బుధవారం, డిసెంబర్ 31, 2025
క్రిస్మస్ అష్టదినోత్సవంలో ఏడవ రోజు
నేటి పఠనాలు
పునీత మొదటి సిల్వెస్టర్ పాపుగారు—ఐచ్ఛిక స్మరణ
మిలెసెవాక్, CC BY-SA 4.0, వికీమీడియా కామన్స్ ద్వారా
వీడియో
ఆంగ్లంలో వినండి
ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవునితో ఉండెను, వాక్కు దేవుడై ఉండెను… ఆ వాక్కు మానవ శరీరాన్ని ధరించి మన మధ్య నివసించెను. కృపాసత్యాలతో నిండిన తండ్రి ఏకైక కుమారుని మహిమగా ఆయన మహిమను మేము చూశాము. యోహాను 1:1; 14
యోహాను సువార్తకు ఉపోద్ఘాతమైన యోహాను 1:1-18, పవిత్ర గ్రంథంలోని అత్యంత గంభీరమైన, వేదాంతపరంగా సమృద్ధమైన భాగాలలో ఒకటి. ఇది ధ్యానానికి దారితీస్తూ మర్మభరితంగా ఉంటుంది; ధ్యాననిష్ఠ ప్రార్థనలోని లోతుల ద్వారా దేవుణ్ణి ఆయన నిజస్వరూపంలో తెలుసుకోవడానికి మనలను ఆహ్వానిస్తుంది.
“ఆదిలో…” అనే ప్రారంభ పదాలు ఆదికాండమును ప్రతిధ్వనిస్తూ, దేవుని కుమారుని నిత్యస్వభావాన్ని, సృష్టికి ముందే ఆయన ఉనికిని వెల్లడిస్తాయి. దేవుడు అంతరంగంలో ప్రసాదించే ధ్యానజ్ఞానమనే ప్రత్యేక కృప ద్వారా, తండ్రి నిత్యమూ పలికే వాక్కు యేసేనని, ఆయన తండ్రితో నిత్యత్వమంతటా సహజీవనం చేస్తున్నారని సువార్తికుడైన పునీత యోహాను గ్రహించారు. వాక్కు మానవ స్వభావాన్ని స్వీకరించి, శరీరధారియై మన మధ్య నివసించారని ఆయన గుర్తించారు.
పునీత యోహాను ఈ మాటలను మొదటిసారి వ్రాస్తున్నప్పుడు ఆయన ఆలోచనలను పరిగణించండి. శరీరధారియైన నిత్యవాక్కుతో ఆయన సుమారు మూడు సంవత్సరాలు గడిపారు—ఆయనతో నడిచారు, ఆయన బోధలను విన్నారు; ఆయన అద్భుతాలకు, ఆయనకు ఎదురైన తిరస్కారానికి, ఆయన శ్రమలకు, మరణానికి, పునరుత్థానానికి సాక్షిగా ఉన్నారు. యేసు స్వర్గారోహణం చేస్తున్నప్పుడు ఆయన ఇతరులతో కలిసి నిలబడ్డారు; పెంతెకోస్తు నాడు పవిత్రాత్మ కుమ్మరింపును అనుభవించారు.
పెంతెకోస్తు తరువాత, యేసును గురించిన యోహాను అవగాహన మరింత లోతుగా మారింది. ప్రార్థన ద్వారా, దివ్యసత్ప్రసాద వేడుక ద్వారా యోహాను తన ప్రభువును మరింత సన్నిహితంగా, తనను రూపాంతరం చెందించే విధంగా తెలుసుకున్నారు. నిత్యవాక్కు ఇక భూమిపై నడవకపోయినా, ఇప్పుడు కృప ద్వారా ఆయన అంతరంగంలో సన్నిహితంగా ఉన్నారు. ఈ నిరంతర సాన్నిధ్యం ఆయనకు మునుపెన్నటికన్నా మరింత వాస్తవంగా అనిపించింది.
దివ్యసంస్కారాల ద్వారా, ప్రార్థనలో, పవిత్ర గ్రంథంలో, మన ఆత్మలలో మన మధ్య నివసిస్తూనే ఉన్న నిత్యవాక్కును తెలుసుకోవడానికి యోహానులాగే మనమూ పిలువబడ్డాము. సభలో ఆయన సజీవ అవయవాలుగా మారేలా, ఆయన సాన్నిధ్యం ద్వారా రూపాంతరం చెందడానికి మనం ఆహ్వానించబడ్డాము.
మానవావతార, విమోచన రహస్యాలలోనికి ఆకర్షితులయ్యేందుకు మనలను మనం అనుమతించినప్పుడే క్రీస్తుతో ఈ గాఢమైన ఐక్యం సాధ్యమవుతుంది. మన బుద్ధి ఈ రహస్యాలను కొంతవరకు గ్రహించగలిగినా, దేవుడు అంతరంగంలో ప్రసాదించే ధ్యానజ్ఞానం ద్వారానే నిజమైన అవగాహన కలుగుతుంది. ఇది మనలో నివసించే పవిత్రాత్మ ఇచ్చే వరం.
సువార్తికుడైన పునీత యోహాను తన ఉపోద్ఘాతాన్ని వ్రాస్తున్న సందర్భాన్ని గురించి నేడు ధ్యానించండి. ఆయన పొందిన ధ్యానజ్ఞాన వరాన్ని, ఆయన ఆత్మలో సంభవించిన రూపాంతరాన్ని, దేవునితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని పరిగణించండి. అంతరంగ ఐక్యతతోనూ ధ్యానంతోనూ కూడిన ఇదే జీవితానికి మనలో ప్రతి ఒక్కరమూ పిలువబడ్డాము. సుందరమైన, మర్మభరితమైన ఈ ఉపోద్ఘాతం మిమ్మల్ని ప్రార్థనలోనికి, శరీరధారియైన వాక్కు రహస్యంలోనికి మరింత లోతుగా నడిపించనివ్వండి.
దేవుని నిత్యవాక్కువైన నా ప్రభువా, కాలం ఆరంభం కాకముందే నీవు తండ్రితోను పవిత్రాత్మతోను పరిపూర్ణ ఐక్యంలో ఉన్నావు. ఈ క్రిస్మస్ అష్టదినోత్సవంలో, మా మధ్య నివసించడానికీ, కృప ద్వారా మాలో నివసించడానికీ నీవు శరీరధారివైన నీ మానవావతారాన్ని మేము ధ్యానిస్తున్నాము. నీ ప్రియ శిష్యుడైన పునీత యోహానుకున్న అదే విశ్వాసంతో నేను కూడా నమ్మేలా ఈ గొప్ప రహస్యాన్ని నాకు వెల్లడించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సంవత్సరాంత విరాళం ఇవ్వడం గురించి మీరు ఆలోచిస్తారా?
మరిన్ని క్రిస్మస్ ధ్యానాలు:
ఆనందంతో గంతులేసిన క్షణాన్ని స్మరించుకోవడం
ప్రభువుకు వినమ్రంగా సేవచేసే వ్యక్తి
దైవకారుణ్యంతో 365 రోజుల ప్రయాణంలో మాతో చేరండి!
దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్తీనాతో 365 రోజులు జనవరి 1న ధ్యానం 1తో ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరానికి మనం సిద్ధమవుతున్న వేళ, రాబోయే సంవత్సరమంతా ప్రతిరోజూ దేవుని అపారమైన కారుణ్యాన్ని ధ్యానించడానికి మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రయాణంలో మాతో చేరడానికి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని కూడా మిమ్మల్ని కోరుతున్నాము! ఈ విధాలుగా మాతో చేరమని వారిని ఆహ్వానించండి:
- దైవకారుణ్యంపై రోజువారీ ఇమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
- మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా
- ప్రతిరోజూ మా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా
- దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా
ఈ కొత్త సంవత్సరంలో దేవుని అపారమైన కారుణ్యాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!





