మార్చి 30, 2024

లోకరక్షకుడు సిలువపై క్రూరమైన మరణాన్ని పొందాడు. గాయాలతో ఛిన్నాభిన్నమైన ఆయన దేహాన్ని సమాధిలో ఉంచారు. ఆయన శిష్యులు చెదరిపోయారు; తరువాత తమ వంతు వస్తుందేమోనని భయపడ్డారు. కానీ మన ధన్యమాత తన కుమారుడు త్వరలోనే పునరుత్థానమవుతాడనే పరిపూర్ణ నిరీక్షణతో జాగరణ చేసింది.
సంప్రదాయంగా, కతోలిక సభ ఆరాధనా సంవత్సరంలోని శనివారాలు ధన్య కన్యమరియకు అంకితం చేయబడ్డాయి. ఇతరులు భయంతో, అయోమయంతో నిండిపోయినప్పుడు, మరియమాత పవిత్ర శనివారంనాడు యేసు పునరుత్థానం కోసం ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూస్తూ జాగరణ చేసిందనే నమ్మకం ఈ ప్రాచీన సంప్రదాయం ఏర్పడటానికి ఒక కారణం. తన కుమారుడు పునరుత్థానమవుతాడని ఆమెకు తెలుసు. ఆశకు తావులేనట్లు కనిపించినా ఆమె నిరీక్షణతో ఉంది. ఆమె విశ్వాసం దృఢంగా ఉంది. తన కుమారుని తిరిగిరాక కోసం ఎదురుచూస్తున్న ఆమెను ప్రేమ జాగరూకంగా ఉంచింది.
యేసు తన పునరుత్థానం తరువాత మొట్టమొదట తన తల్లికే దర్శనమిచ్చాడనే అభిప్రాయం ఎన్నో శతాబ్దాలుగా వ్యక్తమవుతోంది. పునీత రెండవ జాన్ పాల్ పాపుగారు దీనిని నమ్మారు. లయోలాకు చెందిన పునీత ఇగ్నేషియస్ దీనిని నమ్మారు. శతాబ్దాల పొడవునా మరెందరో కూడా ఇదే నమ్మకాన్ని పంచుకున్నారు.
ఈ కారణాలవల్ల, మన ధన్యమాత ధ్యానమగ్న హృదయాన్ని మననం చేయడానికి పవిత్ర శనివారం ఎంతో అనువైన రోజు. మరియమాత తన కుమారుని జీవితంలోని రహస్యాలను తన హృదయంలో మననం చేసుకుందని పవిత్ర గ్రంథంలో పలుచోట్ల చెప్పబడింది. ఆయన వేదనలోనూ మరణంలోనూ ఆయన చెంత నిలిచిన కొద్దిమందిలో ఆమె ఒకరు. ఆమె సిలువ ఎదుట నిలిచి, ఆయన పరిపూర్ణ బలిని ప్రార్థనాపూర్వకంగా మననం చేసుకుంది. ధన్యమాత ఆయన మృతదేహాన్ని తన ఒడిలో ఉంచుకొని, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్లిందో మననం చేసుకుంది. ఈ రోజు కూడా ఆయన త్వరలో తన వద్దకు తిరిగిరానున్న విషయాన్ని మననం చేసుకుంటూ ఆమె జాగరణ చేస్తోంది.
ఆమె ధ్యానమగ్న హృదయాన్ని మననం చేయండి. మీ హృదయాన్ని ఆమె హృదయంతో ఏకం చేయడానికి ప్రయత్నించండి. ఆమె ఏమి ఆలోచిస్తోందో, దేనికోసం నిరీక్షిస్తోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ దుఃఖభరితమైన రోజున ఆమె అనుభవించిన భావాలను మీరూ అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. ఆమె విశ్వాసాన్ని, ఆమె నమ్మకాన్ని, ఆమె ఆనందభరితమైన ఎదురుచూపును అనుభవించడానికి ప్రయత్నించండి.
ఈ లోకంలో ఎంతోమంది నిరాశలోనూ అయోమయంలోనూ జీవిస్తున్నారు. తమకోసం ఎదురుచూస్తున్న నూతన జీవితంపై ఎంతోమంది ఆశ కోల్పోయారు. దేవుడు తమను తన పునరుత్థానంలోకి నడిపించడానికి అనుమతించకుండా ఎంతోమంది ఏదో ఒక విధమైన అంతరంగిక మరణాన్ని అనుభవిస్తున్నారు. ఆ మొదటి పవిత్ర శనివారంనాడు మన ధన్యమాత హృదయంలో ఎంతో సజీవంగా ఉన్న నిరీక్షణ నేడు ఎంతోమందికి అవసరం.
ఈ రోజు నిశ్శబ్దంగా పవిత్ర శనివారపు యథార్థాన్ని మననం చేయండి. మన ధన్యమాత మహిమాన్విత హృదయం మీకు ప్రేరణనిచ్చి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలతో కూడిన ఆమె జీవితంలోకి మిమ్మల్ని మరింత లోతుగా నడిపించనివ్వండి.
అత్యంత ప్రియమైన మరియమాతా, ఆ మొదటి పవిత్ర శనివారంనాడు నీవు నీ కుమారుని కోసం జాగరణ చేశావు. నిరీక్షణ అనే దైవిక వరం నీలో పెరగడానికి నీవు చోటిచ్చావు; సిలువ భయానకత మధ్య ఆ నిరీక్షణే నీ బలంగా ఉండనిచ్చావు. ఈ భూలోక జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నేను కూడా నిరీక్షణతో నిండిపోయేలా, ఈ రోజు నీ సుందర హృదయాన్ని మననం చేసుకోవడానికి నా కొరకు ప్రార్థించు. మన ప్రభువు నాకు అనుగ్రహించాలని ఎంతగానో కోరుకుంటున్న నూతన జీవన కృప కోసం ఎదురుచూస్తున్న నాకు ఆనందభరితమైన ఎదురుచూపుతో కూడిన హృదయాన్ని దయచేయి. మరియమాతా, నా కొరకు ప్రార్థించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
నలభైవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు
రెండవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపడే నవదిన ప్రార్థన
పవిత్ర శనివారం కోసం ప్రార్థనా ధ్యానం
జపమాల – దుఃఖ రహస్యాలు (పవిత్ర గ్రంథ వచనాలతో)




