డిసెంబర్ 9, 2023
ఆగమనకాలపు మొదటి వారంలోని శనివారం
నేటి పఠనాలు
పునీత హువాన్ డియేగో, ఏకాంతవాసి—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి
“పంట సమృద్ధిగా ఉంది, కానీ పనివారు కొద్దిమందే; కాబట్టి తన పంటకోతకు పనివారిని పంపమని పంట యజమానిని వేడుకోండి.” మత్తయి 9:37–38
దేవుడు మీ నుంచి ఏమి కోరుతున్నారు? మీ ప్రేషితకార్యం ఏమిటి? భక్తితత్పరులైన కొందరు క్రైస్తవులు ప్రజాదరణ పొందిన సువార్త ప్రచారకులు కావాలని కలలు కనవచ్చు. అందరి ప్రశంసలు పొందే వీరోచిత ప్రేమకార్యాలు చేయాలని మరికొందరు కలలు కనవచ్చు. ఇంకొందరు కుటుంబానికి, స్నేహితులకు సన్నిహితంగా ఉంటూ, ఎంతో నిశ్శబ్దమైన, ఎవరి కంటా పడని విశ్వాస జీవితం గడపాలని కోరుకోవచ్చు. కానీ దేవుడు మీ నుంచే ఏమి కోరుతున్నారు?
పై వచనంలో యేసు తన శిష్యులను “తన పంటకోతకు పనివారి” కోసం ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నారు. మన ప్రభువు చెప్పే ఆ “పనివారిలో” మీరు కూడా ఉన్నారని నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ఈ ప్రేషితకార్యం యాజకులు, సమర్పితులు, పూర్తికాలం సువార్త ప్రచారం చేసే లౌకిక విశ్వాసులు వంటి ఇతరుల కోసమేనని అనుకోవడం సులభం. తాము అందించగలిగింది అంతగా ఏమీ లేదని చాలామంది తేల్చుకోవడం సులభం. కానీ అది సత్యానికి పూర్తిగా విరుద్ధం.
దేవుడు మీ ద్వారా అసాధారణమైన మహిమగల కార్యాలు చేయాలని కోరుతున్నారు. అవును, “అసాధారణమైన మహిమగల కార్యాలు!” అంటే, యూట్యూబ్లో ఎంతో ప్రజాదరణ పొందే తదుపరి సువార్త ప్రచారకులుగా మీరు మారతారని గానీ, పునీత మదర్ తెరేసాలా అందరి దృష్టిని ఆకర్షిస్తారని గానీ కాదు. అయితే దేవుడు మీ నుంచి కోరే పని కూడా గతంలో జీవించిన లేదా నేడు జీవించి ఉన్న గొప్ప పునీతుల పనులంత వాస్తవమైనది, అంతే ముఖ్యమైనది.
జీవిత పవిత్రత ప్రార్థనలోనే కాక ఆచరణలో కూడా కనుగొనబడుతుంది. మీరు ప్రతిరోజూ ప్రార్థిస్తూ క్రీస్తుకు మరింత దగ్గరవుతున్నప్పుడు, నేటి సువార్తలో చెప్పబడినట్లుగా, “రోగులను స్వస్థపరచండి, మృతులను లేపండి, కుష్ఠరోగులను శుద్ధిచేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి” (మత్తయి 10:8) అని ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయితే, మీ స్వంత పిలుపునకు అనుగుణమైన ప్రత్యేకమైన విధానంలో దీనిని చేయమని ఆయన మిమ్మల్ని పిలుస్తారు. మీ దైనందిన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి ప్రతిరోజూ మీకు ఎదురయ్యేవారిలో రోగులు, మృతులు, కుష్ఠరోగులు, దయ్యాలు పట్టినవారు ఎవరు? ఏదో ఒక మేరకు అలాంటివారు మీ చుట్టూ ఉండే అవకాశమే ఎక్కువ. ఉదాహరణకు, “కుష్ఠరోగులు” అనబడేవారిని తీసుకోండి. వీరు సమాజం “వెలివేసినవారు.” మన ప్రపంచం కఠినంగా, క్రూరంగా ఉండవచ్చు; కొందరు తాము దిక్కుతోచని స్థితిలో, ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. మీకు తెలిసినవారిలో ఈ కోవకు చెందినవారు ఎవరు? కాస్త ప్రోత్సాహం, అవగాహన, కనికరం అవసరమైనవారు ఎవరు? మరెవరికీ ఇవ్వని ఒక దైనందిన కర్తవ్యాన్ని దేవుడు మీకు ఇచ్చారు. ఆ కారణంగా, మీ ప్రేమ అవసరమైనవారు కొందరు ఉన్నారు. వారిని వెతకండి, వారికి చేరువవండి, వారికి క్రీస్తును అందించండి, వారికి తోడుగా ఉండండి.
మరొకరికి క్రీస్తుగా ఉండేందుకు మీకు ఇవ్వబడిన ఈ అసాధారణమైన మహిమగల పిలుపును గురించి ఈ రోజు ధ్యానించండి. ఈ ప్రేమ కర్తవ్యాన్ని స్వీకరించండి. క్రీస్తు కోసం పనిచేయడానికి మీకు పిలుపు వచ్చిందని గుర్తించండి. మీ జీవితంలో ఈ ప్రేషితకార్యాన్ని ఏ విధంగా జీవించవలసి వచ్చినా, దానిని సంపూర్ణంగా, మహిమకరంగా నెరవేర్చడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి.
నా ప్రియ ప్రభువా, నీ దివ్య కార్యసాధనకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నిన్ను, నా జీవితంపట్ల నీ పవిత్ర చిత్తాన్ని నేను ఎంచుకుంటున్నాను. ప్రియ ప్రభువా, నీ ప్రేమ, కనికరం అత్యంత అవసరమైనవారి వద్దకు నన్ను పంపు. నాకు అప్పగించబడినవారు తమ జీవితాల్లో నీ మహిమాన్వితమైన, రక్షణదాయకమైన కృపను అనుభవించేలా, ఆ ప్రేమను, కనికరాన్ని వారికి ఎలా అందించగలనో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సాంప్రదాయంగా నవంబర్ 30 నుండి క్రిస్మస్ ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.
నేటి పునీతులు – పునీత హువాన్ డియేగో, ఏకాంతవాసి




