ఫిబ్రవరి 14, 2025
సన్యాసి పునీత సిరిల్ మరియు పీఠాధిపతి పునీత మెథోడియస్ల స్మరణ
నేటి పఠనాలు
సామాన్య కాలం ఐదవ వారంలోని శుక్రవారం పఠనాలు
చిత్రం: వికీమీడియా కామన్స్ ద్వారా
వారు ఎంతో ఆశ్చర్యపడి, “ఆయన అన్నిటినీ చక్కగా చేశారు. చెవిటివారు వినేలా, మూగవారు మాట్లాడేలా చేస్తున్నారు” అని అన్నారు. మార్కు 7:37
సరిగా మాట్లాడలేని ఒక చెవిటి వ్యక్తిని యేసు స్వస్థపరిచిన సంఘటనకు ఈ వాక్యం ముగింపు. ఆ వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చారు. యేసు అతనిని ఏకాంతంగా పక్కకు తీసుకువెళ్లి, “ఎఫ్ఫతా!” (అంటే, “తెరవబడుము!”) అని బిగ్గరగా పలికారు. ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఇది అతనికి అద్భుతమైన వరం, అతనిపట్ల గొప్ప కారుణ్యకార్యం అయినప్పటికీ, ఇతరులను తనవైపుకు ఆకర్షించడానికి దేవుడు మనలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారని కూడా ఇది వెల్లడిస్తుంది.
దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినే సామర్థ్యం స్వాభావికంగా మనలో ఎవరికీ లేదు. అందుకు మనకు కృపావరం అవసరం. అందువల్ల, మనం పలకాలని దేవుడు కోరుకునే అనేక సత్యాలను పలకడం కూడా స్వాభావికంగా మనకు సాధ్యం కాదు. తన మృదువైన స్వరాన్ని వినేలా మన చెవులను స్వస్థపరచాలని, తన తరఫున పలికే సాధనాలుగా మనం మారేలా మన నాలుకలను విప్పాలని కూడా దేవుడు కోరుకుంటున్నారని ఈ సంఘటన మనకు బోధిస్తుంది.
అయితే, ఈ సంఘటన దేవుడు మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడటం గురించి మాత్రమే కాదు; క్రీస్తును ఎరుగని ఇతరులను ఆయన వద్దకు తీసుకురావడం మన కర్తవ్యమని కూడా ఇది వెల్లడిస్తుంది. ఆ వ్యక్తి స్నేహితులు అతనిని యేసు వద్దకు తీసుకువచ్చారు. యేసు అతనిని ఏకాంతంగా పక్కకు తీసుకువెళ్లారు. మన ప్రభువు స్వరాన్ని తెలుసుకునేందుకు ఇతరులకు మనం ఎలా సహాయపడాలో ఇది మనకు అవగాహన కలిగిస్తుంది. తరచుగా, మరొకరితో సువార్తను పంచుకోవాలనుకున్నప్పుడు, వారితో మాట్లాడి, తమ జీవితాలను క్రీస్తువైపు మళ్లించేలా తర్కబద్ధంగా వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాము. ఇది కొన్నిసార్లు మంచి ఫలితాన్ని ఇచ్చినా, యేసు వారిని స్వస్థపరచగలిగేలా, వారు కొంతసేపు మన ప్రభువుతో ఏకాంతంగా గడపడానికి సహాయపడటమే మన నిజమైన లక్ష్యంగా ఉండాలి.
మన ప్రభువు మీ చెవులను నిజంగా తెరిచి ఉంటే, మీ నాలుక కూడా విప్పబడుతుంది. మీ నాలుక విప్పబడితేనే దేవుడు మీ ద్వారా ఇతరులను తనవైపుకు ఆకర్షించగలరు. లేకపోతే మీ సువార్త ప్రచారం కేవలం మీ సొంత ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ జీవితంలో దేవుని స్వరాన్ని విననట్లు, ఆయన పవిత్ర చిత్తాన్ని అనుసరించనట్లు కనిపించే వ్యక్తులు ఉంటే, అన్నిటికంటే ముందుగా మీరే మన ప్రభువు మాట వినడానికి నిబద్ధతతో సిద్ధపడండి. మీ చెవులు ఆయన మాట విననివ్వండి. మీరు ఆయన మాట విన్నప్పుడు, ఇతరులను చేరుకోవాలని ఆయన కోరుకునే విధంగా మీ ద్వారా పలికేది ఆయన స్వరమే అవుతుంది.
ఈ రోజు ఈ సువార్త దృశ్యాన్ని ధ్యానించండి. ముఖ్యంగా, ఆ వ్యక్తిని యేసు వద్దకు తీసుకురావాలనే ప్రేరణ పొందిన అతని స్నేహితుల గురించి ఆలోచించండి. అదే విధంగా మిమ్మల్ని కూడా ఉపయోగించుకోమని మన ప్రభువును అడగండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు తన వద్దకు పిలవాలని కోరుకునే మీ జీవితంలోని వ్యక్తుల గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి. ఆయన ఎంచుకున్న విధంగా ఆయన స్వరం మీ ద్వారా పలికేలా, మన ప్రభువు సేవకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి.
నా మంచి యేసూ, నీవు నాకు చెప్పదలచినదంతా వినడానికి దయచేసి నా చెవులను తెరువు. నీ పవిత్ర వాక్కును ఇతరులకు వినిపించే సాధనంగా నేను మారేలా దయచేసి నా నాలుకను విడిపించు. నీ మహిమ కొరకు నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నీ పవిత్ర చిత్తానికి అనుగుణంగా నన్ను ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను. యేసూ, నేను నీపై పూర్తిగా నమ్మకం ఉంచుతున్నాను.
సన్యాసి పునీత సిరిల్ మరియు పీఠాధిపతి పునీత మెథోడియస్ల స్మరణ గురించి మరింత చదవండి
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు



