితంగా దగ్గరవుతూ, పవిత్రతలో ఎదుగుతాము. ఇది పాపభారాన్ని తొలగించి, మనం ప్రేమించవలసిన విధంగా ప్రేమించడానికి మనలను స్వతంత్రులను చేస్తుంది.

అయితే మన శుద్ధీకరణ ఉత్తరింపుస్థలంలోనే మొదలవకూడదు. ఆ శుద్ధీకరణ ప్రక్రియలో ఇక్కడే, ఇప్పుడే ప్రవేశించడానికి మనమందరం పిలువబడ్డాము. ఈ రోజు బప్తిస్త యోహాను మాటలను ఆలకించి, పవిత్రమైన జీవితం నుండి మనలను దూరంగా ఉంచే వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపపడి, వాటిని విడిచిపెట్టడానికి మనం పిలువబడ్డాము.

దేవుడు మిమ్మల్ని ఏ శుద్ధీకరణకు పిలుస్తున్నాడో ఈ రోజు ధ్యానించండి. మీరు దేని నుండి విముక్తి పొందాలని ఆయన కోరుతున్నప్పటికీ, ఇంకా దేనిని పట్టుకొని ఉన్నారు? దేవుని ప్రేమ అనే శుద్ధి చేసే అగ్నికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఈ ఆగమనకాలంలో ఆ ప్రేమ మిమ్మల్ని శుద్ధి చేయనివ్వండి.

ప్రభువా, నా ఆత్మను నీవు శుద్ధి చేయాలని నేను నిజంగా తపిస్తున్నాను. జీవిత పవిత్రతను నేను నిజంగా కోరుకుంటున్నాను. నాకోసం నీవు సిద్ధం చేసి ఉంచిన ఆనందాన్ని, స్వేచ్ఛను అనుభవించడం ప్రారంభించేలా, ఈ ప్రక్రియను ఇక్కడే, ఇప్పుడే ప్రారంభించడానికి నాకు సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

మా ఆగమనకాల వనరులను చూడండి!

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – గ్వాదలూపే మాత—అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పండుగ
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ప్రార్థనావిధాన జ్ఞాపకార్థ దినంగా జరుపుకోరు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: పునీత స్నాపక యోహాను బోధన — చిత్రకారుడు అలెస్సాండ్రో అల్లోరి, సౌజన్యం: వికీమీడియా కామన్స్