తెలుగు

మార్పు తీసుకురావడం

జూన్ 9, 2020
సామాన్య కాలపు పదవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

పునీత ఎఫ్రేము, ఉపయాజకుడు మరియు సభ పండితుడు—ఐచ్ఛిక స్మరణ

ఆంగ్లంలో వినండి

“మీరు భూమికి ఉప్పు…మీరు లోకానికి వెలుగు.”  మత్తయి 5:13a &14a

ఉప్పు, వెలుగు—అవి మనమే.  మనం అలా ఉన్నామని ఆశిద్దాం!  ఈ లోకంలో ఉప్పుగా లేదా వెలుగుగా ఉండటం అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 

ఈ ఉదాహరణతో ప్రారంభిద్దాం.  మీరు శ్రేష్ఠమైన పదార్థాలన్నీ వేసి అద్భుతమైన కూరగాయల సూపు వండుతున్నారని ఊహించుకోండి.  అది గంటల తరబడి చిన్న మంటపై నెమ్మదిగా ఉడుకుతోంది; ఆ సూపు చూడటానికి చాలా రుచికరంగా ఉంది.  కానీ మీ దగ్గర లేనివల్లా ఉప్పు, ఇతర మసాలా దినుసులే.  అందుకని, బాగానే అవుతుందన్న ఆశతో సూపును అలాగే ఉడకనిస్తారు.  అది పూర్తిగా ఉడికిన తరువాత రుచి చూస్తే, మీకు నిరాశ కలిగించేలా అది కాస్త రుచీపచీ లేకుండా ఉంటుంది.  అప్పుడు, అందులో లోపించిన ఉప్పు కోసం వెతికి, దొరికిన తరువాత సరిగ్గా తగినంత కలుపుతారు.  మరో అరగంట ఉడికిన తరువాత కొంచెం రుచి చూసి ఎంతో సంతోషిస్తారు.   ఉప్పు ఎంతటి మార్పు తేగలదో కదా!  

లేదా, మీరు అడవిలో నడవడానికి వెళ్లి దారి తప్పిపోయారని ఊహించుకోండి.  బయటపడే దారి కోసం మీరు వెతుకుతుండగా సూర్యుడు అస్తమిస్తాడు; మెల్లగా చీకటి పడుతుంది.  ఆకాశం మేఘాలతో నిండి ఉండటంతో నక్షత్రాలుగానీ చంద్రుడుగానీ కనిపించడం లేదు.  సూర్యాస్తమయం అయిన సుమారు అరగంట తరువాత, అడవి మధ్యలో మీరు కటిక చీకటిలో ఉంటారు.  అక్కడ కూర్చొని ఉండగా, అకస్మాత్తుగా మేఘాల మధ్య నుంచి ప్రకాశవంతమైన చంద్రుడు తొంగిచూడటం మీకు కనిపిస్తుంది.  అది నిండు పున్నమి చంద్రుడు; మేఘాలతో నిండిన ఆకాశం తేటపడుతోంది.  ఒక్కసారిగా నిండు చంద్రుడు మీ దారిపై ఎంతగా వెలుగు కురిపిస్తాడంటే, ఆ చీకటి అడవిలో మీరు మళ్లీ దారి చూసుకుంటూ ముందుకు సాగగలుగుతారు.

ఈ రెండు ఉదాహరణలు కాస్తంత ఉప్పు, కొద్దిపాటి వెలుగు ఎంత ముఖ్యమైనవో మనకు తెలియజేస్తాయి.  ఆ కొద్దిపాటిదే అన్నిటినీ మార్చేస్తుంది!  

మన విశ్వాస జీవితంలోనూ ఇలాగే ఉంటుంది.  మనం నివసించే లోకం ఎన్నో విధాలుగా చీకటిలో ఉంది.  ప్రేమ, కారుణ్యం అనే “రుచి” కూడా దాదాపుగా లోపించింది.  ఇతరులు తమ దారిని కనుగొనేలా, ఆ కొద్దిపాటి రుచిని జోడించి, ఆ కొద్దిపాటి వెలుగును ప్రసరింపజేయమని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు.  

చంద్రునిలాగే, మీరు కూడా వెలుగుకు మూలం కాదు.  మీరు వెలుగును ప్రతిబింబిస్తారు మాత్రమే.  దేవుడు మీ ద్వారా ప్రకాశించాలని, మీరు ఆయన వెలుగును ప్రతిబింబించాలని కోరుకుంటున్నారు.  మీరు దీనికి సుముఖంగా ఉంటే, తాను ఎంచుకున్న విధంగా మీ ద్వారా పని చేయడానికి తగిన సమయంలో ఆయన మేఘాలను తొలగిస్తారు.  సుముఖంగా ఉండటమే మీ బాధ్యత.  

మీరు ఎంత సుముఖంగా ఉన్నారో ఈ రోజు ధ్యానించండి.  దేవుడు తన దివ్య సంకల్పానికి అనుగుణంగా మీ ద్వారా పని చేయాలని ప్రతిరోజూ ప్రార్థించండి.  ఆయన దివ్య కృపకు మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి; మార్పు తీసుకురావడానికి ఆయన మీ జీవితంలోని చిన్న విషయాలను ఉపయోగించగల తీరును చూసి మీరు ఆశ్చర్యపోతారు.

ప్రభువా, నీవు నా ద్వారా పని చేయాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.  ఉప్పుగా, వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాను.  ఈ లోకంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.  నన్ను నేను నీకు, నీ సేవకు సమర్పించుకుంటున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

దివ్యహృదయ నవదిన ప్రార్థన
నవదిన ప్రార్థన తేదీలు:జూన్ 10-18, 2020
జూన్ 19, 2020: దివ్యహృదయ మహోత్సవం

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత ఎఫ్రేము, ఉపయాజకుడు మరియు సభ పండితుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు