తెలుగు

ప్రభువు సన్నిధిలో ఆనందంతో గంతులు వేసిన శిశువు!

డిసెంబరు 21, 2019
ఆగమనకాల వారదినం
నేటి పఠనాలు

పునీత పీటర్ కనీషియస్, యాజకుడు, సభ పండితుడు—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి

“స్త్రీలందరిలో మీరు అత్యంత ధన్యులు, మీ గర్భఫలము దీవించబడినది. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా సంభవించింది? ఇదిగో, మీ పలకరింపు నా చెవులకు సోకిన క్షణమే, నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రభువు మీకు చెప్పినది నెరవేరుతుందని విశ్వసించిన మీరు ధన్యులు.” లూకా 1:42b-45

ఎలిజబెతు మన ధన్యమాతతో పలికిన ఈ సుందరమైన మాటలలో మనం గ్రహించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి! ముందుగా, ఆమె పలకరింపులోని భావాన్ని మనం గమనిస్తాం. అది ఎంతో ఆప్యాయతతో నిండి ఉంది. దేవమాతను, మరియమాత గర్భంలో నివసిస్తున్న తన ప్రభువును కలుసుకున్నప్పుడు ఎలిజబెతు హృదయంలో కలిగిన నిజమైన ఆనందాన్ని సులభంగా గుర్తించవచ్చు.

“నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా సంభవించింది?” మరియను కలుసుకోవడంలో ఎలిజబెతు నిజమైన ఆనందాన్ని పొందిందనీ, ఈ కలయికను గొప్ప దీవెనగా భావించిందనీ ఈ మాటలు వెల్లడిస్తున్నాయి. ఎలిజబెతు మరియకంటే వయస్సులో ఎంతో పెద్దది కాబట్టి ఇది ఆసక్తికరమైన విషయం. మరియ తన దగ్గరకు రావాలని ఆమె “ఆశించి”, ఆ సందర్శనను మామూలు విషయంగా తీసుకొని ఉండవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు; ఎంతో కృతజ్ఞతతో దానిని స్వీకరించింది.

దేవమాతను, ఆమె బిడ్డను కలుసుకునే దీవెన పొందింది ఎలిజబెతు ఒక్కతే కాదని కూడా స్పష్టమవుతోంది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ, స్నాపక యోహాను కూడా ఆనందంతో నిండిపోయి, ఆ ఆనందానికి వ్యక్తీకరణగా గంతులు వేస్తున్నాడు. ఈ సందర్శన ఎలిజబెతుపైనా, ఇంకా జన్మించని ఆమె బిడ్డపైనా ఎంత అద్భుతమైన ప్రభావం చూపింది!

ఇది మీ హృదయంలో ఒక ప్రశ్నను రేకెత్తించాలి. క్రీస్తు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని మీరు గుర్తిస్తున్నారా? ఎలిజబెతు, ఇంకా జన్మించని ఆమె బిడ్డ ఆయనను గుర్తించగలిగితే, మనం కూడా ఆయనను గుర్తించగలగాలి కదా? ఉదాహరణకు, మీరు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు మన ప్రభువు దివ్యసన్నిధిని వెంటనే గుర్తిస్తున్నారా? ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తున్నారా? దివ్యసత్ప్రసాదంలో ఆయనను స్వీకరించేటప్పుడు, మీ దగ్గరకు వచ్చి మీలో నివసించే రక్షకునిపైనే మీ హృదయం ఏకాగ్రంగా నిలిచి ఉంటుందా? దీనికి విశ్వాసం అవసరం; ప్రభువు రాకపైనా, ఆయన సన్నిధిపైనా నిలిచిన చూపు అవసరం.

చూడగలిగే వరం కోసం ఈ రోజు ప్రార్థించండి. మీ చుట్టూ ఉన్న ఆయన దివ్యసన్నిధిని గుర్తించడానికి అవసరమైన చూపును మన ప్రభువు మీకు ప్రసాదించాలని ప్రార్థించండి. ముఖ్యంగా, దివ్యసత్ప్రసాదంలో ఆయనను కలుసుకొని స్వీకరించేటప్పుడు, మీ మనస్సు, హృదయం ఆయన దివ్యసన్నిధికి తెరచుకొని ఉండాలని ప్రార్థించండి.

ప్రభువా, నిన్ను చూడాలని, నిన్ను తెలుసుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నా చుట్టూ అంతటా నీ సన్నిధిని, నీవు నా దగ్గరకు వచ్చే ప్రతి విధానంలోనూ నీ ఉనికిని గుర్తించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దివ్యసత్ప్రసాదంలో నీ సన్నిధిపట్ల శ్రద్ధగా ఉండేలా నాకు సహాయం చేయి. ఈ అత్యంత పరిపూర్ణమైన విధంగా నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నా హృదయం ఎల్లప్పుడూ ఆనందంతో గంతులు వేయునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

ఆగమనకాల వనరులు

నేటి పునీతులు/పండుగలు