తెలుగు

స్వర్గ రహస్యాలను అవగతం చేసుకోవడం

February 14, 2023
సామాన్య కాలం ఆరవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

పునీతులు సిరిల్, మఠవాసి, మరియు మెథోడియస్, బిషప్పు—స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“మీరు ఇంకా అర్థం చేసుకోలేదా, గ్రహించలేదా? మీ హృదయాలు కఠినమైపోయాయా? మీకు కళ్ళుండీ చూడరా, చెవులుండీ వినరా?” మార్కు 8:17–18

యేసు తన శిష్యులను అడిగిన ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడిగి ఉంటే, మీరు ఎలా సమాధానమిచ్చేవారు? మీకు ఇంకా అర్థం కాలేదని, అవగతం కాలేదని, నిజానికి మీ హృదయం కఠినమైందని, దేవుడు వెల్లడించినవన్నీ మీరు చూడలేకపోతున్నారని, వినలేకపోతున్నారని ఒప్పుకోవడానికి వినయం అవసరం. ఈ పోరాటాలకు వివిధ స్థాయిలు ఉంటాయన్నది నిజమే; కాబట్టి మీరు వీటితో తీవ్రమైన స్థాయిలో పోరాడటం లేదని ఆశిద్దాం. అయితే కొంతమేరకు వీటితో పోరాడుతున్నారని మీరు వినయంతో ఒప్పుకోగలిగితే, ఆ వినయం, నిజాయితీ మీకు సమృద్ధిగా అనుగ్రహాన్ని పొందిపెడతాయి.

పరిసయ్యుల, హేరోదు పులిపిండిని గురించిన చర్చలో భాగంగా యేసు తన శిష్యులను ఈ ప్రశ్నలు అడిగారు. ఈ నాయకుల “పులిపిండి” ఇతరులను చెడగొట్టే పులియబెట్టే పదార్థం వంటిదని ఆయనకు తెలుసు. వారి నిజాయితీలేమి, గర్వం, గౌరవాల కోసం ఆరాటం మొదలైనవి ఇతరుల విశ్వాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కాబట్టి పైన పేర్కొన్న ప్రశ్నలను అడగడం ద్వారా, ఈ దుష్ట పులిపిండిని గుర్తించి తిరస్కరించమని యేసు తన శిష్యులకు సవాలు విసిరారు.

సందేహం, అయోమయం అనే విత్తనాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ రోజుల్లో లౌకిక ప్రపంచం ప్రోత్సహించే దాదాపు ప్రతిదీ ఏదో ఒక విధంగా దేవుని రాజ్యానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, పరిసయ్యులలోను హేరోదులోను ఉన్న దుష్ట పులిపిండిని శిష్యులు గుర్తించలేకపోయినట్లే, మన సమాజంలో ఉన్న దుష్ట పులిపిండిని మనం కూడా తరచుగా గుర్తించలేకపోతున్నాం. బదులుగా, అనేక తప్పు భావనలు మనల్ని గందరగోళానికి గురిచేసి, లౌకికవాద మార్గంలో నడిపించడానికి మనం అనుమతిస్తున్నాం.

దీని నుంచి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, సమాజంలో ఎవరికైనా ఏదో ఒక రకమైన అధికారం లేదా శక్తి ఉన్నంత మాత్రాన, వారు సత్యనిష్ఠగల పవిత్ర నాయకులని అర్థం కాదు. ఇతరుల హృదయాన్ని తీర్పు తీర్చడం ఎన్నడూ మన పని కాకపోయినా, మన ప్రపంచంలో మంచివిగా చూపబడుతున్న అనేక తప్పు భావనలను గుర్తించడానికి మనకు తప్పనిసరిగా “వినే చెవులు”, “చూసే కళ్ళు” ఉండాలి. దేవుని నియమాలను “అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి” మనం నిరంతరం ప్రయత్నించాలి; ప్రపంచంలోని అబద్ధాలకు లోనుకాకుండా ఉండేందుకు వాటిని మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలి. మనం దీన్ని సక్రమంగా చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం, సత్యం పట్ల మన హృదయాలు ఎన్నడూ కఠినం కాకుండా చూసుకోవడమే.

ఈ రోజు మన ప్రభువు అడిగిన ఈ ప్రశ్నలను ధ్యానించండి; ముఖ్యంగా సమాజం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని పరిశీలించండి. మన ప్రపంచం, అధికార స్థానాల్లో ఉన్న ఎంతోమంది బోధించే తప్పుడు “పులిపిండి” గురించి ఆలోచించండి. ఈ తప్పు భావనలను తిరస్కరించండి; పరలోకపు పవిత్ర రహస్యాలను సంపూర్ణంగా స్వీకరించడానికి మిమ్మల్ని మీరు తిరిగి అంకితం చేసుకోండి. తద్వారా ఆ సత్యాలు, ఆ సత్యాలు మాత్రమే మీ దైనందిన మార్గదర్శకంగా నిలుస్తాయి.

మహిమగల నా ప్రభువా, నీవు సమస్త సత్యానికి ప్రభువుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా చుట్టూ ఉన్న చెడు పులిసిన పిండిని నేను గుర్తించగలిగేలా, ప్రతిరోజూ నా కన్నులను, చెవులను ఆ సత్యం వైపు తిప్పడానికి నాకు సహాయం చేయుము. ప్రియమైన ప్రభువా, నీ పవిత్ర జీవిత రహస్యాలలో నేను లీనమవగలిగేలా నాకు జ్ఞానాన్ని, వివేచన వరాన్ని దయచేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీతులు సిరిల్, సన్యాసి, మరియు మెథోడియస్, బిషప్పు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: అపొస్తలులకు హితబోధ — చిత్రకారుడు జేమ్స్ టిస్సో, వికీమీడియా కామన్స్ ద్వారా