ఏప్రిల్ 27, 2026
పాస్కా కాలం నాలుగవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు
ఆంగ్లంలో వినండి
యేసు ఇలా అన్నారు: “నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడు. కాపరి కాని, ఆ గొర్రెలు తనవి కాని కూలివాడు తోడేలు రావడం చూసి, గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వాటిని పట్టుకొని చెదరగొడుతుంది. అతడు కూలి కోసం పనిచేస్తాడు, గొర్రెల పట్ల శ్రద్ధ లేనివాడు కాబట్టే అలా చేస్తాడు.” యోహాను 10:11–13
ఒక కాపరిని “మంచి” కాపరిగా చేసేది ఏమిటి? కాపరి బాధ్యతలు నిర్వర్తించడానికి ఎంతో త్యాగం చేయాలి, ఎంతో సమయం వెచ్చించాలి. అప్పుడే పుట్టిన తన శిశువును ఎల్లప్పుడూ శ్రద్ధగా చూసుకునే తల్లిలా, కాపరి తన మంద సంరక్షణకు తన సమయాన్ని, శక్తిని అంకితం చేస్తాడు. బైబిలు కాలంలో కాపరులు తరచూ పట్టణాల పొలిమేరల్లోని గుహల్లో నివసించేవారు. అక్కడ పచ్చిక బయళ్లు పుష్కలంగా ఉండేవి; గొర్రెలు తిరగడానికి స్థలం, నీటి వనరులు ఉండేవి. ఆ గుహలు రాత్రివేళ భద్రతనిచ్చేవి; ఎండ, వాన, చలి నుంచి ఆశ్రయం కల్పించేవి. పగటివేళ కాపరి దాదాపు ఒక తండ్రిలా మందను కాపాడేవాడు. తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసి, ఏమరుపాటుగా ఉంటే ఏదైనా గొర్రె దారితప్పిపోవచ్చని లేదా తోడేళ్ల గుంపునకు బలికావచ్చని అతనికి తెలుసు.
దైవప్రేమ, త్యాగాల మరింత గొప్ప వాస్తవికతను తెలియజేయడానికి యేసు ఈ సుపరిచిత దృశ్యాన్ని విస్తరింపజేస్తున్నారు. నేటి సువార్తలో యేసు కాపరికి సంబంధించిన ఈ దృశ్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళుతున్నారు. ఆయన ఇలా అంటున్నారు: “మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడు.” ఇది కాపరి సాధారణ బాధ్యతల్లో భాగం కాకపోయినా, వింటున్నవారు బహుశా దీనిలో ఒక పోలికను గుర్తించి ఉండవచ్చు. కాపరులు వెచ్చించే సమయాన్ని, చూపించే నిబద్ధతను గుర్తుచేసుకుంటూ, కొందరు యేసు బోధను అలంకారిక అర్థంలో గ్రహించి ఉండవచ్చు. ఇందులో అలంకారికంగా నేర్చుకోవలసిన పాఠం ఉన్నప్పటికీ, యేసు బోధ అంతకంటే మించినది.
యేసు మొదట తనను తాను సత్కాపరిగా తెలియజేసుకున్నారు. తరువాత దాని అర్థమేమిటో నిర్వచిస్తున్నారు: ఆయన తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పిస్తారు. ఆయన మాటలను విన్నవారు బహుశా వాటి అర్థాన్ని గ్రహించి ఉండకపోవచ్చు. కానీ, తన సువార్తను రచిస్తున్నప్పుడు పునీత యోహాను, యేసు మాటలు కేవలం అలంకారికమైనవే కాక అక్షరార్థమైనవి కూడా అని పూర్తిగా అర్థం చేసుకున్నారు—యేసు తన గొర్రెల పాపాల కోసం సిలువపై మరణిస్తారు.
కూలికి పనిచేసే వ్యక్తికీ, తన సొంత గొర్రెలను కాచే నిజమైన కాపరికీ మధ్య ఉన్న తేడాను యేసు చూపించడంతో ఈ రూపకం కొనసాగుతుంది. ప్రమాదం ఎదురైనప్పుడు కూలివాడు తన ప్రాణరక్షణ కోసం పారిపోతాడు. కానీ కాపరి తన గొర్రెల కోసం నిలబడి, మరణించడానికైనా సిద్ధపడి పోరాడతాడు. యేసు మన కోసం చేసినదాన్ని ఇది స్పష్టంగా చిత్రిస్తుంది. అదే సమయంలో, దేవుని మంద అయిన ఆయన ప్రజలందరి పట్ల మన బాధ్యతను కూడా వెల్లడిస్తుంది.
క్రీస్తు శరీరమైన సభలో సభ్యులుగా, ఆయన కాపరి పరిచర్యలో పాలుపంచుకోవడానికి మనం పిలువబడ్డాం. మనం ఏ విధంగా ఆ పరిచర్యలో పాలుపంచుకోవాలో ముఖ్యంగా మన జీవన పిలుపులు నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతగా అంకితభావంతో ఉండాలంటే, తమ ప్రాణాలకంటే తమ పిల్లల ప్రాణాలనే ఎక్కువగా విలువైనవిగా ఎంచాలి. గురువులు, సమర్పిత జీవితం గడిపేవారు తమ మందలను ఆధ్యాత్మికంగా నడిపించి, కాపాడే కాపరులుగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే, మనలో ప్రతి ఒక్కరం మనకు లభించిన పిలుపుకు తగిన విధంగా క్రీస్తు కాపరి పరిచర్యలో పాలుపంచుకోవాలి. ఇలా జీవించే విధానం మారవచ్చు గాని, అలా జీవించడంలోని సమర్పణ స్థాయి మాత్రం మారకూడదు. త్యాగపూరితంగా, నిస్వార్థంగా, మనల్ని మనం పూర్తిగా అర్పించుకుంటూ జీవించడానికి మనమందరం పిలువబడ్డాం. సత్కాపరికి తన మంద పట్ల ఉన్న నిబద్ధతను అనుకరిస్తూ, ధైర్యంగా, సంపూర్ణంగా మన జీవితాలను ఇతరుల కోసం అర్పించాలి.
సత్కాపరితో ఐక్యంగా ఉంటూ, ప్రతిరోజూ చేసే ప్రేమకార్యాల్లో, మన వాగ్దానాల పట్ల విశ్వసనీయతలో, మన సంరక్షణకు అప్పగించబడినవారి పట్ల అచంచలమైన ప్రేమలో ఈ ధైర్యాన్ని చూపించడానికి మనం ఆహ్వానించబడ్డాం. ఈ సంపూర్ణ సమర్పణతో కూడిన ప్రేమ ద్వారా మనం క్రీస్తు సాన్నిధ్యాన్ని లోకానికి వెల్లడిస్తాం; దివ్యకాపరి ఆధ్వర్యంలో అందరినీ ఒకే మందగా సమకూర్చే ఆయన పరిచర్యలో పాలుపంచుకుంటాం. పునరుత్థాన ఆనందాన్ని వేడుకగా జరుపుకోవడం కొనసాగిస్తున్న మనం, మన సత్కాపరి ధైర్యంతో చూపిన ప్రేమ ద్వారానే ఈ ఆనందం లభించిందని గుర్తుచేసుకుంటాం.
సత్కాపరిగా ఉండే తన పరిచర్యను యేసు పరిపూర్ణంగా నెరవేర్చిన విధానాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. ఆయన ధైర్యాన్ని, త్యాగాన్ని, నిస్వార్థ ప్రేమను మీరు మననం చేస్తున్నప్పుడు, ఆయన మీకు సత్కాపరిగా ఉండటమే కాక, తన కాపరి పరిచర్యలో పాలుపంచుకోవాలని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారని తెలుసుకోండి. మరొకరి మేలు కోసం నిస్వార్థంగా వ్యవహరించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉంటారు? మీరు ఎంతో త్యాగం చేయవలసి వచ్చినా, ఇతరుల రక్షణ కోసం కృషిచేయడానికి ఎంత సుముఖంగా ఉన్నారు? దేవుని పట్ల, తోటి మనుషుల పట్ల ప్రేమ యేసు పరిచర్యకు హృదయం వంటిది. మనం ప్రేమించడానికి పిలువబడినవారితో మెలిగేటప్పుడు, మనం చేసే ప్రతిదానిలోనూ అదే ప్రేమ నిండియుండాలి. సత్కాపరి పరిచర్యలో పాలుపంచుకుంటూ, దేవుని మంద కోసం మీ జీవితాన్ని అర్పించడం ద్వారా ఆయనను గౌరవించి, ఆయనకు కృతజ్ఞతలు తెలపండి.
నా మంచి కాపరీ, నీ గొర్రెలమైన మా కోసం నీవు సిలువపై బాధాకరమైన మరణాన్ని పొంది, నీ ప్రాణాలను అర్పించావు. నీ ధైర్యం, త్యాగం మమ్మల్ని పాపం నుండి, దుష్టుని నుండి రక్షించి, నిత్యజీవానికి మార్గాన్ని తెరుస్తాయి. నీ నిస్వార్థ త్యాగాన్ని నా జీవితంలో స్వీకరిస్తున్నాను. ఇతరులు నిన్ను తెలుసుకొని, నిత్యజీవితంలో పాలుపొందేలా, వారి కోసం నా ప్రాణాలను అర్పించడం ద్వారా నీ త్యాగంలో పాలుపంచుకోవాలని సంకల్పిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.





