జూలై 10, 2026
సామాన్య కాలం పదునాలుగవ వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు
అపొస్తలులు, రూపొందించినవారు: లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0.
ఆంగ్లంలో వినండి
యేసు తన అపొస్తలులతో ఇలా అన్నారు: “ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను; కాబట్టి పాములవలె వివేకంతోను, పావురాలవలె నిష్కపటంగాను ఉండండి. అయితే మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ ప్రార్థనా మందిరాలలో కొరడాలతో కొడతారు. నా నిమిత్తం మిమ్మల్ని పాలకుల ఎదుటకు, రాజుల ఎదుటకు తీసుకువెళతారు; తద్వారా మీరు వారికీ అన్యజనులకూ సాక్షులుగా ఉంటారు.” మత్తయి 10:16–18
హింసలకు గురికావాలని సహజంగా ఎవరూ కోరుకోరు. మనం వాటి నుండి పారిపోతాం. పరస్పర సహవాసం కోసం మనం సృష్టించబడ్డాం. పరలోకంలోనూ, కాలాంతంలో వచ్చే నూతన ఆకాశాలలోనూ నూతన భూమిపైనా, విశ్వానికి రాజైన దేవుని ఆనందమయ దివ్యదర్శనాన్ని అందరితో కలిసి పొందుతూ, ఆయనను ఆరాధిస్తూ, అందరితో శాంతిని, ఐక్యతను, సంఘీభావాన్ని నిత్యమూ అనుభవిస్తాం.
అయితే నేడు, పతనమైన ఈ లోకంపై అంధకార రాజ్యం ఇంకా గట్టి పట్టు కలిగి ఉంది. యుద్ధం, హింస, అన్యాయం, అన్నిరకాల విభేదాలు కుటుంబాలను, సమాజాలను, దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే క్రీస్తు తన రాజ్యాన్ని ప్రారంభించడం ద్వారా నెలకొల్పదలచిన శాంతిసామరస్యాలను సాధించడం కంటే శత్రుత్వాన్ని పెంచడం ఎంతో సులభం.
హింసలను తప్పించుకోవడానికి అత్యంత నిశ్చయమైన మార్గాలలో ఒకటి దేనికోసమూ నిలబడకపోవడమే. నైతిక విషయాలలో దృఢమైన నమ్మకాలేవీ లేనివారు లేదా విశ్వాస సత్యాల గురించి మౌనంగా ఉండేవారు లోకపు ఆగ్రహానికి గురయ్యే అవకాశం తక్కువ. కానీ సువార్తలోని నిత్య సత్యాల గురించి స్పష్టతతోను ప్రేమతోను మాట్లాడేవారు తరచూ తిరస్కారానికి గురవుతారు.
ఈ వాస్తవాన్ని ఎదుర్కోవడానికే యేసు పన్నెండుమంది అపొస్తలులను సిద్ధం చేస్తున్నారు. దేవుని రాజ్యం వచ్చిందని ప్రకటించడానికి తన పన్నెండుమందిని ఇద్దరిద్దరుగా పంపుతూ యేసు చేసిన సుదీర్ఘ ఉపదేశం నుండి నేటి సువార్త తీసుకోబడింది. వారు ధైర్యంగా బయలుదేరి, దైవపోషణపై ఆధారపడి, అద్భుతాలు చేసి, తాము పంపబడిన వివిధ పట్టణాలను, గ్రామాలను యేసు రాక కోసం సిద్ధం చేయవలసి ఉంది.
మెస్సీయ వచ్చారని, త్వరలోనే స్వయంగా తమ దగ్గరకు రానున్నారని తెలిపే శుభవార్తను పంచుకోవడానికి ఒక యూదుల పట్టణంలోకి వెళితే, అక్కడ ఎంతో ఆనందంతో స్వాగతిస్తారని మొదట అనిపించవచ్చు. అయితే అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి యేసు వారిని సిద్ధం చేయలేదు. పన్నెండుమందిని తాను “తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు” పంపుతున్నానని చెబుతూ, మనసుకు హత్తుకునే ఒక దృశ్యాన్ని ఆయన చూపిస్తున్నారు. వారు కలిగి ఉండవలసిన అమాయకత్వాన్నీ, అనివార్యంగా ఎదుర్కోవలసిన శత్రుత్వాన్నీ ఇది గుర్తుచేస్తుంది. గొర్రెలవలె వారు సాత్వికతతో మెలుగుతూ, తమకు హాని కలిగే అవకాశమున్నా, మంచి కాపరి పోషణపై పూర్తిగా ఆధారపడవలసి ఉంది.
నేడు మన కుటుంబాలలో, సమాజాలలో, లోకంలో సువార్తను ప్రకటించడానికి మన ప్రభువు మనల్ని పంపుతున్నప్పుడు, ఆ పన్నెండుమందికి ఎదురైన వాటికి భిన్నమైనవేవీ మనకు ఎదురవుతాయని ఆశించకూడదు. ఉదాహరణకు, కతోలిక సభ నైతిక బోధనలను బహిరంగంగా సమర్థించేవారికి తరచూ తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారానే లభిస్తుందని ప్రకటించడం కూడా శత్రుత్వానికి దారితీయవచ్చు. ఇలాంటి నమ్మకాలు అసహనంతో కూడినవని లేదా ఇతరులకు తీర్పు తీర్చేవని తరచూ ఆరోపిస్తారు. కానీ వాస్తవానికి అవి ప్రేమలోనూ, దేవుని ప్రత్యక్షీకరణ పట్ల విశ్వసనీయతలోనూ, ప్రతి ఆత్మ మేలు పట్ల నిజమైన శ్రద్ధలోనూ వేళ్లూనుకొని ఉన్నాయి.
యేసు తన రాజ్యాన్ని స్థాపించే కార్యాన్ని మనం కొనసాగించాలనుకుంటే, హింసలకు ఎలా స్పందించాలో తెలుసుకొని వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ద్వేషానికి బదులుగా ద్వేషాన్ని చూపడం లేదా హింసకు బదులుగా హింసను ప్రయోగించడం సువార్త మార్గం కాదు. బదులుగా, మనం సత్యానికి సందేశహరులమైనప్పుడు శత్రుత్వం ఎదురవుతుందని ముందుగానే గ్రహించి, దానికి సిద్ధంగా ఉండాలి; పాములవంటి వివేకంతోను, పావురాలవంటి నిష్కపటత్వంతోను స్పందించాలి. మనం ప్రమాదాలను గుర్తించి, ఉచ్చులను తప్పించుకొని, అమాయకంగా మోసపోకుండా హింసలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. అలాగే హృదయపూర్వకమైన నిజాయితీని, దురుద్దేశం లేని మనసును, చలించని శాంతిని అలవరచుకోవాలి.
క్రీస్తు నిమిత్తం కష్టాలను సహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేడు ధ్యానించండి. ప్రేమతో సత్యాన్ని పలకడానికి, తిరస్కారాన్ని ప్రశాంతంగా స్వీకరించడానికి మీ హృదయం సిద్ధంగా ఉందా? భయంతో కాక నమ్మకంతో బయలుదేరిన అపొస్తలులను అనుసరించే కృప కోసం ప్రార్థించండి. మిమ్మల్ని ఏ కార్యం కోసం పంపించారో, ఆ కార్యంలో ప్రభువు పరిపూర్ణ చిత్తానికి అనుగుణంగా మీరు నడుచుకున్నప్పుడు, మంచి కాపరి మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ కాపాడతారని తెలుసుకొని, అంధకారంతోను శత్రుత్వంతోను నిండిన లోకంలోకి వివేకం, నిష్కపటత్వం, విశ్వసనీయత, ధైర్యం, సాత్వికతలతో సువార్త వెలుగును తీసుకువెళ్లాలని సంకల్పించండి.
అత్యంత మహిమాన్వితుడవైన రాజా, రాబోయే నిత్యరాజ్యానికి సన్నాహంగా ఈ భూమిపై నీ రాజ్యాన్ని స్థాపించడానికి నీవు వచ్చావు. నా కుటుంబ సభ్యుల, స్నేహితుల హృదయాల్లోకి, విస్తృత సమాజంలోకి, ఈ లోకంలో సాక్ష్యమివ్వమని నీవు నన్ను పిలిచే ప్రతి చోటికీ నీ రాకకు మార్గాన్ని సిద్ధం చేసేందుకు దయచేసి నన్ను పంపుము. సత్యప్రేమలతో కూడిన నీ రాజ్యానికి మార్గాన్ని సిద్ధం చేయడానికి నేను కృషిచేస్తూ, పాముల చాకచక్యంతో, పావురాల మృదుత్వంతో, జ్ఞానవినయాలతో నడుచుకునేలా అనుగ్రహించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు




