తెలుగు

పాపానికి దారితీసే సందర్భాలను తొలగించడం

సెప్టెంబరు 29, 2024
సామాన్య కాలపు ఇరవై ఆరవ ఆదివారం (సంవత్సరం B)
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“నీ చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే, దానిని నరికివేయి. రెండు చేతులతో గెహెన్నాలోకి, ఆరని అగ్నిలోకి వెళ్లడం కంటే అంగవైకల్యంతో జీవంలోకి ప్రవేశించడం నీకు మేలు. నీ కాలు నీవు పాపం చేయడానికి కారణమైతే, దానిని నరికివేయి. రెండు కాళ్లతో గెహెన్నాలో పడవేయబడటం కంటే కుంటితనంతో జీవంలోకి ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నీవు పాపం చేయడానికి కారణమైతే, దానిని పెరికివేయి…” మార్కు 9:43–47

కొన్నిసార్లు మనం పాపపు భయంకరత్వాన్ని గుర్తించి మేలుకోవాలి. పాపం, పాపం ఒక్కటే మిమ్మల్ని నరకానికి పంపగలదు. నరకం వాస్తవం; శాశ్వతంగా అక్కడికి వెళ్లే అవకాశం కూడా నిజంగానే ఉంది. కాబట్టి, ఆ భయంకరమైన అవకాశాన్ని తప్పించుకోవడానికి అవసరమైనదంతా మనం చేయాలి. యేసు చేసిన ఈ బోధను, ఆయన అత్యంత ప్రేరణాత్మకమైన బోధలలో ఒకటిగా మొదట మనం భావించకపోవచ్చు; కానీ అలా భావించాలి. ఇది ఎంతో తీవ్రమైన దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది కాబట్టి, ఆ కోణంలో ఇది స్ఫూర్తిదాయకంగా అనిపించదు. అయితే, మనల్ని కార్యాచరణకు పురికొల్పగలదు కాబట్టి ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైనది.

పాపాన్ని నివారించడానికి మీకు సాధ్యమైనదంతా చేయాలనే ప్రేరణ మీలో ఉందా? పాపాన్ని నివారించడం కోసం మీ చెయ్యినో కాలినో నరికివేసుకోవడానికి, మీ కన్నును పెరికివేసుకోవడానికి కూడా సిద్ధపడతారా? మొదటిగా, మన అవయవాలను మనమే ఛిద్రం చేసుకోవాలని యేసు అక్షరాలా ఆజ్ఞాపిస్తున్నట్లుగా దీనిని చూడకూడదు. అయితే, ఇంత తీవ్రమైన దృశ్యభాషను ఎంచుకున్నది ఆయనే. కాబట్టి, మనల్ని పాపంలోకి నడిపించే విషయాలను మరింత స్పష్టంగా గుర్తించడానికి, ఈ దృశ్యాల గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి మనం వెనుకాడకూడదు. వాటిని గుర్తించినప్పుడు, వాటిని మన జీవితాల నుండి పూర్తిగా తొలగించే సమూలమైన చర్య తీసుకోవాలి.

ఈ బోధలోని చెయ్యి, కాలు, కన్ను మన స్నేహితులను సూచిస్తాయని సభాపితరులలో అనేకమంది చెబుతారు. చెయ్యి, కాలు, కన్ను స్వతహాగా మంచివైనట్లే, స్నేహితులు కూడా మంచివారే. దేవునితోనూ ఇతరులతోనూ స్నేహం కోసం మనం సృష్టించబడ్డాము. అయితే, ప్రతి స్నేహమూ మనం దేవునికి మరింత దగ్గర కావడానికి తోడ్పడదు. కాబట్టి, ఈ లోకంలోని స్నేహితులలో ఎవరైనా పాపానికి కారణమైనప్పుడు, మనం ఆ స్నేహాన్ని తొలగించుకోవాలి.

స్నేహం వేరు, ప్రేమ వేరు. అత్యంత పాపాత్ములతో సహా మనుషులందరినీ ప్రేమించడం మన బాధ్యత. అయితే, ఇతరులపట్ల ప్రేమతో వ్యవహరించడం, వారితో స్నేహంగా ఉండడం ఒకటే కాదు. స్నేహితులుగా ఉండటంలో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. మనల్ని మనం ఎల్లప్పుడూ ఇతరులకు అర్పించుకోవాలి; అయినా, వారు ఇచ్చేది పాపానికి ఆహ్వానమైతే, దానిని మనం ఎల్లప్పుడూ స్వీకరించకూడదు. ఈ విధంగానే మనం దానిని “నరికివేస్తాము,” “పెరికివేస్తాము.” మనల్ని పాపంలోకి నడిపించే విధంగా మరొక వ్యక్తి మనతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆ శోధనను మనం ఎంతో గంభీరంగా పరిగణించి, దృఢంగా తిరస్కరించాలి.

ఈ బోధలోని చెయ్యి, కాలు, కన్ను మన జీవితంలో పాపం చేయడానికి మనల్ని ప్రలోభపెట్టే ప్రతి పరిస్థితిని కూడా సూచిస్తాయి. ఉదాహరణకు, భౌతిక ఆస్తులను పరిశీలించండి. ఎంతో ఖరీదైన కారు, ఇల్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరం కొనడం వల్ల మీరు భౌతిక వస్తువులపట్ల మరింత మమకారం పెంచుకునే శోధనకు లోనవుతుంటే, దానిని కొనడం మానుకోవాలి. మనుషులు మంచి వస్తువులకు ఆకర్షితులవుతారు. కానీ మంచి వస్తువులను కలిగి ఉండటం మీ ఆత్మ పవిత్రం కావడానికి తోడ్పడుతుందా? మంచి వస్తువులను కలిగి ఉంటూనే, ఆధ్యాత్మికంగా వాటిపై మమకారం లేకుండా ఉండవచ్చని ఎవరైనా వాదించవచ్చు. కానీ అలా జీవించడం కష్టం. మన భౌతిక ఆస్తులు ఎంత విలాసవంతంగా ఉంటే, మన సంతోషం కోసం వాటిపై ఆధారపడాలనే శోధన అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, విలాసంగా జీవించడాన్ని ఎంచుకోవడం కంటే నిరాడంబరంగా జీవించడాన్ని ఎంచుకోవడం దాదాపు ఎల్లప్పుడూ మీ ఆత్మకు మేలైనది. శోధనకు మూలం కాగల మరేదైనా విషయానికి కూడా ఈ బోధ వర్తిస్తుంది.

ఈ రోజు, మీ జీవితంలో మీకు పాప సందర్భాలుగా మారిన విషయాలు లేదా వ్యక్తుల గురించి ధ్యానించండి. ఆ శోధనను మీరు ఎదుర్కోగలరని నమ్ముతూ మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. మీ జీవితంలో నిరంతరం శోధనకు గురిచేసే కారణమేదైనా ఉంటే, దానిని మీరు తొలగించాలి. ఎంతో తీవ్రమైన దృశ్యాలతో యేసు చేసిన ఈ బోధను ధ్యానించి, దానిని మీ జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని పాపంలోకి నడిపించే వాటిని గుర్తించి, ఎంతో దృఢనిశ్చయంతో వాటిని తొలగించండి.

సమూల మార్పును కోరే నా ప్రభువా, నీ బిడ్డలందరినీ నీవు పవిత్రతతో, పరిపూర్ణతతో కూడిన జీవితానికి పిలుస్తున్నావు. నా జీవితంలోని పాప సందర్భాలన్నిటినీ తొలగించుకునేలా, నీ బోధలను గంభీరంగా స్వీకరించడానికి దయచేసి నాకు సహాయం చేయి. ఈ శోధనలను గుర్తించే కళ్లను, నా శక్తినంతటినీ ఉపయోగించి వాటిని తిరస్కరించే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సెప్టెంబరు 29, ప్రధానదూతల పండుగనాడు అందుబాటులోకి వస్తుంది!

నేటి పునీతులు – పునీత మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు ప్రధానదూతలు
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ఆరాధనా స్మరణగా జరుపుకోరు

చిన్న పుష్పమైన లిసియూకు చెందిన పునీత తెరేసాకు నవదిన ప్రార్థన
ఎనిమిదవ రోజు- సెప్టెంబరు 29

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు ప్రధానదూతలు
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున ఆరాధనా స్మరణగా జరుపుకోరు

ఎన్నికలు మరియు దేశం కోసం ప్రార్థనలు
సెప్టెంబరు 3 – నవంబరు 4 వరకు తొమ్మిది వారాల నోవెనా

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: గలిలయ సముద్రంపై పడవలో బోధిస్తున్న యేసు క్రీస్తు చిత్రకర్త: ఫుల్కనెల్లి, అడోబీ ద్వారా