తెలుగు

కృతజ్ఞత నిండిన హృదయం

నవంబరు 24, 2022
అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కృతజ్ఞతా దినం—ఐచ్ఛిక స్మరణ

(అమెరికా సంయుక్త రాష్ట్రాలు మినహా ఇతర దేశాలలో ముప్పై నాలుగవ వారంలోని గురువారపు ధ్యానాన్ని చూడండి)

నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు బదులిస్తూ, “పదిమంది శుద్ధి పొందారు కదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? ఈ పరదేశీయుడు తప్ప మరెవరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి తిరిగి రాలేదా?” అని అన్నారు.  లూకా 17:17-18

కృతజ్ఞతా దినోత్సవ శుభాకాంక్షలు!  కృతజ్ఞతా దినోత్సవం ప్రత్యేకంగా కతోలిక పర్వదినం కాకపోయినా, అది మన విశ్వాస జీవితంతో తప్పక ముడిపడి ఉంది.  ఆధ్యాత్మికంగా చూస్తే, సువార్త సందేశంలో కృతజ్ఞతకు కేంద్రస్థానం ఉందని మనందరికీ తెలుసు.  మన విశ్వాసంలోని ఈ ప్రత్యేక అంశాన్ని పరిశీలించడానికి కృతజ్ఞతా దినోత్సవం మనకు చక్కని అవకాశాన్ని అందిస్తుంది.  ఎల్లప్పుడూ, హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉండాలని మనకు పిలుపు ఉంది.  దేవుని పట్ల మీకు ఎంత కృతజ్ఞత ఉంది?

బహుశా కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో మనమందరం వివిధ రీతుల్లో ఇబ్బంది పడుతుంటాం.  పరలోకంలో మనం పరిపూర్ణత పొందేవరకు, మన కృతజ్ఞత ఎన్నటికీ తగినంతగా ఉండదని చెప్పవచ్చు.  అయితే ప్రస్తుతానికి, కృతజ్ఞత గురించి పరిశీలించి, అది మన ఆత్మలలో పెరిగేలా ప్రయత్నించడం ముఖ్యం.

మొదటిగా, దేవుడు మన కోసం చేసినదంతా స్పష్టంగా చూడకపోతే మనకు ఎన్నటికీ కృతజ్ఞత కలగదు.  జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలపైనే దృష్టి నిలిపి, తత్ఫలితంగా కుంగిపోవడం, నిరాశ చెందడం, విసుగెత్తిపోవడం, కొన్నిసార్లు కోపపడటం కూడా ఎంతో సులభం.  ప్రతిరోజూ మనం ఎదుర్కొనే సిలువలు, భారాలకు అతీతంగా చూసి, మన ప్రభువు మనకు ప్రసాదించిన సమృద్ధియైన కృపను, కారుణ్యాన్ని గుర్తించడం మరెంతో కష్టమైన విషయం.  ఆ కారుణ్యాన్ని, కృపను మనం చూడకపోతే, నిజమైన కృతజ్ఞత కలిగి ఉండటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది.

కాబట్టి ఈ కృతజ్ఞతా దినోత్సవాన, ఈ సరళమైన ప్రశ్న గురించి ధ్యానించండి: దేవుడు నా కోసం చేసినదంతా నేను చూస్తున్నానా?  నా జీవితంలో ఆయన అపారమైన కారుణ్యం సజీవంగా పనిచేస్తుండటాన్ని నేను చూస్తున్నానా?  యేసు పదిమంది కుష్ఠరోగులను స్వస్థపరిచారని, కానీ ఆ పదిమందిలో ఒక్కరే కృతజ్ఞతతో తిరిగి వచ్చారని పై సువార్త భాగం తెలియజేస్తోంది.  కృతజ్ఞత చూపని ఆ తొమ్మిదిమందిలో ఒకరిలా మీరు ఉన్నారా?  అలా అయితే, దేవుని నుండి వచ్చిన నిజమైన, సమృద్ధియైన ఆశీర్వాదాలన్నిటినీ గుర్తించడం మీకు చాలా కష్టంగా ఉండవచ్చు.  సంపూర్ణ కృతజ్ఞత కలిగి ఉండటంలో మీకు ఇబ్బంది ఉందని వినయంగా అంగీకరించగలిగితే, మరింత స్పష్టంగా చూడటానికి మీరు మొదటి అడుగు వేసినట్లే; మీలో ఉండవలసిన మరింత లోతైన కృతజ్ఞతను పెంపొందించుకోవడానికీ మొదటి అడుగు వేసినట్లే.  కృతజ్ఞత కలిగి ఉండటమంటే సత్యాన్ని స్పష్టంగా చూడటమే.  ఆ సత్యాన్ని స్వీకరించడానికి మనసు తెరవండి; దేవుడు మిమ్మల్ని ఆనందంతో నింపుతూ మీ జీవితాన్ని మార్చివేస్తారు!

ప్రభువా, దయచేసి నా హృదయాన్ని అపారమైన కృతజ్ఞతతో నింపు. నీ అనంతమైన కృప, కనికరం వైపు నా దృష్టిని మళ్లించేందుకు నాకు సహాయం చేయి. జీవిత పోరాటాలను, నన్ను కుంగదీసే భారాలను దాటి చూడగలిగేలా నాకు సహాయం చేయి. వీటికి బదులుగా, నీవు నాకోసం చేసినదంతా, ఇంకా చేస్తూనే ఉన్నదంతా మరింతగా గుర్తించేందుకు నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

మరింత పఠనం –అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కృతజ్ఞతా దినం

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: “ప్లిమత్‌లో తొలి కృతజ్ఞతా వేడుక” (1914), జెన్నీ ఎ. బ్రౌన్స్‌కోమ్ చిత్రించినది, వికీమీడియా కామన్స్ ద్వారా