ఫిబ్రవరి 26, 2021
తపస్సుకాలపు మొదటి వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

ఆంగ్లంలో వినండి
“న్యాయస్థానానికి వెళ్లే దారిలోనే మీ ప్రతివాదితో త్వరగా రాజీపడండి. లేకపోతే మీ ప్రతివాది మిమ్మల్ని న్యాయమూర్తికి అప్పగిస్తారు; న్యాయమూర్తి మిమ్మల్ని కాపలాదారునికి అప్పగిస్తారు; మీరు చెరసాలలో వేయబడతారు. ఆమేన్, నేను మీతో చెబుతున్నాను: చివరి పైసా వరకు చెల్లించేవరకు మీరు విడుదల కారు.” మత్తయి 5:26
మన ప్రభువు ఇక్కడ నేర సంబంధమైన లేదా పౌర సంబంధమైన కేసు గురించి, న్యాయవిచారణను ఎలా తప్పించుకోవాలనే దాని గురించి న్యాయసలహా ఇస్తున్నారా? ఎంతమాత్రమూ కాదు. న్యాయవంతుడైన న్యాయమూర్తిగా తనను తాను మనకు చిత్రించి చూపిస్తున్నారు. మన “ప్రతివాది”గా పరిగణించగల ప్రతి ఒక్కరిపట్లా కరుణ చూపమని మనల్ని ప్రబోధిస్తున్నారు.
ఇతరులను క్షమించడం అత్యవసరం. క్షమించడానికి మనం ఎన్నడూ నిరాకరించకూడదు. అయితే నిజానికి క్షమించడం మాత్రమే కూడా సరిపోదు. అంతిమ లక్ష్యం సయోధ్య కావాలి; అది క్షమించడం కంటే ఎంతో ముందుకు వెళుతుంది. పైనున్న ఈ సువార్తలో, మన ప్రతివాదులతో “రాజీ పడమని” యేసు మనల్ని ప్రబోధిస్తున్నారు; అందులో సయోధ్య భావం ఇమిడి ఉంది. బైబిలు ఆర్ఎస్వీ అనువాదం దీనిని ఇలా చెబుతుంది: “మీపై నింద మోపిన వ్యక్తితో త్వరగా స్నేహం చేసుకోండి…” మీపై నింద మోపిన వ్యక్తితో, ముఖ్యంగా అది తప్పుడు నింద అయినప్పుడు, “స్నేహాన్ని” పెంపొందించడానికి కృషి చేయడం అంటే కేవలం ఆ వ్యక్తిని క్షమించడం కంటే ఎంతో ఎక్కువ.
మరొకరితో సయోధ్య కుదుర్చుకొని, నిజమైన స్నేహాన్ని మళ్లీ నెలకొల్పడం అంటే, మీరు క్షమించడం మాత్రమే కాకుండా, ఆ వ్యక్తితో ప్రేమానుబంధాన్ని పునరుద్ధరించడానికి మీ చేతనైనదంతా చేయడం కూడా. మీరిద్దరూ మీ మనస్తాపాలను వెనక్కి వదిలి కొత్తగా ప్రారంభించడం అన్నమాట. ఇందుకు ఇద్దరూ ప్రేమతో సహకరించాలి అనేది నిజమే; అయితే మీ వంతుగా, ఈ సయోధ్యను నెలకొల్పడానికి మీరు ఎంతో కృషి చేయాలని దీని అర్థం.
మిమ్మల్ని బాధపెట్టిన ఒక వ్యక్తి గురించి ఆలోచించండి; ఆ బాధ కారణంగా ఆ వ్యక్తితో మీ అనుబంధం దెబ్బతిని ఉండవచ్చు. దేవుని సమక్షంలో ప్రార్థనాపూర్వకంగా మీరు ఆ వ్యక్తిని క్షమించారా? ఆ వ్యక్తి కోసం ప్రార్థించి, వారిని క్షమించమని దేవుణ్ణి అడిగారా? అలా అయితే, మీ అనుబంధాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రేమతో ఆ వ్యక్తిని సమీపించే తదుపరి అడుగుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఎంతో వినయం అవసరం; ముఖ్యంగా ఆ బాధకు అవతలి వ్యక్తే కారణమైనప్పుడు, మరీ ముఖ్యంగా మీ క్షమాపణను అడుగుతూ తమ విచారాన్ని మీకు తెలియజేయనప్పుడు. వారు అలా చేసే వరకు వేచి ఉండకండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని, ఆ బాధను నయం చేయాలని కోరుకుంటున్నారని చూపించే మార్గాలను వెదకండి. వారి పాపాన్ని పదేపదే వారి ముందు ఎత్తిచూపకండి; పగను పెంచుకోకండి. ప్రేమను, కరుణను మాత్రమే కోరుకోండి.
యేసు ఈ ప్రబోధాన్ని గంభీరమైన మాటలతో ముగిస్తున్నారు. సారాంశమేమిటంటే, సయోధ్య కుదుర్చుకొని మీ అనుబంధాన్ని పునరుద్ధరించడానికి మీ చేతనైనదంతా చేయడంలో మీరు విఫలమైతే, అందుకు మీరు జవాబు చెప్పవలసి ఉంటుంది. మొదట ఇది అన్యాయంగా అనిపించవచ్చు; కానీ అది అన్యాయం కాదని స్పష్టమే. ఎందుకంటే మన ప్రభువు ప్రతిరోజూ మనకు అందించే కరుణ ఇంత లోతైనది. మన పాపం గురించి మనం ఎంత పశ్చాత్తాపపడినా అది ఎన్నటికీ తగినంతగా ఉండదు; అయినా దేవుడు మనల్ని క్షమించి మనతో సయోధ్య కుదుర్చుకుంటారు. ఎంతటి అనుగ్రహం! కానీ ఇదే కరుణను ఇతరులకు అందించడంలో మనం విఫలమైతే, ఈ కరుణను మనకు అందించే దేవుని సామర్థ్యానికి మనమే పరిమితి విధించినట్లవుతుంది. అప్పుడు దేవునికి మనం ఉన్న రుణంలో “చివరి పైసా” వరకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
మీరు పూర్తిగా సయోధ్య కుదుర్చుకొని, ప్రేమానుబంధాన్ని మళ్లీ చిగురింపజేయవలసిన వ్యక్తి మీ మనసులో మెదిలితే, ఈ రోజు ఆ వ్యక్తి గురించి ధ్యానించండి. ఈ అనుగ్రహం కోసం ప్రార్థించండి, దానికి కట్టుబడి ఉండండి, అలా చేయడానికి అవకాశాలను వెదకండి. ఏ సంకోచమూ లేకుండా అలా చేయండి; మీ నిర్ణయానికి మీరు ఎన్నటికీ పశ్చాత్తాపపడరు.
అత్యంత కరుణామయుడవైన నా ప్రభువా, నన్ను క్షమించినందుకు, ఇంత పరిపూర్ణంగా, సంపూర్ణంగా నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నా పశ్చాత్తాపం అసంపూర్ణమైనప్పటికీ నాతో సయోధ్య కుదుర్చుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రియ ప్రభువా, నా జీవితంలో పాపం చేసిన వ్యక్తిని ఎల్లప్పుడూ ప్రేమించాలని కోరుకునే హృదయాన్ని నాకు దయచేయి. నీ దివ్యకరుణను అనుకరిస్తూ, సాధ్యమైనంత సంపూర్ణంగా కరుణ చూపడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సిలువ పాదాల చెంత 40 రోజులు – తొమ్మిదవ ధ్యానం – లోకంలో స్వాగతం లభించకపోవడం
తపస్సు కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
పైన ప్రదర్శించిన చిత్రం: తప్పిపోయిన కుమారుని తిరిగిరాక





