తెలుగు

డబ్బు గురించి ఆందోళన చెందకండి

2017 ఫిబ్రవరి 26, ఆదివారం

సామాన్య కాలంలోని ఎనిమిదవ ఆదివారం, ఎ సంవత్సరం

నేటి పునీతులు

luke_banks_2

రేపటి గురించి ఆందోళన చెందకండి; రేపటి సంగతి రేపే చూసుకుంటుంది. ఏ రోజు కీడు ఆ రోజుకు చాలు.  మత్తయి 6:34

మనం ఈ మాటలను ఆలకించి పాటించగలిగితే ఎంత బాగుంటుంది!  … గురించి ఆందోళన చెందకండి.  ఆ మూడు చుక్కల స్థానాన్ని మీరే పూరించాలి.  మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నది ఏమిటి?

నేటి సువార్త భాగమంతా, మనం ఆందోళన చెందకూడనివైనా ఆందోళన చెందుతున్న విషయాల జాబితాను అందిస్తుంది.  ముఖ్యంగా మన భౌతిక క్షేమం గురించిన చింతలను అది ప్రస్తావిస్తుంది.  డబ్బు గురించి, డబ్బుతో లభించే వాటన్నిటి గురించి మనం ఆందోళన చెందకూడదని యేసు చాలా సూటిగా చెబుతున్నారు.  ఆకాశ పక్షులకంటే, పొలంలోని పూలకంటే ఆయనకు మనపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది; అయినా ఆయన వాటిని సంపూర్ణంగా సంరక్షిస్తున్నారు.  మరి మనల్ని కూడా చూసుకోరా?  తప్పకుండా చూసుకుంటారు.

మీరు దేవునినీ డబ్బునీ రెండింటినీ సేవించలేరని ఈ సువార్తలో యేసు సూటిగా చెబుతున్నారు.  మరో మాటలో చెప్పాలంటే, ఆ రెండింటినీ మీ కోరికకు, తపనకు లక్ష్యంగా చేసుకోలేరు.

జీవితంలో డబ్బునే ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం దేవుని పరిపాలనపై నమ్మకం ఉంచకుండా మనల్ని అడ్డుకుంటుంది.  మన అవసరాలు, మన ఆత్మీయుల అవసరాలు తీర్చే విషయంలో మనం ఖచ్చితంగా నిర్లక్ష్యంగా జీవించకూడదు.  పనిచేసి జీవనోపాధి సంపాదించుకోవడం, మన అవసరాలను, మన కుటుంబ అవసరాలను తీర్చడం మన బాధ్యత.  అయితే దేవుని చిత్తానికి అనుగుణంగా శ్రద్ధతో, బాధ్యతతో ఉండటం ఒక విషయం.  అతిగా ఆందోళన చెందడం లేదా మన జీవితాల్లో డబ్బునే ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం మరో విషయం.

డబ్బు విషయంలో ఆందోళన లేకుండా ఉండటానికి సరళమైన సమాధానం నమ్మకమే.  దేవుడు మిమ్మల్ని చూసుకుంటారని పూర్తిగా నమ్మండి.  ప్రార్థించండి, ఆయన మాట వినండి, మీరు జీవనోపాధి సంపాదించుకునే మార్గం విషయంలో తన చిత్తాన్ని మీకు చూపనివ్వండి; ఆ తరువాత, ఆయన మిమ్మల్ని చేయమని పిలుస్తున్నట్లు మీరు విన్నదానిని ధైర్యంగా చేయండి.  కొన్నిసార్లు డబ్బుకు కొరత ఉండవచ్చు.  అలాంటి సమయాలు చింతకు, ఆందోళనకు కారణం కావచ్చు; లేదా దేవునిపై మరింత నమ్మకం ఉంచడానికి, ఆయనకు మిమ్మల్ని మీరు మరింతగా సమర్పించుకోవడానికి కారణం కావచ్చు.

భౌతిక సంపద విషయంలో మిమ్మల్ని ధనవంతులుగా చేస్తానని దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేయడం లేదు.  అలా జరగవచ్చు, జరగకపోవచ్చు; నిజానికి దేవుని దృష్టిలో దానికి అంత ప్రాముఖ్యం లేదు.  ముఖ్యమైనది ఏమిటంటే, సంపద ఉన్నా లేకున్నా, మీరు దేవునిపై నమ్మకం ఉంచి మీ ఆర్థిక వ్యవహారాలను ఆయనకు అప్పగించడం.  మీకు ఎక్కువగా ఉంటే, ప్రతిరోజూ దానిని దేవునికి సమర్పించేలా, మీ సంపదను ఎలా ఉపయోగించాలో దారిచూపమని ప్రతిరోజూ ఆయనను అడిగేలా చూసుకోండి.  మీకు కొద్దిగానే ఉంటే, భయానికి లొంగిపోకండి; ప్రభువుకు మీ అవసరాలు తెలుసనీ, ఆ అవసరాలను ఎలా తీర్చుకోవాలో ఆయన మీకు చూపుతారనీ నమ్మండి.

మీ ఆర్థిక వ్యవహారాలను ఎంత క్రమంగా దేవునికి అప్పగిస్తున్నారో ఈ రోజు ధ్యానించండి.  మీ జీవితంలోని ఈ అంశంపై ఆయనకు పూర్తి అధికారం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?  అలా అయితే, మీరు ఎంతో మనోవేదన నుండి విముక్తి పొందుతారు.

ప్రభువా, నా ఆర్థిక వ్యవహారాలను, నా భౌతిక ఆస్తులను నీకు అప్పగిస్తున్నాను. వాటిని నీ సంరక్షణకు, నీ పరిపాలనకు అప్పగిస్తున్నాను.  దయచేసి వ్యర్థమైన ఆతురత నుండి, ఆందోళన నుండి నన్ను విడిపించి, నా జీవితంలో నిన్నే కేంద్రంగా ఉంచుకోవడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఫలప్రదమైన తపస్సుకాలం కోసం ప్రార్థన

మరిన్ని>>>