తెలుగు

విశ్వాసపాత్రులైన శేషజనం

మంగళవారం, డిసెంబర్ 30, 2025
క్రిస్మస్ అష్టదినోత్సవంలో ఆరవ రోజు
నేటి పఠనాలు

బాలయేసుతో సిమియోను, అన్నా, లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0
దేవాలయంలో సమర్పణ

వీడియో

ఆంగ్లంలో వినండి

అన్నా అనే ప్రవక్త్రి ఉండేది… ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, ఉపవాసంతోను ప్రార్థనతోను రేయింబవళ్లు దేవుణ్ణి ఆరాధించేది.  సరిగ్గా ఆ సమయంలోనే ఆమె ముందుకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు తెలిపి, యెరూషలేము విమోచన కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఆ శిశువును గురించి చెప్పింది.  లూకా 2:36–38

సిమియోను వలెనే అన్నా కూడా “యెరూషలేము విమోచన కోసం ఎదురుచూస్తున్న” వారిలో ఒకరు. ప్రవచనాలను విశ్వసించి, మెస్సీయ ఆధ్యాత్మిక పాత్రను, రక్షణకార్యంలో ఆయన పాత్రను అర్థం చేసుకొని, గొప్ప ఆశతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న ఇశ్రాయేలు విశ్వాసపాత్రులైన శేషజనంలో ఆమె ఒకరు.

అన్నా “దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, ఉపవాసంతోను ప్రార్థనతోను రేయింబవళ్లు దేవుణ్ణి ఆరాధించేది” కాబట్టి, దేవుని స్వరాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించగలిగేది. ఆమె ప్రార్థనా జీవితం పవిత్రాత్మ ప్రేరణలను గ్రహించే సున్నితత్వాన్ని ఆమెకు ఇచ్చింది. ముఖ్యంగా, యేసును దేవాలయంలో సమర్పించి, ఆచారప్రకారం ఆయన కోసం విమోచన క్రతువును నిర్వహించిన ఆ మహిమగల రోజున ఇది స్పష్టమైంది.

మొదట సిమియోను ప్రవచన వాక్యాలకు, ఆ తరువాత అన్నా మాటలకు మరియ, యోసేపు ఎలా స్పందించి ఉంటారో ఊహించండి. ఆచారప్రకారమైన అర్పణ, సమర్పణ యథావిధిగా జరిగే కార్యక్రమమేనని వారు భావించి ఉండవచ్చు. అయినా, సిమియోను, అన్నాల ఆనందం, ప్రవచన వాక్యాలు తమ శిశువు గుర్తింపులోను, ఆయన కార్యలక్ష్యంలోను ఇమిడి ఉన్న గాఢమైన మర్మాన్ని గురించి వారిని విస్మయంతోను అబ్బురంతోను నింపి ఉంటాయి.

సిమియోను, అన్నాల వలె నేడు మనం కూడా విశ్వాసపాత్రులైన శేషజనంలో భాగమై ఉండటానికి పిలువబడుతున్నాము. మన ప్రపంచాన్ని పీడిస్తున్న అల్లకల్లోలం, అనైతికత మనలను సులభంగా నిరుత్సాహానికి లేదా కోపానికి గురిచేయవచ్చు. ఈ కల్లోలం మనకు దగ్గరగా, మన కుటుంబాల్లో లేదా సంఘాల్లో ఉన్నప్పుడు, దానిని ఎదుర్కోవడం మరింత సవాలుగా మారుతుంది. మన జీవితాలను ఎలా గడపాలో నేటి సువార్తలోని అన్నా ఆదర్శం మనకు శక్తివంతంగా చూపిస్తుంది. మనలో చాలామందికి రేయింబవళ్లు దేవాలయంలో ఉండి, ఉపవాసం చేస్తూ ప్రార్థించడం సాధ్యం కాకపోవచ్చు. అయినా, మన ఆత్మలను దేవుని ఆలయాలుగా చేసుకుంటూ, మనలో నివసించే పవిత్రాత్మ సాన్నిధ్యాన్ని మోస్తూ జీవించడానికి మనమందరం పిలువబడుతున్నాము.

మన అంతరంగంలోని దేవుని సాన్నిధ్యాన్ని మరింతగా గుర్తించడానికి తోడ్పడే అంతరంగ ఏకాగ్రతా ప్రార్థనను ఆవిలా పునీత తెరేసా ఎంతో ప్రశంసిస్తారు. ఈ ప్రార్థన రెండు స్థాయుల్లో జరుగుతుంది. మొదటిది, “క్రియాశీల” ఏకాగ్రత. ఇది మన ఆత్మల ఆలయంలో, లేదా “కోటలో,” దేవుణ్ణి వెదుకుతూ మనం ఉద్దేశపూర్వకంగా చేసే ధ్యానం. కృప ద్వారా మనలో నివసించే దేవుణ్ణి కనుగొనడానికి మనం చురుకుగా అంతర్ముఖులమవడం ఇది.

కాలక్రమేణా, ఈ ప్రార్థనలో మనం మరింత లోతుగా ప్రవేశిస్తున్నప్పుడు, అది “నిష్క్రియాత్మక” ఏకాగ్రతగా మారుతుంది. దేవుడు మనలను నడిపించడం ప్రారంభిస్తారు. మన ఆత్మల ఆలయంలో తనతో ఉండమని మనలను పిలుస్తూ, రోజంతా తన సాన్నిధ్యాన్ని మరింత గాఢంగా అనుభవించేలా చేస్తారు. ఈ విధమైన ఏకాగ్రతా ప్రార్థనలను అభ్యసించేవారు, దేవుని స్వరాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ రేయింబవళ్లు దేవాలయంలో గడిపిన అన్నా వలె ఉంటారు.

అన్నా ప్రార్థనా జీవితాన్ని అనుకరించమని దేవుడు ఇస్తున్న ఆహ్వానాన్ని గురించి నేడు ధ్యానించండి. ఆమె ఆదర్శాన్ని అనుసరించడం ద్వారా, మీరు కూడా దేవుని స్వరాన్ని, పవిత్రాత్మ ప్రేరణలను మరింత శ్రద్ధగా గ్రహించగలుగుతారు. మెస్సీయ మీ వద్దకు వచ్చే అనేక మార్గాలను, మీ చుట్టూ ఆయన సాన్నిధ్యాన్ని మీరు గుర్తిస్తారు. ఈ కృప, లోకంలోని చెడులను, సవాళ్లను అధిగమించడానికి మీకు శక్తినిస్తుంది. దేవుని ఓదార్పు కోసం, విమోచన కోసం ఎదురుచూసే ఆయన విశ్వాసపాత్రులైన శేషజనంలో మీరు భాగమయ్యేలా చేస్తుంది.

అత్యంత మహిమగల మెస్సీయా, మా ప్రపంచంలోని అల్లకల్లోలాన్ని నీవు చూస్తున్నావు. నిన్ను వెదికేవారిని రక్షించి, స్వతంత్రులను చేయడానికి వారి వద్దకు వస్తున్నావు. ఎల్లప్పుడూ నమ్మకంతో నీ వైపు తిరుగుతూ, రేయింబవళ్లు నిన్ను వెదుకుతూ, నీ విశ్వాసపాత్రులైన శేషజనంలో భాగమై ఉండేందుకు నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సంవత్సరాంత విరాళం ఇవ్వడం గురించి మీరు ఆలోచిస్తారా?

మా క్రిస్మస్ వనరులను చూడండి!

పవిత్ర గ్రంథ ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

క్రిస్మస్ ప్రార్థన

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

దైవకారుణ్యంతో 365 రోజుల ప్రయాణంలో మాతో చేరండి!

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్తీనాతో 365 రోజులు జనవరి 1న ధ్యానం 1తో ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరానికి మనం సిద్ధమవుతున్న వేళ, రాబోయే సంవత్సరమంతా ప్రతిరోజూ దేవుని అపారమైన కారుణ్యాన్ని ధ్యానించడానికి మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రయాణంలో మాతో చేరడానికి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని కూడా మిమ్మల్ని కోరుతున్నాము! ఈ విధాలుగా మాతో చేరమని వారిని ఆహ్వానించండి:

  1. దైవకారుణ్యంపై రోజువారీ ఇమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
  2. మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా
  3. ప్రతిరోజూ మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
  4. దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్‌బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా

ఈ కొత్త సంవత్సరంలో దేవుని అపారమైన కారుణ్యాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!