సోమవారం, నవంబర్ 30, 2020
పునీత అంద్రేయ అపొస్తలుడు—పండుగ

ఆంగ్లంలో వినండి
యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తూ ఉండగా, పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడైన అంద్రేయను చూశారు. ఆ ఇద్దరు సోదరులు సముద్రంలో వల వేస్తున్నారు; వారు జాలరులు. ఆయన వారితో, “నా వెంట రండి, మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అని అన్నారు. మత్తయి 4:18-19
ఈ రోజు మనం అపొస్తలులలో ఒకరైన పునీత అంద్రేయను గౌరవిస్తున్నాం. అంద్రేయ, ఆయన సోదరుడు పేతురు జాలరులు. త్వరలోనే వారు ఒక కొత్త రీతిలో చేపలు పట్టే పనిని చేపట్టబోతున్నారు. యేసు చెప్పినట్లుగా, వారు త్వరలోనే “మనుష్యులను పట్టే జాలరులు” కాబోతున్నారు. అయితే, మన ప్రభువు వారిని ఈ దైవకార్యానికి పంపే ముందు, వారు ఆయన అనుచరులుగా మారవలసి వచ్చింది. మొదట మన ప్రభువే ఈ మనుష్యులను పట్టే జాలరిగా వ్యవహరించినప్పుడు ఇది జరిగింది.
ఈ సువార్తలో, యేసు అలా నడుచుకుంటూ వెళ్తూ, తమ వృత్తిలో శ్రమిస్తున్న ఈ ఇద్దరు సోదరులను “చూశారు” అనే విషయాన్ని గమనించండి. మొదట యేసు వారిని “చూశారు,” ఆ తరువాత వారిని పిలిచారు. మన ప్రభువు ఈ చూపును గురించి ధ్యానించడం ఎంతో విలువైనది.
మన ప్రభువు దివ్యమైన ప్రేమతో మిమ్మల్ని నిరంతరం చూస్తూ, మీరు మీ దృష్టిని ఆయనవైపు తిప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నారనే గంభీరమైన సత్యాన్ని ఊహించుకోండి. ఆయన చూపు నిరంతరమైనది, లోతైనది. మీరు మిగిలినవన్నీ విడిచిపెట్టి తనను అనుసరించాలని ఆయన చూపు తపిస్తుంది. తనను అనుసరించడానికే కాకుండా, ఆ తరువాత బయలుదేరి విశ్వాసయాత్రలోకి ఇతరులను కూడా ఆహ్వానించడానికి ఆయన చేసే మృదువైన పిలుపును మీరు వినాలని అది కోరుకుంటుంది.
ఈ ఆగమనకాలాన్ని ప్రారంభిస్తున్న మనం, అంద్రేయకు, పేతురుకు వచ్చిన పిలుపు మన పిలుపుగా కూడా మారడానికి అనుమతించాలి. యేసు మనవైపు చూస్తూ, మనం ఎవరమో గ్రహిస్తూ, మనకు సంబంధించిన ప్రతిదీ తెలుసుకుని, ఆ తరువాత మనల్ని ఆహ్వానిస్తూ పలికే మాటను మనం గమనించాలి. ఆయన మీతో, “నా వెంట రండి…” అంటున్నారు. ఈ ఆహ్వానం మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ వ్యాపించాలి. యేసు “వెంట రావడం” అంటే మిగిలినవన్నీ విడిచిపెట్టి, మన ప్రభువును అనుసరించడమే మీ జీవితపు ఏకైక లక్ష్యంగా చేసుకోవడం.
విచారకరంగా, చాలామంది తమ జీవితాల్లో ఈ పిలుపును పెద్దగా పట్టించుకోరు. ఆయన మాటలను వినేవారు కొద్దిమందే; స్పందించేవారు ఇంకా తక్కువమంది; తమ జీవితాలను పూర్తిగా సమర్పించుకొని స్పందించేవారు మరీ తక్కువమంది. మన ప్రభువు పిలుపునకు మీరు ఎలా స్పందిస్తున్నారో మరోసారి పరిశీలించుకోవడానికి ఆగమనకాలపు ప్రారంభం ఒక అవకాశం.
యేసు ఈ మాటలను మీతో పలుకుతున్నారని ఈ రోజు ధ్యానించండి. మొదట, మీ ఆత్మశక్తులన్నిటితో ఆయనకు “అవును” అని చెప్పారా అనే ప్రశ్నను మననం చేయండి. రెండవదిగా, ఈ యాత్రకు మీరు ఎవరిని ఆహ్వానించాలని మన ప్రభువు కోరుకుంటున్నారో ఆలోచించండి. ఎవరిని ఆహ్వానించడానికి యేసు మిమ్మల్ని పంపుతున్నారు? మీ జీవితంలో ఎవరెవరు ఆయన పిలుపును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ద్వారా యేసు ఎవరిని తనవైపు ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నారు? ఈ అపొస్తలులను అనుసరించండి. ఈ పిలుపులో ఏమేమి ఇమిడి ఉన్నాయో వారికి వెంటనే పూర్తిగా అర్థం కాకపోయినా, వారు మన ప్రభువుకు “అవును” అని చెప్పారు. ఈ రోజు “అవును” అని చెప్పండి. ఈ మహిమాన్వితమైన విశ్వాసయాత్రలో తరువాత ఎదురయ్యే దేనినైనా చేయడానికి సిద్ధంగా, సుముఖంగా ఉండండి.
నా ప్రియ ప్రభువా, ఈ రోజు నేను నీకు నిజంగా “అవును” అని చెబుతున్నాను. నీవు నన్ను పిలవడం వింటున్నాను. నీ పవిత్రమైన, పరిపూర్ణమైన చిత్తానికి అత్యంత ఉదారతతో, సంపూర్ణ సమర్పణతో స్పందించాలని ఎంచుకుంటున్నాను. నా జీవితంలో నీకూ, నీ దివ్యపిలుపుకూ ఏదీ సమర్పించకుండా దాచుకోకుండా ఉండటానికి నాకు అవసరమైన ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మరియమ్మ జన్మపాపరహిత గర్భధారణకు నవదిన ప్రార్థన
నవంబర్ 29-డిసెంబర్ 7
నేటి పునీతులు – పునీత అంద్రేయ అపొస్తలుడు—పండుగ
పైన చూపిన ప్రత్యేక చిత్రం: ఆర్టస్ వోల్ఫోర్ట్ చిత్రించిన పునీత అంద్రేయ
ఆగమనకాలానికి సిద్ధపడండి!
ఆగమనకాలం మరియు క్రిస్మస్ ధ్యానాలు
పేపర్బ్యాక్ & ఈ-పుస్తకం
Amazon.com – గూగుల్ ప్లే – ఐట్యూన్స్ – బార్న్స్ అండ్ నోబుల్





