తెలుగు

పాపంతో పక్షవాతానికి గురై

మార్చి 29, 2022
తపస్సుకాలం నాలుగవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు అతనితో, “లేచి, నీ చాప తీసుకొని నడువు” అని అన్నారు.  వెంటనే ఆ మనిషి స్వస్థత పొంది, తన చాప తీసుకొని నడిచాడు.  యోహాను 5:8–9

పైన ఉన్న ఈ వాక్యభాగంలోని స్పష్టమైన ప్రతీకాత్మక అర్థాలలో ఒకదానిని చూద్దాం.  యేసు స్వస్థపరచిన మనిషి పక్షవాతంతో బాధపడుతూ, నడవలేక, తనను తాను చూసుకోలేక ఉండేవాడు.  అతడు దయను, ఆదరణను ఆశిస్తూ కోనేరు పక్కన కూర్చొని ఉండగా, ఇతరులు అతణ్ణి నిర్లక్ష్యం చేశారు.  యేసు అతణ్ణి చూసి, తన పూర్తి శ్రద్ధను అతనిపై ఉంచుతారు.  కొద్దిసేపు మాట్లాడిన తరువాత, యేసు అతణ్ణి స్వస్థపరచి, లేచి నడవమని చెబుతారు. 

అతని శారీరక పక్షవాతం మన జీవితాలలో పాపం కలిగించే ఫలితానికి ప్రతిరూపం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించే ఒక ప్రతీకాత్మక సందేశం.  మనం పాపం చేసినప్పుడు, మనకు మనమే “పక్షవాతం” కలిగించుకుంటాము.  పాపం మన జీవితాలపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. వాటిలో అత్యంత స్పష్టమైనది ఏమిటంటే, మనం లేచి దేవుని మార్గాలలో నడవలేని స్థితిలో మిగిలిపోవడం.  ముఖ్యంగా, ఘోరపాపం మనం ప్రేమించడానికి, నిజమైన స్వేచ్ఛతో జీవించడానికి శక్తిలేకుండా చేస్తుంది.  అది మనలను బంధించి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని గానీ, ఇతరులను గానీ ఏ విధంగానూ చూసుకోలేని స్థితిలో ఉంచుతుంది.  పాపపు పరిణామాలను గుర్తించడం ముఖ్యం.  చిన్న పాపాలు కూడా మన సామర్థ్యాలకు ఆటంకం కలిగించి, మన శక్తిని హరించి, ఏదో ఒక మేరకు మనలను ఆధ్యాత్మికంగా అశక్తులను చేస్తాయి. 

ఈ విషయం మీకు ఇప్పటికే తెలిసి ఉంటుందని, ఇది మీకు కొత్తగా తెలిసిన విషయం కాదని ఆశిస్తున్నాము.  అయితే, మీ ప్రస్తుత పాపదోషాన్ని నిజాయితీగా అంగీకరించడం మాత్రం మీలో కొత్తగా జరగాలి.  ఈ కథలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి.  యేసు ఈ మనిషిని స్వస్థపరచింది అతని మేలు కోసం మాత్రమే కాదు.  మీ పాపపు పరిణామాలను అనుభవిస్తూ మీరు దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పుడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నారని మీకు తెలియజేయడం కూడా అతణ్ణి స్వస్థపరచిన ఉద్దేశాలలో ఒకటి.  మీ అవసరాన్ని ఆయన చూస్తారు, మీవైపు దృష్టి సారించి, లేచి నడవమని మిమ్మల్ని పిలుస్తారు.  మీ జీవితంలో స్వస్థతను కలిగించడానికి ఆయనను అనుమతించడం ఎంత ముఖ్యమో తక్కువగా అంచనా వేయవద్దు.  మీపై తన పరిణామాలను మోపుతున్న అతి చిన్న పాపాన్ని కూడా గుర్తించకుండా నిర్లక్ష్యం చేయవద్దు.  మీ పాపాన్ని చూడండి, దానిని చూడటానికి యేసును అనుమతించండి, స్వస్థతను, స్వేచ్ఛను ప్రసాదించే ఆయన మాటలను ఆలకించండి.

నడవలేని ఈ మనిషికి యేసుతో జరిగిన ఈ శక్తిమంతమైన కలయికను గురించి నేడు ధ్యానించండి.  ఆ దృశ్యంలో మిమ్మల్ని మీరు ఉంచుకొని, ఈ స్వస్థత మీ కోసం కూడా జరుగుతోందని తెలుసుకోండి.  ఈ తపస్సుకాలంలో మీరు ఇంకా పాపసంకీర్తనం చేయకపోతే, వెళ్లి పాపసంకీర్తనం చేసి, ఆ సంస్కారంలో యేసు ప్రసాదించే స్వస్థతను కనుగొనండి.  మీ కోసం ఎదురుచూస్తున్న స్వేచ్ఛను పొందే మార్గం పాపసంకీర్తనమే; ముఖ్యంగా, దానిని నిజాయితీగా, సంపూర్ణంగా ఆచరించినప్పుడు.

అత్యంత కరుణామయుడవైన ప్రభువా, దయచేసి నా పాపాలను క్షమించు.  వాటిని గుర్తించి, వాటివల్ల నాకు కలిగే పర్యవసానాలను అంగీకరించాలని కోరుకుంటున్నాను.  ఈ భారాల నుండి నన్ను విముక్తి చేయాలని, వాటి మూలంలోనే స్వస్థత చేకూర్చాలని నీవు కోరుకుంటున్నావని నాకు తెలుసు.  ప్రభువా, ముఖ్యంగా సయోధ్య సంస్కారంలో నా పాపాలను నీకు ఒప్పుకోవడానికి నాకు ధైర్యాన్ని ప్రసాదించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మన పవిత్ర మాత హృదయం నుండి ప్రేమపూర్వక చూపు
ధ్యానం ఇరవై ఐదు – యేసు పడిపోవడం
(తపస్సుకాలం నాలుగవ వారంలోని మంగళవారం)

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సుకాలం కోసం వనరులు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: బేతెస్దా కోనేటి వద్ద కుంటివారిని స్వస్థపరుస్తున్న క్రీస్తు. చిత్రకారుడు: పీటర్ వాన్ లింట్, వికీమీడియా కామన్స్ ద్వారా