తెలుగు

అంతరంగ పరివర్తన

అక్టోబర్ 12, 2021
సామాన్య కాలం ఇరవై ఎనిమిదవ వారంలోని మంగళవారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు మాట్లాడిన తరువాత, ఒక పరిసయ్యుడు తన ఇంట భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన లోపలికి వెళ్లి భోజనానికి కూర్చున్నారు. భోజనానికి ముందు నియమానుసారం చేతులు కడుక్కోవడాన్ని ఆయన పాటించకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. ప్రభువు అతనితో ఇలా అన్నారు: “ఓ పరిసయ్యులారా! మీరు గిన్నెను, పళ్లెమును వెలుపల శుభ్రం చేస్తారు గాని, మీ లోపల దోపిడీ, దుష్టత్వం నిండి ఉన్నాయి. మూర్ఖులారా!”  లూకా 11:37–40

యేసు ఎవరినైనా మూర్ఖుడని పిలవడాన్ని ఊహించుకోవడం కష్టం. కానీ ఆయన సరిగ్గా అదే చేశారు. ఈ పరిసయ్యుడు యేసు చేసిన అనేక బోధనలను అప్పుడే విన్నాడు. ఆ తరువాత దయ చూపుతున్నట్లుగా మన ప్రభువును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. కానీ ఈ వచనభాగాన్ని చదువుతూ ముందుకు సాగితే, ఈ పరిసయ్యుడు యేసుకు మిత్రుడు కాదని స్పష్టమవుతుంది. అతని ఆతిథ్యం, దయ అతని ఆత్మలోని చెడును కప్పిపుచ్చే ముసుగులు మాత్రమే.

యేసు ఆ పరిసయ్యుణ్ణి మూర్ఖుడని పిలుస్తూ అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు? ఎందుకంటే ఈ పరిసయ్యుడు కపటత్వంతో నిండిపోయాడు. అతని బాహ్య క్రియలు ప్రేమతోను విశ్వాసంతోను నిండిన హృదయం నుండి పుట్టినవి కావు. బదులుగా, అతని బాహ్య క్రియలు ఒక ప్రదర్శన మాత్రమే. అతడు వంచకుడు. చాలామంది పరిసయ్యుల మాదిరిగానే అతడు కూడా భోజనానికి ముందు ఎంతో కచ్చితంగా చేతులు కడుక్కోవడం వంటి వివిధ బాహ్య ఆచారాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. అలా చేయడం తన పవిత్రతకు, దేవునితో తనకున్న సాన్నిహిత్యానికి గుర్తని అతడు నమ్మాడు. కానీ అది నిజం కాదు. అతని హృదయం ఇతరులకు తీర్పు తీర్చే ధోరణితోను, తానే నీతిమంతుణ్ణనే భావంతోను నిండి ఉంది. అతడు ఇతరులను తక్కువచేసి చూసుకుంటూ, తనను తాను గొప్పచేసుకున్నాడు. అలా చేస్తూ అతడు ఇతరులనే కాక తనను తాను కూడా మోసగించుకున్నాడు.

దీని నుండి మనం గ్రహించవలసిన ప్రధాన సందేశం ఏమిటంటే, మన హృదయాల్లో ఉన్నదానిపై మనం శ్రద్ధగా దృష్టి నిలపాలి. మన హృదయాలు, మన అంతరంగ జీవితం దేవునిపట్ల, ఇతరులపట్ల ప్రేమతో వికసించాలి. మన అంతరంగంలో యథార్థమైన సద్గుణ జీవితాన్ని పెంపొందించుకోవడానికి మన శక్తినంతా వెచ్చించాలి. ఇది ప్రార్థన, వినయం ద్వారా సాధ్యమవుతుంది. మనం నిజంగా ఎలాంటివారమో చూసేందుకు వినయం మన కళ్లను తెరుస్తుంది. మనలో మారవలసిన వాటిని గుర్తించినప్పుడు, మారడానికి ప్రార్థన మనకు బలాన్నిస్తుంది. మనం నిజంగా ఎలాంటివారమో స్పష్టంగా చూసి, ప్రార్థన ద్వారా పొందిన కృపపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడినప్పుడే మనం నిజమైన చిత్తశుద్ధి, పవిత్రత గలవారిగా మారగలం. అప్పుడే మన అంతరంగ పవిత్రత మన క్రియలలో బాహ్యంగా వెల్లడవుతుంది.

“మూర్ఖులారా!” అనే యేసు శక్తిమంతమైన ఈ మాటలను నేడు ధ్యానించండి. ఈ మాటలకు నొచ్చుకోకండి; ఇవి మన ప్రభువు పలికిన ప్రేమపూర్వకమైన మాటలు. ఈ పరిసయ్యుణ్ణి మేల్కొలిపి, అతని కపటత్వం నుండి అతణ్ణి దూరంగా నడిపించేందుకు ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నం ఇవి. ఈ మాటలు మీతో కూడా చెప్పబడినట్లుగా వినండి. యేసు చేసిన ఈ ప్రేమపూర్వకమైన మందలింపు నుండి మనలో ప్రతి ఒక్కరం వినయంతో ప్రయోజనం పొందవచ్చు. మనలో ప్రతి ఒక్కరికీ అంతరంగంలో మరింత సంపూర్ణమైన పరివర్తన అవసరం; దానిని మనం వినయంతో స్వీకరించాలి. యేసు మాటలు మీతో మాట్లాడి, మీరు ఏయే విధాలుగా మారవలసి ఉందో మీకు వెల్లడించనివ్వండి. బహుశా మీ గర్వం, అంతరంగంలో ఇతరులకు తీర్పు తీర్చడాన్ని మీకు అలవాటుగా చేసి ఉండవచ్చు. బహుశా మీరు ఒప్పుకోవలసిన పాపాలను చూడలేనంతగా అది మిమ్మల్ని అంధులుగా చేసి ఉండవచ్చు. ఈ మాటలు మీతోనే చెప్పబడినట్లుగా మీరు వినగలిగితే, యేసు తపన మిమ్మల్ని తాకుతుంది. అప్పుడు మీ ఆత్మలో మారవలసిన వాటిని చూడటానికి మీ కళ్లు తెరుచుకుంటాయి. దీనిని చూసీచూడనట్లు ఉండకండి. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి, వినయంతో ఉండండి, ఆలకించండి.

ప్రేమతపనగల నా ప్రభువా, నీవు ఎన్నో విధాలుగా ప్రేమపూర్వకమైన మాటలు పలికావు. కొన్ని సందర్భాల్లో నీవు సౌమ్యంగా ఉన్నావు, మరికొన్ని సందర్భాల్లో దృఢంగా ఉన్నావు. ప్రేమతో నీవు చేసే కఠినమైన మందలింపులను స్వీకరించడానికి నాకు అవసరమైన కృపను, వినయాన్ని దయచేయి. నీ కృప నా అంతరంగ జీవితాన్ని మార్చి, నా క్రియలలోనూ పొంగిపొరలేలా, నా జీవితాన్ని ఏయే విధాలుగా మార్చుకోవాలో చిత్తశుద్ధితో గ్రహించేందుకు నాకు సహాయం చేయి. ప్రియమైన ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను మరింతగా ప్రేమించేందుకు నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన ప్రధాన చిత్రం: పరిసయ్యుడైన సీమోను ఇంటిలో క్రీస్తు — చిత్రకారుడు లూకా సిన్యోరెల్లి, వికీమీడియా కామన్స్ ద్వారా