తెలుగు

నిజమైన నీతి

అక్టోబర్ 23, 2022
సామాన్య కాలపు ముప్పయ్యవ ఆదివారం, సి సంవత్సరం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

తాము నీతిమంతులమని నమ్ముతూ, మిగిలిన వారందరినీ తృణీకరించేవారికి యేసు ఈ ఉపమానం చెప్పాడు.   లూకా 18:9

ఈ పవిత్ర గ్రంథ వాక్యం పరిసయ్యుడు, సుంకరి గురించిన ఉపమానానికి పరిచయం.  ఈ ఉపమానం సాధారణంగా కనిపించే రెండు వైఖరుల మధ్య గొప్ప వ్యత్యాసాన్ని చూపిస్తుంది.  మొదటిగా, పరిసయ్యుని వైఖరి అతనికి తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉందని, ప్రజలలో తనకున్న పేరు ప్రతిష్ఠలను గొప్పగా భావిస్తున్నాడని, తన పాపాన్ని గుర్తించడం లేదని వెల్లడిస్తుంది.  రెండవదిగా, సుంకరి వైఖరి అతను తన పాపాన్ని లోతుగా గుర్తిస్తున్నాడని, దాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడని, తనకు దేవుని కరుణ అవసరమని తెలుసుకున్నాడని వెల్లడిస్తుంది.  ఎంతో భిన్నమైన ఈ రెండు వైఖరుల ఫలితంగా, సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు; పరిసయ్యుడు అలా వెళ్ళలేదు.

నీతిమంతునిగా తీర్చబడటం అంటే ఏమిటి?  సుంకరి అంతఃకరణం నిర్మలమై, అతను సత్యంలో స్థిరపడ్డాడని దాని అర్థం.  తనకు కరుణ అవసరమని అతను తెలుసుకున్నాడు, దాని కోసం వేడుకున్నాడు, దానిని పొందాడు.  అతను తనను తాను మోసం చేసుకోలేదు; ఇతరులతోగానీ, దేవునితో గానీ అబద్ధమాడలేదు.  తాను ఎవరో అతనికి తెలుసు; ఈ సత్యమే దేవుడు అతనిని ఉన్నతపరచడానికి వీలు కల్పించింది.  అతని పాపాలు క్షమించబడటం ద్వారా, అతని జీవితంలో దేవుని కరుణ ప్రసాదించబడటం ద్వారా సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు.

అందరికీ కనిపించేలా తనను తాను గొప్ప చేసుకున్నందుకు, పరిసయ్యుడు కొంతవరకు తన గురించి సంతృప్తి చెంది ఉండవచ్చు.  అతనికి తన సొంత నీతిపై గట్టి నమ్మకం ఉంది; కానీ నిజానికి అతను నీతిమంతుడు కాదు.  అతను కేవలం తన దృష్టిలో తానే నీతిమంతుడు.  అతను ఒక అబద్ధాన్ని జీవిస్తున్నాడు; బహుశా ఆ అబద్ధాన్ని తానే నమ్మి ఉండవచ్చు, ఇతరులను కూడా దానిని నమ్మించి ఉండవచ్చు.  కానీ వాస్తవం మారలేదు: పరిసయ్యుడు నీతిమంతుడు కాదు, అతను నిజంగా నీతిమంతునిగా తీర్చబడనూ లేదు.

ఈ వాక్యభాగం నుండి మనం గ్రహించవలసినది ఏమిటంటే, సత్యంలో జీవించడం ఎంత ముఖ్యమో లోతుగా తెలుసుకోవడం.  తమ గురించి తప్పుడు రూపాన్ని చిత్రించుకునేవారు తమను తాము మోసం చేసుకోవచ్చు, ఇతరులను కూడా మోసం చేయవచ్చు.  కానీ వారు దేవుణ్ణి ఎన్నటికీ మోసం చేయలేరు; తమ ఆత్మలో నిజమైన శాంతిని ఎన్నటికీ పొందలేరు.  మనలో ప్రతి ఒక్కరం మన పాపం, బలహీనత అనే సత్యాన్ని వినయంతో గుర్తించాలి; అలా గుర్తించి, వాటికి ఏకైక పరిహారమైన దేవుని కరుణ కోసం వేడుకోవాలి.

ఈ రోజు ఈ సుంకరి ప్రార్థనను ధ్యానించండి: “ఓ దేవా, పాపినైన నాపై కరుణ చూపించు” (లూకా 18:13).  దానిని మీ ప్రార్థనగా చేసుకోండి.  మీ పాపాన్ని ఒప్పుకోండి.  మీకు దేవుని కరుణ అవసరమని అంగీకరించండి; దేవుని నీతిలో ఆ కరుణ మిమ్మల్ని ఉన్నతపరచడానికి అనుమతించండి.

సమస్త నీతికి ప్రభువైన యేసుక్రీస్తూ, నేను పాపిని కనుక దయచేసి నాపై కనికరం చూపు.  నా పాపాన్ని, నా బలహీనతను అంగీకరిస్తున్నాను; నీ అపారమైన కారుణ్యాన్ని వేడుకుంటున్నాను.  దయచేసి నీ కారుణ్యాన్ని కుమ్మరించు; నీవు అనుగ్రహించాలని కోరుకునే వాటన్నిటినీ స్వీకరించేందుకు నా హృదయాన్ని తెరవడానికి నాకు సహాయం చేయి.  ప్రియ ప్రభువా, వినయంతో కూడిన సత్యంలో జీవించేందుకు నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కొత్తది!

అస్సీసి పునీత ఫ్రాన్సిస్ నుండి పాఠాలు
దేవుని ప్రియ సేవకుని జ్ఞానం

పునీత యూదాకు నవదిన ప్రార్థన
ఆశలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని సమస్యల్లో
సంవత్సరంలో ఎప్పుడైనా, ముఖ్యంగా అక్టోబర్ 19–27 తేదీల్లో ప్రార్థించవచ్చు

మరిన్ని ఆదివారపు వీడియో ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – కపిస్ట్రానోకు చెందిన పునీత యోహాను, యాజకుడు
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున దీనిని ఆరాధనా స్మరణోత్సవంగా జరుపుకోరు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: జేమ్స్ టిస్సో చిత్రించిన ‘పరిసయ్యుడు మరియు సుంకరి’, బ్రూక్లిన్ మ్యూజియం ద్వారా