ఫిబ్రవరి 21, 2025
సామాన్య కాలం ఆరవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు
పునీత పేతురు డామియన్, మేత్రాణులు మరియు సభ పండితులు—ఐచ్ఛిక స్మరణ
తీర్పు దినం — లారెన్స్ ఓపీ కృతి, లైసెన్స్ CC BY-NC-ND 2.0
ఆంగ్లంలో వినండి
“ఒక వ్యక్తి లోకమంతటినీ సంపాదించుకొని, తన జీవితాన్ని కోల్పోతే కలిగే లాభమేమిటి?” మార్కు 8:36
ఈ చిన్న, సూటియైన ప్రశ్నను గురించి ఎంతో ధ్యానించడం సముచితం. మార్కు సువార్తలో, తన శిష్యులుగా ఉండటానికి అవసరమైన వాటిని గురించి యేసు బోధిస్తున్న సందర్భంలో ఈ వాక్యం వస్తుంది. క్రీస్తుగా తానే బాధలు అనుభవించి మరణిస్తానని యేసు స్పష్టంగా బోధించడం ప్రారంభించిన తరువాత ఇది వస్తుంది.
పైనున్న ప్రశ్నలోని మొదటి భాగంతో ప్రారంభించి, ఆ ప్రశ్నను గురించి ఆలోచించండి. “ఒక వ్యక్తి లోకమంతటినీ సంపాదించుకుంటే కలిగే లాభమేమిటి…” మీరు లోకమంతటినీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? చాలామందికి అలాంటి అవకాశం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. “లోకమంతటినీ సంపాదించుకోవడం” అంటే ఈ లోకం అందించగలిగినదంతా పొందడమే. ఈ లోకంలో మీకు అపరిమితమైన సంపదను ఇస్తామని ఎవరైనా చెప్పినట్లు ఊహించుకోండి. ఇప్పటివరకు ఏ లాటరీలోనైనా ఇచ్చిన అతి పెద్ద బహుమతి కంటే ఎక్కువే మీరు గెలుచుకుంటే ఎలా ఉంటుంది? ప్రపంచమంతటా అందమైన భవనాలు, మీకంటూ ఒక సొంత ప్రైవేటు విమానం, ప్రతి ఆధునిక సౌకర్యం, అత్యంత ఖరీదైన కార్లు మీకు ఉండి, మీ మిగిలిన జీవితమంతా మీరు కోరుకున్నదేదైనా చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇది ఆకర్షణీయంగా ఉందా? పైకి చూస్తే నిశ్చయంగా అలాగే ఉంటుంది. కానీ ఇది ఎంతో మోసపూరితమైన ఆకర్షణ కూడా. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా, మీరు ఇప్పటికే ఉన్నదానికంటే మరింత సంతోషంగా గానీ మరింత పరిపూర్ణతతో గానీ ఉండేలా అవి చేయలేవు.
ఈ ప్రశ్నలోని రెండవ భాగానికి కూడా సులభంగానే జవాబివ్వవచ్చు. మీరు మీ జీవితాన్ని కోల్పోవాలనుకుంటారా? నిశ్చయంగా అనుకోరు. కాబట్టి యేసు ఒకే వాక్యంలో రెండు విరుద్ధమైన విషయాలను మన ముందుంచుతున్నారు. చాలామంది లోకమంతటినీ సంపాదించుకోవాలనుకుంటారు, కానీ తమ జీవితాలను కోల్పోవాలని ఎన్నడూ అనుకోరు. ఒకదాన్ని కోరుకుంటే మరొకదాన్ని కూడా ఎంచుకోకుండా ఉండలేమని మనకు చాలా స్పష్టంగా చెప్పడానికే యేసు ఈ వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీ హృదయ వాంఛ ఈ లోక సంపదల కోసమే అయితే, ఆ కోరికకు మీరు లొంగిపోయినంత మేరకు నిజంగానే మీ జీవితాన్ని కోల్పోతారు. దీనికి విరుద్ధంగా, మీరు మీ ఆత్మ రక్షణను ఎంచుకుంటే, ఈ లోక సంపదలపట్ల, ఆకర్షణలపట్ల కోరికను విడిచిపెట్టాలి. మీరు రెండింటినీ కోరుకొని ఎంచుకోలేరు.
అయితే, ఈ లోకంలో ఎన్నో వస్తువులు కలిగి ఉండి కూడా వాటిపట్ల ఏమాత్రం మమకారం లేని వ్యక్తి చాలా అరుదుగా ఉండవచ్చు. అలాంటివారు ఈ లోక వస్తువులపై ఏమాత్రం ఆసక్తి లేకుండా జీవిస్తూ, దేవునిలోనూ ఆయన పవిత్ర చిత్తంలోనూ మాత్రమే నిజమైన తృప్తిని పొందుతారు. తమకున్న ఏ భౌతిక వస్తువులపట్లనైనా మమకారరహితులవుతారు. అయితే, ఎంతో సంపదను కూడబెట్టుకున్నప్పుడు ఇలాంటి ఆంతరంగిక స్థితికి చేరుకోవడం చాలా కష్టమే.
మరోవైపు, ఈ లోకంలో చాలా కొద్దిపాటి వస్తువులు మాత్రమే కలిగినవారు కూడా ఉన్నారు. వారు అక్షరాలా నిజమైన పేదరికంలో ఉన్నారు. అయినప్పటికీ, వారు సంపదల గురించి కలలు కంటూ రోజులు గడుపుతారు; తమకు లేనివాటన్నిటినీ ఆశిస్తారు. విచారకరంగా, ఇలాంటి పేద వ్యక్తికి కూడా, సంపదలనే జీవిత లక్ష్యంగా, ధ్యాసగా చేసుకున్న వ్యక్తికి ఉన్నంత భౌతిక మమకారం వాస్తవంగా ఉంటుంది. ఆ ఆంతరంగిక మమకారం ఆధ్యాత్మికంగా ఎంతో హాని చేస్తుంది.
యేసు అడిగిన ఈ ప్రశ్నను గురించి నేడు ధ్యానించండి: “ఒక వ్యక్తి లోకమంతటినీ సంపాదించుకొని, తన జీవితాన్ని కోల్పోతే కలిగే లాభమేమిటి?” ఈ ప్రశ్నను ప్రార్థనకు, ధ్యానానికి, ఆత్మపరిశీలనకు ఆధారంగా తీసుకోండి. మీ కోరికల విషయంలో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. సంపదల గురించి కలలు కంటూ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు మీకు అనిపిస్తే, ఈ ప్రశ్నపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆ కోరికల ద్వారాగానీ, అవి నెరవేరడం ద్వారాగానీ జీవితాన్ని దాని పరిపూర్ణతలో ఎన్నడూ పొందలేరు. దేవుడు, దేవుడు మాత్రమే పరిపూర్ణతను ప్రసాదిస్తారు. అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి వెదకండి. అప్పుడు ఈ లోకం అందించగలిగినదేదీ దేవుని రాజ్య సంపదలకు సాటిరాదని మీరు గ్రహిస్తారు.
ప్రభువా, జీవితంలో పరిపూర్ణతకు నీవు, నీవు మాత్రమే మూలాధారానివి. చివరికి నిన్ను, నీ పవిత్ర చిత్తాన్ని మాత్రమే కోరుకునేలా దయచేసి నా కోరికలను శుద్ధి చేయుము. నీలో మాత్రమే తృప్తిని పొందేలా జీవితంలోని ప్రతి మోసం నుండి, ప్రతి తప్పుడు ఆకర్షణ నుండి నన్ను విడిపించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పునీత పేతురు డామియన్, మేత్రాణులు మరియు సభ పండితులు గురించి మరింత చదవండి




