తెలుగు

నూతన జన్మ పొందడం

ఏప్రిల్ 20, 2020
పాస్కా రెండవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

“ఆమేన్, ఆమేన్, నేను మీతో చెబుతున్నాను: నీటి ద్వారాను పవిత్రాత్మ ద్వారాను జన్మించకపోతే ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.”  యోహాను 3:5

మీరు నూతన జన్మ పొందారా?  సువార్త ప్రచారానికి ప్రాధాన్యమిచ్చే అనేకమంది క్రైస్తవుల మధ్య ఇది సాధారణంగా వినిపించే ప్రశ్న.  అయితే మనం కూడా ఈ ప్రశ్నను మనల్ని మనం అడుగుకోవాలి.  మరి మీరు నూతన జన్మ పొందారా?  దానికి సరిగ్గా అర్థమేమిటి?

మనలో ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్నకు హృదయపూర్వకంగా “అవును!” అని సమాధానమిస్తారని ఆశిద్దాం.  క్రీస్తులో మనం నూతన జన్మ పొందాలని పవిత్ర గ్రంథం స్పష్టంగా చెబుతోంది.  మన పాత స్వరూపం మరణించాలి, నూతన స్వరూపం జన్మించాలి.  క్రైస్తవులుగా మారడం అంటే ఇదే.  మనం క్రీస్తులో నూతన జీవితాన్ని స్వీకరిస్తాము.

నీటి ద్వారా, పవిత్రాత్మ ద్వారా మనం నూతన జన్మ పొందుతాము.  ఇది జ్ఞానస్నానంలో జరుగుతుంది.  జ్ఞానస్నానం పొందినప్పుడు మనం నీటిలోకి ప్రవేశించి క్రీస్తుతో కలిసి మరణిస్తాము.  నీటి నుండి పైకి లేచినప్పుడు ఆయనలో నూతన జన్మ పొందుతాము.  అంటే జ్ఞానస్నానం మనలో నిజంగా అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది.  మన జ్ఞానస్నానం ఫలితంగా దత్తపుత్రత్వాన్ని పొంది, అతి పరిశుద్ధ త్రిత్వం యొక్క జీవంలోనే భాగస్వాములమవుతాము.  మనలో చాలామందికి పసిబిడ్డలుగా ఉన్నప్పుడే జ్ఞానస్నానం జరిగింది.  మనం తరచుగా ఆలోచించని విషయాలలో ఇది ఒకటి.  కానీ మనం దాని గురించి ఆలోచించాలి.

జ్ఞానస్నానం మన జీవితాలలో నిరంతరమైన, శాశ్వతమైన ప్రభావాన్ని కలిగించే దివ్యసంస్కారం.  అది మన ఆత్మలపై చెరగని ముద్ర వేస్తుంది.  ఈ “ముద్ర” మన జీవితాలలో నిరంతర కృపకు మూలంగా ఉంటుంది.  అది ఎన్నటికీ ఎండిపోని కృపాబావి వంటిది.  మనం జీవించడానికి పిలువబడిన ఘనతకు తగినట్లు జీవించేందుకు, ఈ బావి నుండి నిరంతరం పోషణను, నవీకరణను పొందుతాము.  పరలోకంలోని మన తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి అవసరమైన కృప ఈ బావి నుండి మనకు లభిస్తుంది.

ఈ రోజు మీ జ్ఞానస్నానాన్ని గురించి ధ్యానించండి.  ఈ దివ్యసంస్కారాన్ని పునరుద్ధరించుకోవడానికి మరే కాలంలోకన్నా పాస్కా కాలంలో మనకు ప్రత్యేకమైన పిలుపు ఉంది.  అలా చేయడానికి పవిత్ర జలం ఒక మంచి మార్గం.  మీరు ఈసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు, పవిత్ర జలంతో మీ నుదుటిపై సిలువ గుర్తు వేసుకుంటూ, మీ జ్ఞానస్నానాన్ని, ఈ దివ్యసంస్కారం ద్వారా మీకు లభించిన ఘనతను, కృపను మనసారా గుర్తుచేసుకోవడం మంచిది.  జ్ఞానస్నానం మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చింది.  మీకు ప్రసాదించబడిన ఆ నూతన జీవితాన్ని ఈ పాస్కా కాలంలో అర్థం చేసుకోవడానికీ, దానికి అనుగుణంగా జీవించడానికీ కృషి చేయండి.

పరలోక తండ్రీ, ఈ రోజు నా జ్ఞానస్నానాన్ని పునరుద్ధరించుకుంటున్నాను.  నేను పాపాన్ని శాశ్వతంగా త్యజిస్తున్నాను; నీ కుమారుడైన క్రీస్తు యేసునందు నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను.  నీవు నన్ను పిలిచిన ఘనతకు తగినట్లు జీవించడానికి అవసరమైన కృపను నాకు దయచేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పాస్కా కాలపు ప్రార్థనలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు



దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు:
పునీత ఫౌస్తీనాతో 365 రోజులు