డిసెంబర్ 15, 2019
ఆగమనకాల మూడవ ఆదివారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
యోహాను వారందరితో ఇలా అన్నాడు: “నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడైనవాడు వస్తున్నాడు. ఆయన పాదరక్షల పట్టీలను విప్పడానికి కూడా నేను అర్హుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ఇస్తాడు. తన కళ్లాన్ని శుభ్రం చేసి, గోధుమలను తన గాదెలో పోగుచేయడానికి ఆయన చేతిలో తూర్పారబట్టే చేట ఉంది. కానీ పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు.” లూకా 3:16-17
ఈ ఆదివారం కూడా పునీత బప్తిస్త యోహాను యొక్క మహిమాన్విత సాక్ష్యం మనకు అందించబడుతోంది. పై వాక్యభాగం ఆరాధనా సంవత్సర చక్రంలోని C సంవత్సరానికి చెందినది. అయితే A & B సంవత్సరాలు కూడా బప్తిస్త యోహానును మన ముందుంచుతాయి.
యోహాను తన ఈ బోధలో, యేసు వచ్చి “పవిత్రాత్మతోను అగ్నితోను” జ్ఞానస్నానం ఇస్తాడని చెబుతున్నాడు. “అగ్నితో” జ్ఞానస్నానం పొందడమనే భావచిత్రం ధ్యానించడానికి ఎంతో అనువైనది. మన ఆత్మలు లోతుగా శుద్ధి చెందాలని యేసు కోరుకుంటున్నాడని ఇది ప్రత్యేకంగా మనకు వెల్లడిస్తుంది.
శుద్ధి చెందడం అంటే ఏమిటి? ఒక విషయం ఏమిటంటే, మన ఆత్మ శుద్ధి చెందడం బాధను కలిగిస్తుంది. అయితే ఆ బాధలో ఒక విధమైన మాధుర్యం ఉంటుంది. పాపం నుండి మరలి దేవునికి మరింత దగ్గర కావడానికి గొప్ప త్యాగం, సమర్పణ అవసరం. మనలో శక్తిమంతమైన కార్యాలు చేయడానికి దేవుణ్ణి అనుమతించడం కూడా అవసరం. దేవుడు చేయాలనుకునే అత్యంత శక్తిమంతమైన కార్యం మనలను శుద్ధి చేయడమే.
మనం మరణించిన తరువాత ఉత్తరింపుస్థలం ఉందనే వాస్తవాన్ని మన కతోలిక విశ్వాసం మనకు వెల్లడిస్తుంది. ఉత్తరింపుస్థలం ఎంతో ఆధ్యాత్మిక బాధ కలిగే స్థలమని చెబుతారు. అయితే ఇక్కడ కూడా ఆ బాధలో ఒక విధమైన మాధుర్యం ఉంటుంది. మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నప్పటికీ మనం పట్టుకొని ఉన్నవన్నీ మన నుండి తొలగించబడతాయి కాబట్టి అది బాధాకరం. మనం ఎలాంటివారమో, దేనిని ప్రేమిస్తున్నామో అనే విషయాల్లో సంపూర్ణ పరివర్తనకు లోనవుతాము కాబట్టి అది బాధాకరం. దేవుణ్ణి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం నేర్చుకుంటాము. దేవునిపట్ల మన ప్రేమ ఆలింగనంలో, మనుష్యులందరినీ ప్రేమించడం మొదలుపెడతాము.
ఇది మధురమైనది కూడా. ఎందుకంటే మనం శుద్ధి చెందుతున్న కొద్దీ దేవునికి అపరిమితంగా దగ్గరవుతూ, పవిత్రతలో ఎదుగుతాము. ఇది పాపభారాన్ని తొలగించి, మనం ప్రేమించవలసిన విధంగా ప్రేమించడానికి మనలను స్వతంత్రులను చేస్తుంది.
అయితే మన శుద్ధీకరణ ఉత్తరింపుస్థలంలోనే మొదలవకూడదు. ఆ శుద్ధీకరణ ప్రక్రియలో ఇక్కడే, ఇప్పుడే ప్రవేశించడానికి మనమందరం పిలువబడ్డాము. ఈ రోజు బప్తిస్త యోహాను మాటలను ఆలకించి, పవిత్రమైన జీవితం నుండి మనలను దూరంగా ఉంచే వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపపడి, వాటిని విడిచిపెట్టడానికి మనం పిలువబడ్డాము.
దేవుడు మిమ్మల్ని ఏ శుద్ధీకరణకు పిలుస్తున్నాడో ఈ రోజు ధ్యానించండి. మీరు దేని నుండి విముక్తి పొందాలని ఆయన కోరుతున్నప్పటికీ, ఇంకా దేనిని పట్టుకొని ఉన్నారు? దేవుని ప్రేమ అనే శుద్ధి చేసే అగ్నికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఈ ఆగమనకాలంలో ఆ ప్రేమ మిమ్మల్ని శుద్ధి చేయనివ్వండి.
ప్రభువా, నా ఆత్మను నీవు శుద్ధి చేయాలని నేను ఎంతో తపిస్తున్నాను. పవిత్రమైన జీవితాన్ని నేను నిజంగా కోరుకుంటున్నాను. నీవు నా కోసం సిద్ధం చేసి ఉంచిన ఆనందాన్ని, స్వేచ్ఛను అనుభవించడం మొదలుపెట్టేలా, ఈ ప్రక్రియను ఇక్కడే, ఇప్పుడే ప్రారంభించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఈ క్రిస్మస్కు విశ్వాసమనే బహుమతిని ఇవ్వండి





