తెలుగు

ప్రభువే రాజు

నవంబరు 25, 2022
సామాన్య కాలం ముప్పై నాలుగవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

అలెగ్జాండ్రియా పునీత కతరీన, కన్య, వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“…దేవుని రాజ్యం సమీపంలోనే ఉందని తెలుసుకోండి.”  లూకా 21:31b

“పరలోకమందున్న మా తండ్రీ” ప్రార్థనను ప్రార్థించే ప్రతిసారీ మనం దీని కోసమే ప్రార్థిస్తాము.  “నీ రాజ్యం వచ్చునుగాక” అని ప్రార్థిస్తాము.  అలా ప్రార్థించేటప్పుడు మీరు దానిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా?

ఈ సువార్త భాగంలో దేవుని రాజ్యం సమీపంలోనే ఉందని యేసు చెబుతున్నారు.  అది సమీపంలోనే ఉంది, అయినా చాలా తరచుగా అది ఎంతో దూరంలో కూడా ఉంటుంది.  అది రెండు విధాలుగా సమీపంలో ఉంది.  మొదటిగా, యేసు తన వైభవమంతటితోను మహిమంతటితోను తిరిగి వచ్చి, సమస్తాన్ని నూతనంగా చేస్తారు అనే అర్థంలో అది సమీపంలో ఉంది.  ఆ విధంగా, ఆయన శాశ్వత రాజ్యం స్థాపించబడుతుంది.

రెండవదిగా, ఆయన రాజ్యం మనకు కేవలం ఒక ప్రార్థన దూరంలోనే ఉంది అనే అర్థంలో అది సమీపంలో ఉంది.  మనం ఆయనను లోపలికి రానిస్తే చాలు, యేసు వచ్చి మన హృదయాలలో తన రాజ్యాన్ని స్థాపించాలని ఎంతో ఆరాటపడుతున్నారు.  దురదృష్టవశాత్తు, మనం తరచుగా ఆయనను లోపలికి రానివ్వము.  మనం తరచుగా ఆయనను దూరంగా ఉంచుతాము; ఆయన పవిత్రమైన, పరిపూర్ణమైన చిత్తంలో పూర్తిగా ప్రవేశించాలా వద్దా అని మన మనస్సులలోను హృదయాలలోను ఊగిసలాడుతుంటాము.  ఆయనను సంపూర్ణంగా స్వీకరించడానికి, ఆయన రాజ్యం మనలో స్థాపించబడటానికి అనుమతించడానికి మనం ఎంతో తరచుగా వెనుకాడుతుంటాము.  

ఆయన రాజ్యం ఎంత సమీపంలో ఉందో మీరు గ్రహిస్తున్నారా?  దానికి, మీకు మధ్య ఉన్న దూరం కేవలం ఒక ప్రార్థన, మీ చిత్తపూర్వక నిర్ణయం మాత్రమేనని గ్రహిస్తున్నారా?  మనం ఆయనను అనుమతిస్తే చాలు, యేసు మన వద్దకు వచ్చి మన జీవితాలను తన ఆధీనంలోకి తీసుకోగలరు.  మనలను నూతన సృష్టిగా మార్చగల సర్వశక్తిమంతుడైన రాజు ఆయనే.  ఆయన మన ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని, సామరస్యాన్ని ప్రసాదించగలరు.  ఆయన మన హృదయాలలో గొప్పవైన, సుందరమైన కార్యాలను చేయగలరు.  మనం మనస్ఫూర్తిగా ఒక్క మాట చెబితే చాలు, ఆయన వస్తారు.

మీ వద్దకు వచ్చి మీ జీవితంలో తన రాజ్యాన్ని స్థాపించాలని యేసు హృదయంలో ఉన్న కోరికను గురించి ఈ రోజు ధ్యానించండి.  మీ పాలకునిగా, రాజుగా ఉండాలని, పరిపూర్ణమైన సామరస్యంతోను ప్రేమతోను మీ ఆత్మను పాలించాలని ఆయన ఆరాటపడుతున్నారు.  ఆయనను వచ్చి మీలో తన రాజ్యాన్ని స్థాపించనివ్వండి.  

ప్రభువా, నీవు వచ్చి నా ఆత్మను నీ సొంతం చేసుకోవాలని నిన్ను ఆహ్వానిస్తున్నాను.  నిన్ను నా ప్రభువుగా, నా దేవునిగా ఎంచుకుంటున్నాను.  నా జీవితంపై నా నియంత్రణను విడిచిపెట్టి, స్వేచ్ఛగా నిన్ను నా దేవునిగా, దివ్య రాజుగా ఎంచుకుంటున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మా ఆగమనకాల వనరులను చూడండి!

పవిత్ర గ్రంథ ధ్యానాలు