తెలుగు

తటస్థతకు తావులేదు

మార్చి 12, 2026
తపస్సుకాలం మూడవ వారంలోని గురువారం
నేటి పఠనాలు

బంగారు రంగు ఆకృతులతో కూడిన నేపథ్యంతో, తల చుట్టూ ప్రభావలయంతో, సంప్రదాయ ఎరుపు, నీలం రంగు వస్త్రాలు ధరించి, పొలంలో నడుస్తూ కుడిచేతితో విత్తనాలు చల్లుతున్న యేసును చూపించే ఆధ్యాత్మిక కళాచిత్రం.చిత్రం: అడోబీ స్టాక్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

“నాతో ఉండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొడతాడు.” లూకా 11:23

వివాదాస్పద అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం కంటే తటస్థంగా ఉండడం తరచూ సులభమనిపిస్తుంది. బహిరంగ చర్చల్లో అత్యంత విభేదాలు రేకెత్తించే అంశాలలో గర్భస్రావం వంటివి ఉన్నాయి. అయితే, జీవితంలోని మరెన్నో అంశాలు కూడా తీవ్ర చర్చలకు దారితీస్తాయి; ముఖ్యంగా నైతిక సూత్రాలతో ముడిపడినప్పుడు అలా జరుగుతుంది. యుద్ధం, రాజకీయాలు, గర్భనిరోధం, వివాహ నిర్వచనం, ఆర్థిక విధానాలు తీవ్రమైన అభిప్రాయాలను రేకెత్తించి, విభేదాలకు దారితీయవచ్చు. క్రీస్తు అనుచరులమైన మనకు, స్పష్టమైన నైతిక సత్యాల విషయంలో తటస్థంగా ఉండే అవకాశం లేదు.

చర్చకు వచ్చే అంశాలన్నింటిలోనూ నైతికంగా ఏది సరైనదో ఒకే విధంగా సులభంగా తేల్చలేకపోయినా, కతోలిక సభ సువార్త ద్వారా, తన బోధనల ద్వారా అనేక కీలక విషయాలలో మనకు మార్గదర్శకత్వం అందిస్తుంది. గర్భధారణ నుండి సహజ మరణం వరకు మానవ జీవన గౌరవం, వివాహ పవిత్రత వంటి మౌలిక అంశాలలో దేవుని ధర్మశాసనం స్పష్టంగా ఉంది. ఈ విషయాలలో మనం మన ప్రభువు పక్షాన నిలవాలి.

నేటి సువార్తలో యేసు మాటలు మనకు నేరుగా సవాలు విసురుతున్నాయి: “నాతో ఉండనివాడు నాకు విరోధి, నాతో కూడి సమకూర్చనివాడు చెదరగొడతాడు.” దేవుని ధర్మశాసనాన్ని సమర్థించి, కాపాడడంలో విఫలమవడం తటస్థ చర్య కాదని ఇది సూచిస్తుంది; నిజానికి అది ఆయన చిత్తాన్ని వ్యతిరేకించడమే. ఒక పక్షాన నిలవడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే క్రీస్తు పక్షాన నిలిచినప్పుడు భిన్నాభిప్రాయాలు గలవారి నుండి తరచూ విమర్శలు, తీర్పులు, చివరికి శత్రుత్వం కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ, ఈ విషయాలలో తటస్థంగా ఉండడం ఒక విధమైన నిర్లక్ష్యం; నేటి సువార్తలో యేసు దానిని పాపంగా పేర్కొంటున్నారు.

ఈ సువార్త భాగం యేసు “ఒక మూగదయ్యాన్ని” వెళ్లగొట్టడంతో ప్రారంభమవుతుంది. “ఆ దయ్యం బయటకు వెళ్లిపోగానే, మూగవాడు మాట్లాడాడు; జనసమూహాలు ఆశ్చర్యపోయాయి.” దయ్యం వల్ల ఆ వ్యక్తికి కలిగిన మూగతనం, చెడును ఎదుర్కొన్నప్పుడు మౌనంగా ఉండాలనే మన శోధనకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ సంఘటనలోని వ్యక్తి శారీరకంగా దయ్యం పట్టి ఉన్నప్పటికీ, మనం తరచూ భయం, బెదిరింపు లేదా అయోమయం వల్ల ఆధ్యాత్మిక మూగతనాన్ని అనుభవిస్తుంటాం. మన నోరు మూయించడానికి శత్రువు ఉపయోగించే వ్యూహాలే ఇవి. సువార్త సత్యాన్ని మనం ప్రకటించకుండా అడ్డుకోవడానికి ఈ దుష్టశక్తులే అలుపెరుగకుండా పనిచేస్తుంటాయి.

తరువాత యేసు తన భవనాన్ని కాపాడుకునే “పూర్తిగా ఆయుధాలు ధరించిన బలవంతుని” చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అతడు సైతానుకు, దాని దుష్టశక్తులకు ప్రతీక. తన ఆధీనంలోని ప్రదేశాన్ని బలంతో కాపాడుకుంటున్న ఈ బలవంతుడు అజేయునిలా కనిపిస్తాడు. అయితే, “అతనికంటే బలవంతుడు అతనిపై దాడిచేసి జయించినప్పుడు, అతడు నమ్ముకున్న కవచాన్ని తీసివేసి, దోచుకున్న సొత్తును పంచిపెడతాడు.” సైతానును, దాని కార్యాలన్నింటినీ ఇప్పటికే ఓడించిన “మరింత బలవంతుడు” యేసే. చెడు ఎంత శక్తివంతంగా కనిపించినా, దేవుని మహాశక్తి ఎదుట అది శక్తిహీనమే. కాబట్టి సమాజం నుండి, కుటుంబం నుండి లేదా స్నేహితుల నుండి వ్యతిరేకత ఎదురైనా, సత్యం కోసం నిలవడానికి మనం ఎన్నడూ భయపడకూడదు. క్రీస్తు అనుచరులమైన మనం, అంతిమ విజయం దేవునిదేనని నమ్ముతూ ధైర్యంతో, స్పష్టతతో, ప్రేమతో మాట్లాడటానికి పిలువబడ్డాం.

అయితే, ప్రతి పరిస్థితిలోనూ మాటలతో ఎదిరించాల్సిన అవసరం లేదు. మాట్లాడమని దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తున్నారో, మౌనంగా ఉండడం ఆయన నిర్ణయించిన సమయంపై నమ్మకం ఉంచే చర్యగా ఎప్పుడు ఉంటుందో మనం వివేచించాలి. వాడివేడి వాదనల్లోకి దిగడం ఫలప్రదం కాకపోవచ్చు, లేదా మరిన్ని విభేదాలకు దారితీయవచ్చు. అయితే, మౌనం వివేచన నుండి రావాలే తప్ప భయం నుండి గానీ, ఘర్షణను తప్పించుకోవాలనే కోరిక నుండి గానీ రాకూడదు. దుష్టశక్తుల అబద్ధాలు లేదా బెదిరింపుల వల్ల మనం మౌనంగా ఉంటే, అది మన ప్రభువు పక్షాన నిలవడంలో విఫలమవడమే.

భయంతో మౌనంగా లేదా తటస్థంగా ఉండాలనే శోధన మీకు కలిగే పరిస్థితుల గురించి ఈ రోజు ధ్యానించండి. కోపం, శత్రుత్వం పరిష్కారం కానట్లే, తప్పించుకోవడం కూడా అంతే సమస్యాత్మకం. కష్టమైనప్పటికీ ప్రేమతో సత్యాన్ని పలకాలని దైవప్రేమ, సోదరప్రేమ మనల్ని కోరుతున్నాయి. మీ మౌనానికి మూలం వివేకమా, లేక భయం, బెదిరింపులా అని వివేచిస్తూ పవిత్రాత్మ మార్గదర్శకత్వాన్ని కోరండి. మీరు ఎదుర్కొనే ఏ చెడు కంటే అయినా మన ప్రభువు బలవంతుడని నమ్ముతూ, ప్రతి పరిస్థితిలోనూ ఆయన పక్షాన నిలవడానికి నిబద్ధతతో ముందుకు రండి.

అగాధమైన మహాశక్తిగల ప్రభువా, నీ శక్తి ప్రతి అబద్ధం కంటే, దుష్టశక్తుల నుండి వచ్చే ప్రతి శోధన కంటే గొప్పది. నేను పోరాడుతున్న ప్రతి పాపాన్ని జయించి, భయం నుండి నన్ను విడిపించగలవు. నైతిక స్పష్టత అవసరమైనప్పుడు నేనెన్నడూ తటస్థంగా గానీ మౌనంగా గానీ ఉండకుండా ఉండే ధైర్యాన్ని దయచేసి నాకు ప్రసాదించు. నేను ఎల్లప్పుడూ నీతో ఉండి, ప్రజలను నీ వద్దకు సమకూర్చడంలో తోడ్పడుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పునీత యోసేపునకు నవదిన ప్రార్థన. మార్చి 10-18 వరకు ప్రార్థిస్తారు.

ఇరవయ్యవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

తపస్సుకాలం కోసం వనరులు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు