తెలుగు

నేను చూడాలనుకుంటున్నాను

December 3, 2021
ఆగమనకాల మొదటి వారంలోని శుక్రవారం
నేటి పఠనాలు

పునీత ఫ్రాన్సిస్ జేవియర్, యాజకుడు—స్మరణ

వీడియో

ఆంగ్లంలో వినండి

“మీ విశ్వాసం ప్రకారమే మీకు జరగుగాక.” అప్పుడు వారి కన్నులు తెరుచుకున్నాయి. “ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోండి” అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు.  కానీ వారు బయటకు వెళ్లి, ఆ ప్రాంతమంతటా ఆయన గురించి ప్రచారం చేశారు.  మత్తయి 9:29b–31

యేసు ఈ మాటలను ఇద్దరు అంధులతో అన్నాడు. వారు ఆయన దగ్గరకు వచ్చి, కనికరించి స్వస్థపరచమని వేడుకున్నారు; యేసు తమను స్వస్థపరుస్తాడని విశ్వసించారు; ఆ తరువాత స్వస్థత పొందారు. అయితే ఎంతో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమకు కలిగిన స్వస్థత గురించి ఇతరులతో మాట్లాడవద్దని యేసు వారికి చెప్పాడు. ఆయన ఇలా ఎందుకు చెప్పి ఉంటాడు?

మొదటిగా, యేసు కోరినదాన్ని పాటించడం అసాధ్యమై ఉండేది. ఈ అంధులను ఎరిగిన వారందరికీ వారు అంధులని తెలిసే ఉండేది. అయితే, అనుకోకుండా వారికి చూపు వచ్చింది. ఇలాంటి విషయాన్ని దాచి ఉంచడం ఎలా సాధ్యం?

ఇంతటి అద్భుతాన్ని వారు తమలోనే దాచుకోలేరని యేసుకు నిశ్చయంగా తెలుసు. అయినప్పటికీ, ఆయన ఆ మనుషులతో ఈ మాటలు పలికాడు.  యేసు ఇలా ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలంటే, ఆయన వారిని ఏ ఉద్దేశంతో స్వస్థపరిచాడో మనం అర్థం చేసుకోవాలి.

యేసు కేవలం వారిపట్ల తనకున్న ప్రేమతోనే వారిని స్వస్థపరిచాడు. వారు కనికరం కోసం మొరపెట్టుకున్నారు; యేసు వారికి కనికరం చూపాలనుకున్నాడు. ప్రజల ప్రశంసలనో, పేరు ప్రఖ్యాతులనో సంపాదించుకోవడానికి ఆయన అలా చేయలేదు. ఆ అంధులపట్ల ప్రేమతోనే ఆయన అలా చేశాడు.

మన హృదయాల అంధత్వాన్ని కూడా తాను నయం చేయగలనని బోధించడానికి ఆయన ఈ అద్భుతాన్ని చేశాడు. ఈ వ్యక్తులు తనపై విశ్వాసం ఉంచి, తాను నిజంగా ఎవరో “చూడాలని” ఆయన కోరుకున్నాడు. కాబట్టి, ఈ అద్భుతం ఎంతో లోతైన వ్యక్తిగత ప్రాధాన్యం కలిగినది; ఈ ఇద్దరిపట్ల శ్రద్ధతో, వారి విశ్వాసాన్ని బలపరచడానికి చేసినది.

అయితే, గమనించదగిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన ప్రభువు నుండి ఈ వరాన్ని పొందినప్పుడు కలిగిన ఆనందాన్ని వారు తమలోనే దాచుకోలేకపోయారు. వారు కృతజ్ఞతతో ఎలుగెత్తి చెప్పకుండా, తమ అనుభవాన్ని పంచుకోకుండా ఉండలేకపోయారు. దీనివల్ల యేసు నొచ్చుకోలేదని, దీనిని వారి విశ్వాసం నుండి తప్పక వచ్చే ఫలితంగా చూశాడని మనం నిశ్చయంగా చెప్పవచ్చు.

మరి మీ సంగతి ఏమిటి? మీ జీవితంలో దేవుడు కార్యసాధన చేయడాన్ని మీరు గుర్తించి, ఆ తరువాత మీ జీవితంలో ఆయన చేసిన కార్యం వల్ల కలిగిన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఆయన కార్యానికి, ఆయన అనుగ్రహించిన స్వస్థతకు మీరు క్రమం తప్పకుండా సాక్ష్యమిస్తున్నారా? దేవుడు మీకు చేసినదంతా ఇతరులు చూడగలిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

స్వస్థత పొందినప్పుడు ఆ అంధుల హృదయాలలో కలిగిన ఆనందాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. మీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాల వల్ల మీకు కలిగే ఆనందాన్ని కూడా తలచుకోండి. మీ ఆనందం పొంగిపొర్లకపోతే, మీకు చూపును ప్రసాదించమని గాఢమైన విశ్వాసంతో ప్రభువును అడగడానికి బహుశా ఈ రోజు మంచి సమయం కావచ్చు!

ప్రభువా, నేను చూడగలిగేలా నాకు సహాయం చేయుము; నిన్ను చూడటంలోని ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి నాకు సహాయం చేయుము.  ఆ ఆనందం అందరికీ కనిపించేలా నా జీవితం నుండి ప్రవహించుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మా ఆగమనకాల వనరులన్నింటినీ చూడండి

మరియమ్మ జన్మపాపరహిత గర్భధారణకు నవదిన ప్రార్థన
నవంబర్ 29-డిసెంబర్ 7

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

ఆగమనకాలం కోసం పవిత్ర గ్రంథ ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత ఫ్రాన్సిస్ జేవియర్, గురువు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన ప్రధాన చిత్రం: అంధులను స్వస్థపరుస్తున్న క్రీస్తు చిత్రకారుడు: నికొలా కొలొంబెల్, వికీమీడియా కామన్స్ ద్వారా