నవంబరు 3, 2022
సామాన్యకాలం ముప్పై ఒకటవ వారంలోని గురువారం
నేటి పఠనాలు
పునీత మార్టిన్ డి పోరెస్, సన్యాసి—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి
సుంకరులు, పాపులు అందరూ యేసు మాటలు వినడానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, “ఈయన పాపులను ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు” అని గొణగడం మొదలుపెట్టారు. లూకా 15:1-2
మీకు ఎదురయ్యే పాపులతో మీరు ఎలా వ్యవహరిస్తారు? వారిని దూరం పెడతారా, వారి గురించి మాట్లాడుకుంటారా, వారిని ఎగతాళి చేస్తారా, జాలితో చూస్తారా, లేక పట్టించుకోకుండా ఉంటారా? అలా చేయరనే ఆశిస్తున్నాము! పాపంలో ఉన్న వ్యక్తితో మీరు ఎలా వ్యవహరించాలి? యేసు వారిని తన దగ్గరకు రానిచ్చారు, వారిపట్ల శ్రద్ధ చూపారు. నిజానికి, ఆయన పాపులపట్ల ఎంత కరుణతో, దయతో వ్యవహరించారంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు ఆయనను తీవ్రంగా విమర్శించారు. మరి మీ సంగతేమిటి? విమర్శలకు గురికావలసి వచ్చినా పాపులతో మెలగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
కఠినంగా విమర్శించబడటానికి “అర్హులే” అనిపించేవారి పట్ల కఠినంగా, విమర్శనాత్మకంగా ప్రవర్తించడం చాలా సులభం. ఎవరైనా స్పష్టంగా దారితప్పిపోతున్నట్లు మనకు కనిపించినప్పుడు, మనం వారికంటే గొప్పవారమైనట్లుగా లేదా వారు తుచ్ఛులైనట్లుగా వారిని వేలెత్తి చూపుతూ కించపరచడం సమంజసమేనని కూడా మనకు అనిపించవచ్చు. అలా చేయడం ఎంత సులభం, ఎంత పెద్ద పొరపాటు!
మనం యేసులా ఉండాలనుకుంటే, వారిపట్ల మన వైఖరి పూర్తిగా భిన్నంగా ఉండాలి. వారితో మనకు ఎలా వ్యవహరించాలనిపిస్తుందో అలా కాకుండా, భిన్నంగా వ్యవహరించాలి. పాపం వికృతమైనది, మలినమైనది. పాపపు వలయంలో చిక్కుకున్న వ్యక్తిని విమర్శించడం సులభం. అయితే మనం అలా చేస్తే, యేసు కాలంలోని పరిసయ్యులకు, ధర్మశాస్త్రులకు మనకు తేడా ఉండదు. మనలో కరుణ లేకపోవడం వల్ల, యేసు కూడా మనపట్ల అదే కఠినత్వంతో వ్యవహరించే అవకాశం ఎంతో ఉంది.
యేసు పదేపదే గద్దించే కొద్ది పాపాలలో, ఇతరులపై తీర్పు తీర్చడం, విమర్శించడం ఒకటి కావడం గమనించదగిన విషయం. ఈ పాపం మన జీవితాలలో దేవుని కరుణకు తలుపు మూసివేస్తున్నట్లే అనిపిస్తుంది.
పాపాలు కొంతవరకు బహిరంగంగా కనిపించే వారిని మీరు ఎలా చూస్తున్నారు, వారితో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు ధ్యానించండి. మీరు వారిపట్ల కరుణతో వ్యవహరిస్తున్నారా? లేక వారిని చులకనగా చూస్తూ, తీర్పు తీర్చే హృదయంతో వ్యవహరిస్తున్నారా? కరుణ చూపడానికి, ఇతరులపై అసలు తీర్పు తీర్చకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు మళ్లీ అంకితం చేసుకోండి. తీర్పు తీర్చవలసింది క్రీస్తు, మీరు కాదు. కరుణ, కనికరం చూపడానికి మీరు పిలువబడ్డారు. మీరు అలా చేయగలిగితే, మన కరుణామయుడైన ప్రభువును మరింతగా పోలి ఉంటారు.
కారుణ్యమయుడవైన ప్రభువా, కఠినంగా ప్రవర్తించాలని, ఇతరులకు తీర్పు తీర్చాలని నాకు అనిపించినప్పుడు నాకు సహాయం చేయి. పాపం చేసినవారి పాపపు క్రియలను చూడకముందే, వారి ఆత్మలలో నీవు ఉంచిన మంచితనాన్ని చూస్తూ, వారివైపు కరుణతో చూడటానికి నాకు సహాయం చేయి. తీర్పును నీకే వదిలిపెట్టి, దానికి బదులుగా కారుణ్యాన్ని స్వీకరించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పునీత మదర్ తెరేసాపై డాక్యుమెంటరీ చిత్రం—నవంబర్ 2&3!
ఆగమనకాలం, క్రిస్మస్ కోసం కొత్తగా!
ఆగమనకాలం మరియు క్రిస్మస్ ధ్యానాలు
నేటి పునీతులు – పునీత మార్టిన్ డి పోరెస్, సన్యాసి





