తెలుగు

కలవరపరిచే పాపం

సెప్టెంబరు 7, 2020
సామాన్య కాలపు ఇరవై మూడవ వారంలోని సోమవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి

“నీ చెయ్యి చాపు.” అతడు అలా చేయగానే అతని చెయ్యి బాగుపడింది. అయితే వారు కోపంతో రగిలిపోయి, యేసుకు ఏమి చేయవచ్చో తమలో తాము చర్చించుకున్నారు.  లూకా 6:10-11

ఇది ఎంతో కలవరపరిచే వాక్యభాగం.  ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఉద్దేశపూర్వకంగా, పన్నాగంతో ఎంతో దుర్బుద్ధితో ప్రవర్తించారని మనం పదేపదే చూస్తున్నాం.  ఇక్కడ వారు యేసు చేసిన పనులలో దేనినైనా పట్టుకొని ఆయనపై నింద మోపడానికి అవకాశం కోసం వెదుకుతున్నారు.  మరి ఆయనపై నింద మోపడానికి వారికి ఏమి దొరికింది?  ఆయన విశ్రాంతి దినాన ఒక అద్భుతం చేయడం వారు చూశారు.  యేసు అలా చేయడం పాపమైనట్లుగా వారు ప్రవర్తించారు.  నిజంగానా?  

ఈ వాక్యభాగం ఇంతగా కలవరపరచడానికి కారణం ఏమిటంటే, ఆనాటి మతనాయకులు స్పష్టంగా తమ గురించి మాత్రమే పట్టించుకున్నారు; తామే ముఖ్యులమనే వారి భావనకు యేసు అడ్డుగా నిలిచాడు.  ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల కంటే ఆయనకు ప్రజాదరణ, గౌరవం పెరుగుతుండటంతో వారు అసూయతో నిండిపోయారు.  

ఈ వాక్యభాగం నుండి మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసూయ అనే పాపం మనలను హేతురాహిత్యం వైపుకు, మూర్ఖత్వం వైపుకు నడిపిస్తుంది.  ఈ పాపం మనకు అంధత్వం కలిగించి, మూర్ఖంగా ఆలోచించేలా, మాట్లాడేలా చేస్తుంది.  ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు చేసింది ఇదే.  విశ్రాంతి దినాన స్వస్థపరచడం వంటి మంచి పని చేసినందుకు, సరిగా ఆలోచించగల ఎవరైనా యేసుపై “నింద మోపుతారా”?  అసూయతో అంధులైనవారు మాత్రమే అలా చేస్తారు.

ఈ వాక్యభాగం కలవరపరిచేదిగా ఉన్నప్పటికీ, అది మన మేలుకు తోడ్పడే విధంగా మనలను కలవరపరచాలని ఆశిద్దాం.  మనలో ప్రతి ఒక్కరం మన జీవితాలను పరిశీలించుకోవడానికి, మన సంబంధాలను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉండాలి.  ఆ సంబంధాలలో దేనిలోనైనా అసూయ ఉన్నట్లు మీకు కనిపిస్తోందా?  ఒక్కోసారి ఈ వ్యక్తి పట్లనో, ఆ వ్యక్తి పట్లనో మీరు హేతుబద్ధంగా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నట్లు గమనిస్తున్నారా?

ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల వలె ప్రవర్తించే ధోరణి మీలో ఏమైనా ఉందేమో నేడు ధ్యానించండి.  మనం కొన్నిసార్లు పోరాడే ఈ వికృతమైన పాపం గురించి మనకు బోధించడానికే వారి చర్యలు పవిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయని తెలుసుకోండి.  ఇందులోని కలవరపరిచే అంశం మీ జీవితంలో అసూయ నుండి విముక్తి పొందేందుకు కృషి చేసేలా మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి.

ప్రభువా, గర్వం, అసూయ, ఈర్ష్య అనే పాపాల నుండి విముక్తి పొందాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.  నా జీవితంలో వీటిని గుర్తించి, వీటి విషయమై పశ్చాత్తాపపడి, వీటి స్థానంలో నీ కరుణను, ప్రేమను నింపుకోవడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

చిత్రం: చెయ్యి పక్షవాతానికి గురైన వ్యక్తిని క్రీస్తు స్వస్థపరుస్తున్నాడు. మోన్రియాలె మహాదేవాలయంలోని బైజాంటైన్ మొజాయిక్ చిత్రం.